Weather Update: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్..!
హైదరాబాద్ లో మంగళవారం ఉదయం పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మాదాపూర్, అయ్యప్పట సొసైటీ, హైటెక్ సిటీ, మోతి నగర్, ఎస్సార్ నగర్, ఎర్రగడ్డ, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ లో వర్షం కురిసింది. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్ల మీదికి వర్షపు నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది వరద నీటిని క్లియర్ చేస్తున్నారు. అయితే అందరు ఆఫీసులకు వెళ్ల సమయంలో వర్షం కురవడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణలో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది మరింత బలంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలో వచ్చే ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇదే సందర్భంలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు కూడా వీస్తాయని వివరించింది. ఇక హైదరాబాద్ లో కూడా వచ్చే ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

సోమవారం కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కూకట్ పల్లి, హైదర్ నగర్, ప్రగతి నగర్ వర్షం కురిసింది. మంగళ, బుధ వారాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వర్షాలు కురిసిన వెంటనే సిబ్బంది నీరు నిలిచిన చోటికి వెళ్తున్నారు. నీటిని క్లియర్ చేస్తున్నారు. అటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు.
అల్పపీడన ప్రభావంతో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కూడా వానలు పడతాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications