ఆదర్శ గ్రామాల్లో తెలంగాణ హవా..10 గ్రామాలు ఇక్కడివే.. మంత్రి కేటీఆర్
దేశంలో ఆదర్శ గ్రామాలను కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో పేర్కొంది. అందులో మొదటి పది గ్రామాలు తెలంగాణ రాష్ట్రలోనివే.. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనా పథకం కింద ఎంపికైన గ్రామాల వివరాలను తాజాగా ఆ వెబ్‌సైట్‌లో ఉంచారు. తొలి 20 ఆదర్శ గ్రామాల్లో10 గ్రామాలు తెలంగాణకు చెందినవే కావడం గమనార్హం.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు, శాఖను చూస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అభినందనలు తెలుపుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇదంతా సీఎం కేసీఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతి సాధించిన ఘనతేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రీట్వీట్ చేశారు. ఇటీవలే వచ్చిన 19 అవార్డులకు ఇది అదనంగా వచ్చిన ప్రశంస అని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

పార్లమెంట్ సభ్యులు తమ నియోజకవర్గాలు, దేశంలోని ఏవైనా గ్రామాలు ఎంపిక చేసుకుని వాటి అభివృద్ధికి కృషి చేసే విధంగా రూపొందించిన పథకమే సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనా. ఈ పథకం కింద ఎంపీలు ఎంపిక చేసుకున్న గ్రామాల అభివృద్ధిని మదింపు చేసి కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తుంది.
స్వచ్ఛ, ఈ పంచాయతీ, ఈ ఆడిటింగ్, బహిరంగ మల విసర్జన రహిs లాంటి అనేక అంశాల్లో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క గంగదేవి పల్లె గ్రామాన్ని దేశానికి ఆదర్శంగా పేర్కొనేవారు. సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా, గ్రామ పంచాయతీలకు నిధులు, అదనపు వనరులు, హంగులు తోడై అన్ని రంగాల్లో గ్రామాలు ఆదర్శంగా మారుతున్నాయి. ఇందుకు నిదర్శనమే ఈ ఉత్తమ గ్రామాల ఎంపిక అని మంత్రి కేటీఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications