సెక్స్ స్కాండల్ కేసులో షాక్, భవానీకి నో బెయిల్, నేడు విచారణ, సిట్ ఆర్డర్ తో ఆ ఫ్యామిలీకి?
హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు లీక్ కావడంతో కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా ఆయన కేసు ప్రతిరోజు వార్తల్లో ఉంటోంది. కర్ణాటకలో జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రచారం కంటే ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియో కేసు కన్నడ మీడియాలో ఎక్కువ వచ్చింది. ప్రజ్వల్ రేవణ్ణ కేసుతో ఇప్పుడు ఆయన తల్లి భవానీ రేవణ్ణ ఇబ్బందుల్లో కూరుకుపోయారు.
సుమారు 35 రోజులుగా పరారీలో ఉన్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను గురువారం అర్ధరాత్రి సిట్ అధికారులు బెంగళూరులోని కంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణను ఆరు రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లి, ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చింది.

మైసూరు జిల్లా కేఆర్ నగరంలో మహిళ అపహరణ కేసులో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కోడలు భవానీ రేవణ్ణ బుధవారం ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక కోర్టుకు మనవి చేశారు. భవానీ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ, హెచ్‌డీ రేవణ్ణలపై అత్యాచారం, లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసులను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) భవానీ రేవణ్ణ ముందస్తు బెయిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇంటి పనిమనిషి అపహరణలో భవానీ రేవణ్ణ పాత్రపై విచారణ జరపాలని సిట్ కోర్టుకు చెప్పింది. భవానీ రేవణ్ణ, ఆమె కుటుంబ సభ్యులు చాలా ప్రభావవంతమైన నాయకులు అని, వాళ్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసి బాధితులను, సాక్షులను ప్రభావితం చేయగలరని సిట్ కోర్టుకు తెలిపింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు భవానీ రేవణ్ణకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించింది.
ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేసి జూన్ 6వ తేదీ వరకు కస్టడీకి తీసుకున్న సిట్ శనివారం హాసన్ జిల్లాలోని హలేనరసీపురలో విచారణకు హాజరు కావాలని భవానీ రేవణ్ణకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల కేసులో ఇప్పటికే ఆయన తండ్రి, మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణను కూడా విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు ఆదేశాలు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications