Hydra: మళ్లీ పని ప్రారంభించిన హైడ్రా.. వణికిపోతున్న అక్రమార్కులు..
కొన్ని రోజులుగా నిశబ్దంగా ఉన్న హైడ్రా.. ఇప్పుడు మళ్లీ పని ప్రారంభించింది. తాజాగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) శనివారం ఫిల్మ్ నగర్‌లో ఫిర్యాదుల ఆధారంగా ప్రధాన రహదారులపై అనధికారిక నిర్మాణాలను కూల్చివేసింది. మొదటగా ఈ నిర్మాణాలకు సంబంధించి తనిఖీలు చేశారు. ఇంటి సరిహద్దు గోడ, షెడ్‌తో సహా నిర్మాణాలు రహదారిని ఆక్రమించినట్లు ధృవీకరించారు. ఆ తర్వాతే కూల్చివేత ప్రారంభించారు. కూల్చివేత అనంతరం చెత్తను తొలగించారు.
రెండు రోజుల్లో పూర్తి చేయనున్న రోడ్డు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ జిహెచ్‌ఎంసి ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతిని ఆదేశించారు. ఇందుకు సంబంధించి హైడ్రా ఎక్స్ లో ట్వీట్ చేసింది. "రోడ్డు విస్తరణ పట్ల సంతోషిస్తున్న స్థానికులు, నిర్మాణాలు 15 సంవత్సరాలుగా ఉన్నాయని గుర్తించారు" అని ట్వీట్ లో పేర్కొంది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణారెడ్డిపేట సర్వే నంబర్ 12లో అక్రమ కట్టడాలను సెప్టెంబర్ 22న హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత పటేల్‌గూడ గ్రామంలోని పట్టా సర్వే నెం.6లో ప్రభుత్వ భూమిలో నిర్మించిన 16 అక్రమ నిర్మాణాలను హైడ్రా గుర్తించి.. పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో గట్టి పోలీసు పర్యవేక్షణలో రెవెన్యూ, మున్సిపల్ బృందాల సహకారంతో కూల్చివేతలు చేపట్టారు. బిఆర్‌ఎస్ నాయకుడు తోట చంద్రశేఖర్‌కు సంబంధించిన నిర్మాణాలు జరిగినట్లు తెలుస్తోది. ఇప్పటి వరకు హైడ్రా 26 ప్రదేశాలలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో 111.72 ఎకరాల భూమిని కబ్జాదారుల నుంచి రక్షించింది.
ఇప్పటి వరకు 262 నిర్మాణాలను కూల్చివేసినట్లు తెలిపింది. మాదాపూర్‌లోని సున్నం చెరువు సమీపంలో మొత్తం 42 అనధికార నిర్మాణాలను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు అమీన్‌పూర్‌లోని పెద్దచెరువు దగ్గర 24, గగన్‌పహాడ్‌లోని అప్పచెరువు దగ్గర 14, దుంగిడల్ మున్సిపాలిటీలోని కత్వ చెరువు దగ్గర 13, ముషీరాబాద్ నియోజకవర్గంలోని మణెమ్మ గల్లి, రాంనగర్ కూడలి వద్ద మూడు నిర్మాణాలు కూల్చివేశారు. ఆగస్టు 24న మాదాపూర్‌లోని తుమ్మిడికుంట సరస్సులో 4.9 ఎకరాలను రక్షించారు.












Click it and Unblock the Notifications