Stock Market : ఆరు రోజుల ర్యాలీకి బ్రేక్.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు.
గత వారం స్టాక్ మార్కెట్లలో లాభాల పండుగ చేసుకున్న ఇన్వెస్టర్లకు ఈ రోజు చేదు అనుభవం ఎదురైంది. ఆరు రోజుల పాటు కొనసాగిన బుల్ దూకుడుకు బ్రేకులు పడ్డాయి. నిన్న స్వల్ప లాభాలతో ఊపిరి పీల్చుకున్న సూచీలు, నేడు మాత్రం కుప్పకూలాయి. నిన్నటి ట్రేడింగ్‌లో నిఫ్టీ 10 పాయింట్లు, సెన్సెక్స్ 32 పాయింట్లు మాత్రమే లాభపడ్డాయి. కానీ, ఈ రోజు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బుల్ జోరు తగ్గి బేర్ పంజా విసిరింది.
ఉదయం నుంచే నష్టాల్లో ట్రేడింగ్..
నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి, నిఫ్టీ ఏకంగా 181 పాయింట్లు కోల్పోయి 23,486 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ మరింత దారుణంగా 728 పాయింట్లు నష్టపోయి 77,209 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా నష్టాల బాటలోనే పయనించింది. నిన్న 97 పాయింట్లు నష్టపోయిన ఈ సూచీ, ఈ రోజు ఉదయం నుంచే నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించింది. చివరికి 398 పాయింట్ల భారీ నష్టంతో 51,370 వద్ద ముగిసింది. దీంతో బ్యాంకింగ్ రంగ షేర్లలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు.

టాప్ గెయినర్స్..
టూరిజం ఫైనాన్స్ కార్ప్ ఆఫ్ ఇండియా, కాప్రి గ్లోబల్ క్యాపిటల్, జెనస్ పేపర్ & బోర్డ్, పిల్ ఇటాలికా లైఫ్‌స్టైల్, SMS లైఫ్ సైన్సెస్ ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. NDL వెంచర్స్, సలాసర్ టెక్నో ఇంజనీరింగ్, BLB షేర్, లోటస్ ఐ కేర్ హాస్పిటల్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.
లాభాల స్వీకరణకే మొగ్గు..
ఇక ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 72.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 85.72 వద్ద కొనసాగుతోంది. ఏడు సెషన్ల పాటు లాభాల ర్యాలీ తర్వాత, ఈ రోజు మార్కెట్లు ఒక్కసారిగా వెనక్కి తగ్గడానికి ప్రధాన కారణం పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమే. ముఖ్యంగా, అమెరికా టారిఫ్ విధానాలపై స్పష్టత లేకపోవడంతో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి వెనుకడుగు వేశారు. దీంతో అమ్మకాల ఒత్తిడి పెరిగి సూచీలు భారీగా పతనమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వస్తే, నిన్న అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్ స్వల్పంగా 4 పాయింట్లు లాభపడి ఫ్లాట్‌గా ముగియగా, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 13 పాయింట్లు, నాస్‌డాక్ 0.46 శాతం లాభపడ్డాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు మాత్రం ఈ రోజు లాభాల్లో ట్రేడింగ్ జరిపాయి. జపాన్ నిక్కీ 0.71 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 0.60 శాతం లాభంతో ముగిశాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు మన మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.












Click it and Unblock the Notifications