నిన్న రజనీకాంత్ ఫ్యామిలీ, ఇప్పుడు సింగర్ ఏసుదాస్ ఫ్యామిలీ, ఇళ్లల్లో ఏం జరుగుతోంది ?
చెన్నై: సినీ తారల ఇళ్లలో వరుసగా బంగారు నగలు, నగదు, వజ్రాల ఆభరణాలు చోరీ కావడం హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఇంటిలో సుమారు 200 సవర్ల బంగారు నగలు, ఆభరణాలు చోరీ అయిన కేసులో ఇంట్లో పనిచేసే పనిమనిషి, కారు డ్రైవర్ ను అరెస్టు చేశారు. ఇప్పుడు ఫేమస్ సింగర్, నటుడి ఇంట్లో భారీ మొత్తంలో బంగారు నగలు, వజ్రాల ఆభరణాలు చోరీ కావడం హాట్ టాపిక్ అయ్యింది.
చెన్నై సిటీలోని ఆళ్వార్‌పేటలోని అభిరాంపురం మూడవ వీధిలో ప్రముఖ సింగర్ విజయ్ ఏసుదాస్, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ పాటలు పాడి పాపులారిటీ సంపాదించుకున్న సినీ గాయకుడు విజయ్ ఏసుదాస్. కొన్ని సినిమాలో విలన్‌గా నటించాడు. ప్రముఖ సినీ గాయకుడు ఏసుదాస్ కుమారుడే ఈ సింగర్, నటుడు విజయ్ ఏసుదాస్.

తన ఇంట్లో ఉంచిన 60 సవరన్ల బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు మాయమైనట్లు సింగర్ విజయ్ ఏసుదాస్ భార్య దర్శన చెన్నై సిటీలోని అభిరామపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత ఏడాది డిసెంబర్ 2న ఇంటి లాకర్‌లో సుమారు 60 సవరన్ బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు ఉన్నాయని, గత నెల 18న నగలు తీసుకునేందుకు వెళ్లగా లాకర్‌లో ఉంచిన నగలు అలాగే ఉన్నాయని విజయ్ ఏసుదాస్ భార్య దర్శన ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
గత నెల 18వ తేదీ తరువాత నగలు, వజ్రాల నగలు అదృశ్యమైనాయని, ఆ ఆభరణాల కోసం పలు చోట్ల వెతికినా కనిపించకపోవడంతో సింగర్ విజయ్ ఏసుదాస్ భార్య ఈనెల 31వ తేదీన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అలాగే ఇంట్లో పనిచేసే మేనక, సయ్యద్, పెరుమాళ్ లపై అనుమానం ఉందని గాయకుడు విజయ్ ఏసుదాస్ భార్య దర్శన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై అభిరామపురం పోలీసులు కేసు నమోదు చేసి వేలిముద్రల నిపుణులతో విచారణ చేపట్టారు. అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న ఆ ఇంటిలోని ముగ్గురు ఉద్యోగులను పిలిపించి విచారిస్తున్నామని చెన్నై సిటీ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications