Silver: నష్టపోయినా లాభమే! 8 ఏళ్ల వరకు ఆ వెసులుబాటు!
పెట్టుబడి పెట్టడం ఒక ఎత్తయితే, దానిపై వచ్చే లాభాలను పన్నుల బారి నుంచి కాపాడుకోవడం మరో ఎత్తు. చాలామంది ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో షేర్లు కొని నష్టపోతుంటారు, కానీ అదే సమయంలో సిల్వర్ ఈటీఎఫ్ (Silver ETF) వంటి ఇతర సాధనాల్లో లాభాలు గడిస్తుంటారు. అయితే, ఈ రెండింటినీ కలిపి చూస్తే పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చనే విషయం మీకు తెలుసా? సిల్వర్ ఈటీఎఫ్ లాభనష్టాల సర్దుబాటుపై ఇన్వెస్టర్లలో ఉన్న గందరగోళానికి తెరదించుతూ ఆర్థిక నిపుణులు అందిస్తున్న విశ్లేషణ ఇది.
సాధారణంగా స్టాక్ మార్కెట్లో మనకు వచ్చే నష్టాలను 'డెడ్ లాస్'గా భావిస్తుంటాం. కానీ ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, ఆ నష్టాన్ని మనం పొందిన ఇతర లాభాల నుంచి మినహాయించుకోవచ్చు (దీన్నే సెట్-ఆఫ్ అంటారు). ఉదాహరణకు, మీకు షేర్ల అమ్మకం ద్వారా స్వల్పకాలిక మూలధన నష్టం (Short-term Capital Loss) వచ్చిందనుకుందాం. ఈ నష్టాన్ని మీరు సిల్వర్ ఈటీఎఫ్ విక్రయించడం ద్వారా వచ్చిన స్వల్పకాలిక లాభం (STCG) నుంచి తగ్గించి చూపవచ్చు. తద్వారా మీరు నికర లాభంపై మాత్రమే పన్ను కడితే సరిపోతుంది.

Silver ETF's: 12 నెలల మంత్రం
సిల్వర్ ఈటీఎఫ్‌లు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడ్ అవుతాయి కాబట్టి, వీటి పన్ను విధింపు కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది:
- 12 నెలల లోపు: మీరు కొన్న ఏడాది లోపే సిల్వర్ ఈటీఎఫ్‌ను విక్రయిస్తే, దానిని స్వల్పకాలిక లాభంగా పరిగణిస్తారు.
- 12 నెలల దాటితే: ఏడాది దాటిన తర్వాత విక్రయిస్తే దానిని దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG)గా పరిగణించి పన్ను విధిస్తారు.
నిపుణులు చెప్పే 'గోల్డెన్' రూల్స్ ఇవే:
ప్రముఖ ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ బాల్వంత్ జైన్ వివరణ ప్రకారం, నష్టాల సర్దుబాటులో ఈ కింది విషయాలు గుర్తుంచుకోవాలి.
- స్వల్పకాలిక నష్టం (STCL): ఈ నష్టాన్ని స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక లాభాలు.. రెండింటి నుంచీ మినహాయించుకోవచ్చు.
- దీర్ఘకాలిక నష్టం (LTCL): ఈ నష్టాన్ని కేవలం దీర్ఘకాలిక లాభాల (LTCG) నుంచి మాత్రమే మినహాయించడానికి వీలుంటుంది.
- 8 ఏళ్ల వెసులుబాటు: ఒకవేళ ఈ ఏడాది మీకు లాభాలు లేకపోతే, వచ్చిన నష్టాన్ని ఎనిమిదేళ్ల వరకు తదుపరి సంవత్సరాలకు (Carry Forward) తీసుకెళ్లవచ్చు. భవిష్యత్తులో లాభాలు వచ్చినప్పుడు ఈ పాత నష్టాలను వాటి నుంచి తగ్గించుకోవచ్చు.
సిల్వర్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసే వారు తమ ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలోని నష్టాలను గమనించుకుంటే, ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు భారీగా పన్ను ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి, నష్టపోయానని బాధపడకుండా, దానిని పన్ను ప్రయోజనంగా ఎలా మార్చుకోవాలో ప్లాన్ చేసుకోవడమే తెలివైన ఇన్వెస్టర్ లక్షణం.












Click it and Unblock the Notifications