మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం: పేలిన సిలిండర్లు!
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసి ఉంచిన సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. స్టేషన్ సమీపంలో బాణసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి సిలిండర్ల మీద పడ్డాయి. ఈ క్రమంలోనే పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ.. ఆస్తినష్టం గానీ జరగలేదన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. సీజ్ చేసిన సామాగ్రిలో ప్లాస్టిక్, చెక్కలకు సంబంధించినవి ఉండటంతో మంటలు చెలరేగాయని తెలిపారు.

పూర్తిగా దగ్ధమైన రెండు ఆర్టీసీ బస్సులు
హైదరాబాద్లో ఆగి ఉన్న రెండు టీఎస్ఆర్టీసీ బస్సులు అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇందులో ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దిల్సుఖ్నగర్ బస్ డిపోలో నిలిపి ఉంచిన రెండు బస్సులు పూర్తిగా దగ్థమయ్యాయి. ఒక బస్సు పూర్తిగా కాలిపోగా.. మరో బస్సు పాక్షికంగా దగ్ధమైంది.
మంటలను గమనించిన బస్సు డిపో సెక్యూరిటీ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్లు వచ్చేలోపు అందుబాటులో ఉన్న నీటితో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత మలక్పేట అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బ్యాటరీలోని కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా మంటలు చెలరేగినట్లు గుర్తించారు ఫైర్ సిబ్బంది. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు.












Click it and Unblock the Notifications