Stock Market : సెన్సెక్స్, నిఫ్టీ రికార్డుల మోత.. ఇన్వెస్టర్లకు పండగ!
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. వరుసగా ఆరో రోజు దుమ్మురేపింది. బ్యాంకింగ్ స్టాక్స్ రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. దీంతో ఇంట్రాడేలో సెక్సెక్స్ ఏకంగా 1200 పాయింట్లకు పైగా ఎగిరి గంతేసింది. చాలా రోజుల తర్వాత మళ్లీ 78 వేల పాయింట్ల మైలురాయి తాకింది. ఇక నిప్టి కూడా సత్తా చాటింది. 23,700 స్థాయిని దాటేసింది.
ఈ జోరుతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే భారిగా పెరిగింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ. 5 లక్షల కోట్లకు పెరిగింది.దీంతో మొత్తం మార్కెట్ విలువ ఇప్పుడు రూ.418 లక్షల కోట్లకు చేరింది. నిప్టీ మిడ్ క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సైతం ఒక శాతం మేర లాభపడ్డాయి.

సెన్సెక్స్, నిప్టీ జోరు..
ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభం నుంచే జోరు కనిపించింది. సెన్సెక్స్ లాభాలతో 77,456.27 పాయింట్ల వద్ద ట్రేడింగ్ తో ప్రారంభమైంది. రోజంతా అదేస్థాయిలో కొనసాగింది. మధ్యలో కాస్త జోష్ తగ్గి నెమ్మదించినా.. మళ్లీ పుంజుకుంది. ఇంట్రాడేలో 78,107.23 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 1078.87 పాయింట్ల లాభంతో 77,984.38 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా అదే బాటలో పయనిస్తూ ఇంట్రాడేలో 23,700 పాయింట్ల మార్కును దాటి, చివరకు 307.95 పాయింట్లు లాభపడి 23,658.35 వద్ద స్థిరపడింది. రూపాయి కూడా డాలర్‌తో డాలర్‌తో పోలిస్తే 35 పైసలు బలపడి 85.64 వద్ద నిలిచింది.
టాప్ గేర్‌లో షేర్లు..
సెన్సెక్స్ 30 కంపెనీలలో ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు టాప్ గేర్‌లో దూసుకెళ్లాయి. కానీ టైటాన్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్ షేర్లకు మాత్రం ఈరోజు కలిసి రాలేదు. అవి నష్టాలను చవిచూశాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 72.54 డాలర్లుగా ఉంది, బంగారం ధర మాత్రం మళ్లీ మెరుస్తూ ఔన్సుకు 3030 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
గత కొద్ది నెలలుగా విదేశీ ఇన్వెస్టర్లు (FIIలు) మన మార్కెట్లో షేర్లను అమ్మేస్తూ ఉండడంతో మార్కెట్ కాస్త డీలా పడింది. కానీ సీన్ రివర్స్ అయింది! గత మూడు-నాలుగు రోజులుగా వారు మళ్లీ కొనుగోళ్లు మొదలుపెట్టారు. శుక్రవారం ఒక్కరోజే దాదాపు రూ. 7,470 కోట్ల విలువైన షేర్లను కొనేశారు. దీంతో మార్కెట్‌కు బూస్టర్ డోస్ లభించింది.












Click it and Unblock the Notifications