14 ఏళ్ల బస్తర్ ఒలింపిక్స్ మెడలిస్ట్‌కు గుండెపోటు: వార్మప్ చేస్తుండగానే!
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా ఛింద్‌గఢ్ ప్రాంతంలోని ఓ క్రీడామైదానం నుంచి హృదయ విదారక వార్త వెలుగులోకి వచ్చింది. ఫుట్‌బాల్ ఆడటానికి వెళ్లిన 14 ఏళ్ల విద్యార్థి మహమ్మద్ ఫైజల్ గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా మరణించాడు. టాలెంటెడ్ అథ్లెట్ గా పేరు తెచ్చుకున్న ఫైజల్ గతేడాది బస్తర్ ఒలింపిక్స్‌లో పతకం కూడా గెలుచుకున్నాడు. కానీ ఆదివారం జరిగిన ఈ ఊహించని సంఘటన పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
వార్మప్ చేస్తుండగా కుప్పకూలిన విద్యార్థి
ఆత్మానంద్ విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల మహమ్మద్ ఫైజల్ ఫుట్ బాల్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించినట్లు తెలిసింది. మహమ్మద్ ఫైజల్ ఆదివారం ఉదయం ఎప్పటిలాగే ఫుట్‌బాల్ ఆడటానికి మైదానానికి చేరుకున్నాడు. కొంతసేపు వార్మప్ చేస్తుండగా.. అతను అకస్మాత్తుగా మైదానంలో కుప్పకూలిపోయాడు. వెంటనే అతని సహచర ఆటగాళ్లు, స్థానిక జనాలు అతడిని లేపి ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన డాక్టర్లు ఫైజల్‌కు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, అప్పటికే అతను మరణించినట్లు నిర్ధారించారు.

అలుముకున్న విషాద ఛాయలు
ఈ దుర్ఘటన మహమ్మద్ ఫైజల్ కుటుంబ సభ్యులు, స్నేహితులకు తీరని బాధను మిగిల్చింది. మహమ్మద్ ఫైజల్ చాలా ప్రతిభావంతుడైన అథ్లెట్. గత సంవత్సరం జరిగిన బస్తర్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి పతకం సాధించాడు. అతని ప్రతిభను చూసిన కోచ్‌లు, టీచర్లు ఫైజల్ భవిష్యత్తులో జిల్లాకు గొప్ప అథ్లెట్‌గా ఎదుగుతాడని నమ్మేవారు. ఇంత చిన్న వయస్సులో అకస్మాత్తుగా జరిగిన ఈ మరణం ఆ ప్రాంత ప్రజలందరినీ విషాదంలో ముంచెత్తింది. స్థానికులు, ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు ఫైజల్ మరణాన్ని తీరని లోటుగా భావిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక యంత్రాంగం కూడా సంతాపం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications