Governor narasimhan telangana govt assembly session గవర్నర్ నరసింహన్ తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు మిషన్ భగీరథ అసెంబ్లీ సమావేశాలు
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యం: గవర్నర్ నరసింహన్
కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి కొలువుదీరిన తర్వాత ఆయన తొలిసారిగా ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. సాగునీటి రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని కొనియాడారు నరసింహన్. విద్యుత్ కోతలను అధిగమించి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అంధించిన ఘనత ప్రభుత్వానిదని గుర్తు చేశారు. ఇక వచ్చే ఐదేళ్లలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు గవర్నర్ చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వెల్లడించారు.

మార్చి నాటికల్లా మిషన్ భగీరథ పనులు పూర్తవుతాయి
మిషన్ భగీరథ పనులు మార్చినాటికి పూర్తవుతాయని చెప్పిన గవర్నర్ ఇటీవలే సీతారామ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయని వెల్లడించారు. మిషన్ కాకతీయ ద్వారా సాగునీటితో పాటు భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. కేవలం 42 నెలల్లో 800 మెగావాట్ల సామర్థ్యంతో కేటీపీఎస్ ప్రాజెక్టును పూర్తి చేసినట్లు వెల్లడించారు. సౌరవిద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందన్నారు. విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణ తొలిస్థానంలో ఉందని చెప్పిన గవర్నర్... పెరుగుతున్న విద్యుత్ వినియోగం అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు.

రైతు బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది
ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం రైతులకు ఎంతో ఆసరాగా నిలిచిందని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఈ పథకాన్ని దేశంలోని ఆర్థిక వేత్తలు, వ్యవసాయ వేత్తలు ప్రశంసించారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు గవర్నర్ నరసింహన్. ప్రస్తుతం రైతు బంధు పథకాన్ని దేశంలోని చాలా రాష్ట్రాలు అమలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయని సభ దృష్టికి తీసుకొచ్చారు నరసింహన్. ఎలాంటి ఖర్చు లేకుండా రైతులకు కొత్త పాసు పుస్తకాలు అందించినట్లు వెల్లడించిన గవర్నర్... రైతు సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని చెప్పిన గవర్నర్జజజ ప్రభుత్వ అవసరాల కోసం చేనేత కార్మికుల నుంచి భారీగా వస్త్రాలు కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గద్వాలలో టెక్స్‌టైల్ హబ్ నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉందని వివరించారు.

ప్రభుత్వ విధానాలతో తెలంగాణలో కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి
రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తిరిగి అధికారాన్ని కట్టబెట్టాయని గవర్నర్ నరసింహన్ తెలిపారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత ప్రభుత్వానిదని కొనియాడారు. ఇలా చేయడం వల్ల గిరిజనుల కలలను ప్రభుత్వం సాకారం చేసిందన్నారు. ఇక నిరుద్యోగుల కల కూడా నెరవేర్చామని చెప్పిన గవర్నర్ ... ఉద్యోగాల విషయంలో స్థానికులకే ప్రాధాన్యత ఉండాలన్న ఆలోచనతో జోన్ల సంఖ్య రిజర్వేషన్లను పెంచి నట్లు చెప్పారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలతో చాలా సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయని గవర్నర్ నరసింహన్ చెప్పారు. ఇప్పటికే కొత్తగా 4వేల పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పిన గవర్నర్.... ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ పరిశ్రమలు హైదరాబాద్‌కు తరలి వచ్చాయని గుర్తుచేశారు. ఇక అర్హులైన వారందరికీ పింఛన్లు రెట్టింపు చేస్తున్నట్లు చెప్పారు నరసింహన్. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతలను మహిళలకు అప్పగిస్తామని చెప్పారు గవర్నర్. గవర్నర్ ప్రసంగం అనంతరం ఉభయసభలు వాయిదా పడ్దాయి.