Silver షేక్ చేస్తుంది: 45 ఏళ్ల తర్వాత కమ్ముకున్న చీకట్లు.
పసిడి, వెండి ప్రేమికులకు.. ఇన్వెస్టర్లకు 2026 మార్చి నెల ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది. దశాబ్దాలుగా 'సురక్షిత పెట్టుబడి'గా భావించే బంగారం, వెండి ధరలు మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా చారిత్రక పతనాన్ని చవిచూశాయి. సరిగ్గా 45 ఏళ్ల క్రితం, అంటే 1980 మార్చి తర్వాత ఈ స్థాయిలో ధరలు కుప్పకూలడం ఇదే మొదటిసారి. కేవలం 30 రోజుల వ్యవధిలోనే బంగారం ధర 20 శాతానికి పైగా, వెండి ధర ఏకంగా 33 శాతం పడిపోవడంతో బులియన్ మార్కెట్ అధికారికంగా 'బేర్ మార్కెట్' (Bear Market) లోకి ప్రవేశించింది. 2026 ఏడాది ఆరంభం నుండి ఇన్వెస్టర్లు గడించిన లాభాలన్నీ ఈ ఒక్క నెల దెబ్బకు తుడిచిపెట్టుకుపోయాయి.
సాధారణంగా అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం ఉంటే బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతాయి. కానీ, ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మార్కెట్‌పై భిన్నమైన ప్రభావాన్ని చూపాయి. యుద్ధం కారణంగా చమురు (Crude Oil) ధరలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం (Inflation) మళ్ళీ పడగ విప్పింది.

ఈ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వంటి కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను దీర్ఘకాలం పాటు అధికంగానే ఉంచే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడ్డాయి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు, ఇన్వెస్టర్లు వడ్డీ లేని బంగారం కంటే బాండ్లు లేదా ఇతర వడ్డీ ఇచ్చే మార్గాల వైపు మొగ్గు చూపడమే ఈ భారీ పతనానికి ప్రధాన కారణం.
బలపడిన డాలర్.. కుంగిన పసిడి
అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ సూచీ (Dollar Index) 93.50 పైన బలంగా కొనసాగుతుండటం బంగారంపై అదనపు భారాన్ని పెంచింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం వెండి ధరలు డాలర్లలోనే నిర్ణయించబడుతుంది కాబట్టి, డాలర్ విలువ పెరిగినప్పుడు ఇతర కరెన్సీలు కలిగిన దేశాలకు బంగారం కొనడం భారంగా మారుతుంది. దీనివల్ల డిమాండ్ తగ్గి ధరలు పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఒక దశలో ఔన్సుకు 4,300 డాల్ల స్థాయికి పడిపోవడం మార్కెట్ ఎంతటి తీవ్రమైన ఒత్తిడిలో ఉందో స్పష్టం చేస్తోంది.
నిపుణుల హెచ్చరిక
ప్రస్తుత పరిస్థితులపై ఎల్‌కేపీ సెక్యూరిటీస్ విశ్లేషకులు జతీన్ త్రివేది స్పందిస్తూ.. బలపడిన డాలర్, అధిక బాండ్ దిగుబడులు ఉన్నంత కాలం బంగారంపై ఈ ఒత్తిడి కొనసాగుతుందని హెచ్చరించారు. వీటీ మార్కెట్స్ ప్రతినిధి రాస్ మాక్స్‌వెల్ అభిప్రాయం ప్రకారం.. మధ్యప్రాచ్య సంఘర్షణల వల్ల పెరిగిన చమురు ధరలు పరోక్షంగా బంగారం ఆకర్షణను తగ్గించాయి. స్థూల ఆర్థిక ఒత్తిళ్లు ఎంత బలంగా ఉన్నాయంటే, అవి సంప్రదాయ 'సురక్షిత పెట్టుబడి' అనే భావనను కూడా అధిగమిస్తున్నాయి. మొత్తానికి 2026 మార్చి నెల బులియన్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోనుంది.












Click it and Unblock the Notifications