ఆంటీ అని పిలిచినందుకు .... ఓ మహిళ ఏకంగా కేసు పెట్టేసింది..
ఆంటీ అని పిలిచినందుకు బస్ కండక్టర్‌పై ఓ మహిళ ఏకంగా కేసు పెట్టేసింది. ఇప్పుడు ఈ వార్త దేశవ్యాప్తంగా వైరల్ అవుతొంది. సాధారణంగా పెళ్లయిన అమ్మాయిలను ఎవరైనా ఆంటీ అని పిలిస్తేనే అస్సలు తట్టుకోలేరు చాలామంది. అయితే, ఇలాంటి వాటిని కొంతమంది పెద్దగా పట్టించుకోరు. మరికొందరు మాత్రం గోరంత దాన్ని కొండంత చేస్తుంటారు. అయితే, ఇప్పుడు ఆంటీ ప్రస్తావన ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు. తమిళనాడులో తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అంటీ అని పిలిచాడని ఏకంగా ఆ వ్యక్తిపై కేసు పెట్టింది ఓ మహిళ.
ఆంటీ..ఆంటీ అంటూ పిలిచినా కండక్టర్..
తమిళనాడుకు చెందిన ఓ మహిళ బస్సులో ప్రయాణిస్తుంది. అయితే ఆ మహిళను బస్సు కండక్టర్ ఆంటీ అని పిలిచాడు. ఆ ఆంటీ అనే పిలుపే ఆ కండక్టర్‌ను పోలీస్‌స్టేషన్ దాకా తీసుకెళ్లింది. చిన్న గొడవగా ప్రారంభమైన ఈ వ్యవహారం కాస్త పోలీసు కేసు వరకు వెళ్లింది. చెన్నైలోని మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ బస్సులో ఓ 57 ఏళ్ల నిర్మలాదేవి బస్సు ఎక్కింది. ఆ మహిళ మింట్ నుంచి రెడ్ హిల్స్‌కు వెళ్లేందుకు బస్సు ఎక్కింది.

అయితే అదే బస్సులో కండక్టర్‌గా ఉన్న కార్తిక్.. ఆమె వద్దకు వెళ్లి "ఎక్కడికి వెళ్తున్నారు ఆంటీ" అంటూ అని పలకరించాడు. ఆంటీ అనే పిలుపు వినగానే ఆ మహిళకు చిర్రెత్తుకొచ్చింది. అయితే ఆ కండక్టర్ మరోసారి "టికెట్‌కు సరిపడా చిల్లర ఇవ్వండి ఆంటీ" అంటూ మళ్లీ ఆంటీ అనే పదం ఉపయోగించాడు. దీంతో ఆ మహిళకు కోపం వచ్చింది. వెంటనే తనను ఆంటీ అని పిలవద్దు అని ఆ కండక్టర్‌కు చెప్పింది. అయితే ఆ బస్సులో జనం ఎక్కువగా ఉండటంతో ఆమె చెప్పిన విషయం అతనికి వినబడలేదు. ఆ తర్వాత కూడా మరోసారి ఆంటీ అంటూ ఆ కండక్టర్ ఆ మహిళను పిలిచాడు.
పోలీసులకు ఫిర్యాదు చేసింది..
తనను ఆంటీ అని పిలవద్దు అని చెప్పినా వినకుండా పదే పదే పిలుస్తావా? అని వెంటనే లేచి కండక్టర్ చెంప వాయించేసింది. అక్కడితో సైలెంట్‌గా ఉండకుండా జరిగిన విషయమంతా ఆ మహిళ తన భర్తకు ఫోన్ చేసి మరి చెప్పుకుంది. ఈ గొడవ జరుగుతుండగానే తాను దిగాల్సిన బస్టాప్ వచ్చేసింది. అయితే, ఆ మహిళ భర్త అప్పటికే అక్కడకు చేరుకున్నాడు. బస్సు ఆగడం ఆలస్యం వెంటనే ఆ మహిళ భర్త కండక్టర్‌పై దాడికి దిగాడు. వారిద్దరూ కలిసి కండక్టర్‌ను సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.
విషయం తెలుసుకున్న పోలీసులు కండక్టర్‌పై మహిళా వేధింపుల సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నలుగురిలో తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన కండక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు ఈ ఘటనపై కాస్త భిన్నంగానే స్పందిస్తున్నారు.












Click it and Unblock the Notifications