లవ్ పుంజుకుంది.. చాక్లెట్లు దంచికొట్టినయ్: వాలెంటైన్స్ డే రికార్డు!
వాలెంటైన్స్ డే(ఫిబ్రవరి 14) నాడు భారతీయులు తమ ప్రియమైన వారికి బహుమతులు పంపడంలో సరికొత్త రికార్డులను సృష్టించారు. ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టామార్ట్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా డిమాండ్ ఊహించని రీతిలో పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి కస్టమర్లు తమ ప్రేమను చాటుకోవడానికి కేవలం చాక్లెట్లు, పూలకే పరిమితం కాకుండా విలాసవంతమైన బహుమతులపై కూడా భారీగా ఖర్చు చేయడం విశేషం.
నిమిషానికి 1,000కి పైగా ఆర్డర్లు
ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 11:59 గంటల సమయంలో ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ల ప్రవాహం తారాస్థాయికి చేరింది. ఆ ఒక్క నిమిషంలోనే ఏకంగా 1,042 ఆర్డర్లు నమోదయ్యాయి. వాలెంటైన్స్ వీక్ ప్రారంభమైనప్పటి నుంచి గిఫ్టింగ్ సెర్చ్‌లు 10 రెట్లు పెరిగాయని సంస్థ వెల్లడించింది. ప్రతి రెండు ఆర్డర్లలో ఒకటి "ఇతరుల కోసం" బుక్ చేయడం గమనార్హం. అంటే దాదాపు 50 శాతం మంది తమ ప్రియమైన వారికి నేరుగా బహుమతులు డెలివరీ చేసేందుకు ఈ యాప్‌ను ఉపయోగించారు.

హార్ట్ షేప్ చాక్లెట్లకు క్రేజ్
వాలెంటైన్స్ డే అంటేనే చాక్లెట్లు. ఈ ఏడాది ముఖ్యంగా హృదయాకారంలో ఉండే చాక్లెట్ల కోసం వెతుకులాట 500 శాతం పెరిగింది. సిల్క్, డార్క్ చాక్లెట్లతో పాటు నట్స్, ఫ్రూట్ ఫ్లేవర్ ఉన్న చాక్లెట్లకు అధిక డిమాండ్ కనిపించింది. కోల్‌కతాకు చెందిన ఓ కస్టమర్ ఏకంగా రూ.25,000 విలువైన ప్రీమియం చాక్లెట్లు మరియు గిఫ్ట్ ప్యాక్‌లను ఒకే ఆర్డర్‌లో బుక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో కూడా భారీ విలువ గల కార్ట్ ఆర్డర్లు నమోదయ్యాయి.
టెడ్డీ బేర్లు, బ్యూటీ ఉత్పత్తుల జోరు
వాలెంటైన్స్ వీక్‌లో భాగమైన 'టెడ్డీ డే' నాడు సాఫ్ట్ టాయ్స్ అమ్మకాలు ఏకంగా 568 శాతం వృద్ధిని సాధించాయి. ఇక గులాబీల కోసం సెర్చ్‌లు గత వారంతో పోలిస్తే 10 రెట్లు పెరిగాయి. కేవలం సాంప్రదాయ బహుమతులే కాకుండా, సెల్ఫ్ కేర్ మరియు బ్యూటీ ఉత్పత్తులపై కూడా కస్టమర్లు మక్కువ చూపారు. కటక్‌లో ఓ కస్టమర్ రూ.15,093 విలువైన మేకప్ కిట్‌ను ఆర్డర్ చేయగా.. సూరత్‌లో ఒకరు అర్థరాత్రి 12:01 గంటలకే రూ.10,845 విలువైన బాత్, హెయిర్ కేర్ ఉత్పత్తులను ఆర్డర్ చేశారు.
మారుతున్న ప్రాధాన్యతలు
ఈ ఏడాది లైంగిక ఆరోగ్యం విభాగంలో కూడా అనూహ్య మార్పులు కనిపించాయి. గతేడాదితో పోలిస్తే ఈ కేటగిరీలో అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయి. ఇది మారుతున్న భారతీయ వినియోగదారుల ఆలోచనా విధానానికి, వాలెంటైన్స్ వేడుకల విస్తృతికి నిదర్శనంగా నిలిచింది. ఓవరాల్‌గా బెంగళూరు నగరం దేశంలోనే అత్యధిక ఆర్డర్లతో మొదటి స్థానంలో నిలవగా.. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.












Click it and Unblock the Notifications