ఆసుపత్రిలో కేసీఆర్ అడ్మిట్: హెల్త్ బులెటిన్‌లో..
తెలంగాణ ముఖ్యమంత్రి స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. కడుపునొప్పితో బాధపడుతున్నారు. దీనితో ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇవ్వాళ స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యారు. కడుపునొప్పితో ఆయన బాధపడుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఏఐజీ ఆసుపత్రి యాజమాన్యం కొద్దిసేపటి కిందటే కేసీఆర్ ఆరోగ్యంపై అప్ డేట్ ఇచ్చింది. హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది.

తీరిక లేని షెడ్యూల్..
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ లో పోలింగ్ జరిగే అవకాశం ఉందంటూ కేసీఆర్ సైతం ఇప్పటికే సంకేతాలు పంపించారు. ఎన్నికలకు బీఆర్ఎస్ సమాయాత్తమౌతోంది. కేసీఆర్ జిల్లా పర్యటలనకు పూనుకుంటోన్నారు. పార్టీ నాయకులతో విస్తృతస్థాయి సమావేశాలను నిర్వహిస్తోన్నారు. ఎన్నికల ఏడాది కావడం వల్ల తీరిక లేని షెడ్యూల్ ను ఎదుర్కొంటోన్నారాయన.

ముందస్తు అంచనాలపై..
అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లే విషయాన్ని కేసీఆర్ కొట్టి పారేశారు. అలాంటి ఆలోచన ఏదీ లేదని తేల్చి చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయనీ పునరుద్ఘాటించారు. పార్టీ నాయకులందరూ నియోజకవర్గాల్లోనే ఉండాలని, అన్ని వేళల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉండేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని చెప్పారు. పార్టీ క్యాడర్ కు దిశా నిర్దేశం చేస్తూ వస్తోన్నారు.

ఈ క్రమంలో..
ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీనితో ఈ ఉదయం ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర రెడ్డి సారథ్యంలోని డాక్టర్ల బృందం ఆయనకు పరీక్షలు నిర్వహించింది. సీటీ స్కాన్, ఎండోస్కోపీ పరీక్షలు చేసింది. రెండు గంటల పాటు ఆయన ఆయా వైద్యారోగ్య పరీక్షలను నిర్వహించినట్లు చెబుతున్నారు.

అల్సర్ తో..
సీటీ స్కాన్, ఎండోస్కోపీ పరీక్షల సందర్భంగా కడుపులో అల్సర్ ఏర్పడినట్లు డాక్టర్లు గుర్తించారు. అదేమీ అంత ప్రమాదకరం కాదని, మందులతో నయమౌతుందని తెలిపారు. అల్సర్ కు చికిత్స ప్రారంభించినట్లు వివరించారు. ఆయనకు విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు. అల్సర్ మినహా- కేసీఆర్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే డాక్టర్ డీ నాగేశ్వర్ రెడ్డి- హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు.












Click it and Unblock the Notifications