విచారకరం: అద్వానీ, చిన్నమ్మను మరవకండి: సుష్మా

తెలంగాణ బిల్లు విషయంలో కాంగ్రెసు మొదట చెప్పిన ప్రకారం నడుచుకోలేదని లోకసభలో ప్రతిపక్ష నేత, బిజెపి సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ విమర్శించారు. ఐదేళ్ల పాటు తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు మగ్గబెట్టిందని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానిచంారు తెలంగాణపై తమది డబుల్ గేమ్ కాదని, కాంగ్రెసు డబుల్ గేమ్ ఆడిందని ఆమె అన్నారు. బిల్లు ఆమోదించిన తీరునే తాము తప్పు పడుతున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన క్రెడిట్‌ను తనకు కూడా కొంత పంచాలని ఆమె అన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందినందుకు సోనియాకు క్రిడెట్ ఇస్తారు సరే, ఈ చిన్నమ్మను కూడా మరిచిపోవద్దని ఆమె అన్నారు.
కాంగ్రెసు సభ నడిపిన తీరు అభ్యంతరకరంగా ఉందని ఆమె అన్నారు. కాంగ్రెసు రెండు వైపులా లబ్ధి పొందడానికి ప్రయత్నించిందని ఆమె అన్నారు. కాంగ్రెసులోనే తెలంగాణ బిల్లుపై ఏకాభిప్రాయం లేదని ఆమె అన్నారు. కాంగ్రెసుకు చెందిన ముఖ్యమంత్రి బిల్లును తిరస్కరించి పంపించారని ఆమె గుర్తు చేశారు. బిల్లు విషయంలో ద్వంద్వ ప్రమాణాలను పాటించింది కాంగ్రెసు పార్టీయేనని ఆమె అన్నారు.
తెలంగాణకు తాము మొదటి నుంచీ అనుకూలంగానే ఉన్నామని, తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టాలనీ తాము మద్దతు ఇస్తామనీ చెప్పామని ఆమె చెప్పారు. యుపిఎ ప్రభుత్వం తెలంగాణ బిల్లును తేకపోతే తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటు చేస్తామని హామీ కూడా ఇచ్చామని ఆమె గుర్తు చేశారు. 2004లో కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిందని, ఐదేళ్ల పాటు దాన్ని అటక ఎక్కించిందని, తిరిగి 2009లో కూడా వాగ్దానం చేసిందని, చివరకు 2009 డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ జన్మదిన కానుకగా అప్పటి హోం మంత్రి తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారని ఆమె అన్నారు.
చిదంబరం చెప్పిన తర్వాత తిరిగి వెనక్కి వెళ్లిందని ఆమె చెప్పారు. చివరకు పార్లమెంటు చివరి సమావేశాల్లో బిల్లును తెచ్చిందని ఆమె అన్నారు. తాము మద్దతు ఇస్తామని చెప్పినా కాంగ్రెసు నాటకాలాడిందని ఆమె అన్నారు. లోకసభ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపేసినట్లు తమకు తెలియదని ఆమె అన్నారు.
కాంగ్రెసు, బిజెపి మ్యాచ్ ఫిక్సింగ్ ఫలితంగా తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. తమ కాంగ్రెసు పార్టీకి తెలంగాణలో 17 లోకసభ స్థానాలు వస్తాయని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు.












Click it and Unblock the Notifications