బిజెపిలోకి ప్రముఖ తార, ఫిల్మ్ స్టార్స్: కాంగ్రెసుకు ధక్కా
భువనేశ్వర్: ఒడియా సీనియర్ నటి అపరాజితా మొహంతి కమలం తీర్థం పుచ్చుకన్నారు. ఇటీవల కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన ఆమె కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో సోమవారం బిజెపిలో చేరారు.
మరికొద్ది రోజుల్లో బైజెపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆమె చేరిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రజా సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన బిజెపికి ఆమె ధన్యవాదాలు చెప్పారు.

బిజెపి సరైన వేదిక
ఒడిశా ప్రజలకు సేవ చేసేందుకు బిజెపి సరైన వేదిక అవుతుందని అపరాజిత అన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే ప్రధాని మోడీ ఆశయ స్ఫూర్తితోనే తాను బిజెపిలో చేరినట్లు ఆమె తెలిపారు.

అప్పుడు ఆమె ఇలా...
అపరాజిత 2014 లో కటక్ లోకసభ స్థానం నుంచి కాంగ్రెసు టికెట్‌పై పోటీ చేశారు. అయితే, ఆమె ఓటమి పాలయ్యారు. బైజపూర్ ఉన ఎన్నిక ఈ నెల 24వ తేదీన జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె బిజెపిలో చేరారు. ఉప ఎన్నిక ఫలితం ఈ నెల 28వ తేదీన వెలువడుతుంది.

ఉప ఎన్నికలో అపరాజిత ప్రచారం
బైజపూర్ ఉప ఎన్నికల్లో అపరాజిత ప్రచారం చేస్తారని, బిజెపి అభ్యర్థికి ఆమె ప్రచారం చేస్తారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అపరాజితతో పాటు మరికొంత మంది ఒడియా ఫిల్మ్ స్టార్లు మిహిర్ దాస్, అను చౌదరి, మహేశ్వేతా రేలు బిజెపిలో చేరారు.

కాంగ్రెసుకు మింగుడు పటడం లేదు
అపరాజితతో పాటు ఫిల్మ్ స్టార్లు బిజెపిలో చేరడం కాంగ్రెసుకు మింగుడు పడడం లేదు. ఈ నెల 13వ తేదీన ఆమె కాంగ్రెసుకు రాజీనామా చేశారు. మోడీ పాలనలో అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు తనను బిజెపిలో చేరేందుకు ప్రేరణ ఇచ్చాయని అపరాజిత అన్నారు.












Click it and Unblock the Notifications