వీడియో: ఈ ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఏమైంది?: సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌లో ధ్వంసం
హైదరాబాద్: టాలీవుడ్‌లో తెలుగు సినిమాల రీ- రిలీజ్ హవా నడుస్తోంది. 10 రోజులకు ఒకటి చొప్పున స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. గతంలో సూపర్ హిట్ అయిన, ఓ మోస్తరుగా ఆడిన సినిమాలన్నీ ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ రూపంలో ప్రేక్షకుల ముందుకొస్తోన్నాయి. థియేటర్లల్లో సందడి చేస్తోన్నాయి.
Prabhas fans Are Damaging Sudharshan Theatre 🙏 pic.twitter.com/AOah18ZDkp
— Naveen MB Vizag (@NaveenMBVizag) August 18, 2023
పోకిరి, బిజినెస్‌మెన్, ఒక్కడు, సింహాద్రి, ఖుషీ, జల్సా, ఆరెంజ్, దేశముదురు, బిల్లా వంటి సినిమాలు రీ రిలీజ్ రూపంలో ప్రేక్షకులను కట్టి పడేశాయి. తాజాగా ప్రభాస్ నటించిన యోగితో పాటు రఘువరన్ బీటెక్ సినిమాలు మళ్లీ విడుదల అయ్యాయి. గతంలో ఫ్లాప్ అయిన యోగి సినిమాను చూడటానికి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు.

రీ రిలీజ్ సమయంలో అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. పిచ్చపిచ్చగా రచ్చ చేస్తారు. బస్తాల కొద్దీ పేపర్లను తీసుకొచ్చి గాల్లో ఎగరేస్తూ సంబరాలు చేసుకుంటారు. పాటలకు అనుగుణంగా కుర్చీలను ఎక్కి మరీ స్టెప్స్ వేస్తుంటారు. థియేటర్‌లోనే చిచ్చుబుడ్లను కాల్చడం, బాణాసంచాను పేల్చిన సందర్భాలు కూడా లేకపోలేదు.
వారి అభిమానం అదుపు తప్పి అవాంఛనీయ సంఘటనలు సైతం చోటు చేసుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. స్క్రీన్‌ను చించేయడం, కుర్చీలను విరిచేయడం, సీలింగ్ ఫ్యాన్లను ధ్వంసం చేయడం వంటివి సర్వసాధారణంగా మారాయి.. రీ రిలీజ్ చేసిన థియేటర్లల్లో. దీనికి అయ్యే నష్టం.. థియేటర్ యాజమాన్యం నెత్తిన అదనపు భారాన్ని మిగుల్చుతుంటుంది.
తాజాగా- నంద్యాలలో యోగి సినిమాను రీ రిలీజ్ చేసిన థియేటర్‌లో ప్రభాస్ అభిమానులు గందరగోళం సృష్టించారు. సినిమా ప్రదర్శితమౌతోన్న సమయంలో హఠాత్తుగా షో నిలిచిపోవడంతో వారు బ్లేడ్‌తో స్క్రీన్‌ను చించేశారు. అభిమానులు చేసిన పనికి రెండుచోట్ల స్క్రీన్ చినిగిపోయింది. కుర్చీలు భారీ సంఖ్యలో డ్యామేజ్ అయ్యాయి.
తాజాగా హైదరాబాద్‌లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. థియేటర్‌లో విధ్వంసానికి పాల్పడ్డారు ప్రభాస్ ఫ్యాన్స్. అనంతరం బయటికి వచ్చిన తరువాత కూడా వారి వైఖరి మారలేదు. థియేటర్ బయటకు వచ్చి కూల్ డ్రింక్స్ బాటిళ్లను విసిరారు. అద్దాలను పగులగొట్టారు. ఆవరణలో ఉంచిన కూల్‌డ్రింక్స్ ట్రేలను ఇష్టానుసారంగా విసిరివేశారు.

వారి విధ్వంసానికి థియేటర్ యాజమాన్యం భయభ్రాంతులకు గురైంది. వందల సంఖ్యలో అభిమానులు ఉండటం.. గట్టిగా కేకలు వేస్తూ ఒక్కసారిగా థియేటర్ లోపలి నుంచి బయటికి దూసుకు రావడంతో ఏమీ చేయలేకపోయింది. బయటికొచ్చిన ఫ్యాన్స్ తమ చేతికి అందిన వస్తువులను నేలకు విసిరికొట్టడం కనిపించింది.












Click it and Unblock the Notifications