గర్బా వేడుకలపై రాళ్ల దాడి-అసలు వివాదం పక్కనబెట్టి ముస్లిం నిందితుల ఇళ్లు కూల్చివేత
మధ్యప్రదేశ్ లో దసరా సందర్భంగా నిర్వహించిన గర్భా వేడుకలపై రాళ్ల దాడి చేసిన ఘటనలో అరెస్టు చేసిన ముగ్గురు ముస్లిం నిందితుల ఇళ్లను పోలీసులు ఇవాళ కూల్చివేశారు. దీంతో ఉద్రిక్త పరిస్దితులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే యూపీలో యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ బుల్డోజర్ తో ప్రత్యర్ధుల్ని భయభ్రాంతుల్ని చేస్తుండగా.. ఇప్పుడు మధ్యప్రదేశ్ లోని కాషాయ ప్రభుత్వం కూడా అదే బాట ఎంచుకోవడం కలకలం రేపుతోంది.
మధ్యప్రదేశ్ లోని సీతామౌ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుర్జని గ్రామంలో అక్టోబర్ 2వ తేదీ రాత్రి జరిగిన ఘర్షణలో 19 మందిపై కేసు నమోదు చేశారు. శివలాల్ పాటిదార్ అనే వ్యక్తి మోటార్ సైకిల్ నడుపుతున్న తీరుపై సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి తండ్రికి ఫిర్యాదు చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి అక్టోబర్ 2న సల్మాన్ తన సహచరులతో కలిసి సదరు వ్యక్తి కోసం వెతకడానికి గార్బా వేదిక వద్దకు చేరుకున్నాడు. ఇక్కడ ఓ గొడవ జరిగింది. ఈ క్రమంలో సల్మాన్... శివలాల్ సహచరుడైన మహేష్ అనే వ్యక్తిని గొడ్డలితో కొట్టినట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది ప్రజలు గుమిగూడడంతో సల్మాన్, అతని సహచరులు గార్బా ఈవెంట్ వేదికపై రాళ్లు రువ్వారు. ఇందులో ఓ మహిళ గాయపడింది.

ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో చికిత్స పొందుతున్న మహేష్, శివలాల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో హింసాత్మక వివాదాన్ని ప్రస్తావించకుండా ముస్లింలు గార్బా వేదికపై రాళ్లు రువ్విన కేసుగా మీడియాలో ప్రచారం జరిగింది. రెండు వర్గాల మధ్య వివాదం కారణంగా గర్బా వేడుకపై రాళ్ల దాడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
అలాగే గర్బా వేడుకపై రాళ్లు రువ్వినందుకు మొత్తం 19 మందిపై 307 (హత్యాయత్నం) సహా ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నిందితుల్లో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని, నిందితుల్లో కొందరు పాత నేరస్తులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ముగ్గురికి చెందిన రూ. 4.5 కోట్లకు పైగా విలువైన 4,500 చదరపు అడుగులకు పైగా అక్రమ నిర్మాణాన్ని రెవెన్యూ శాఖ సహాయంతో పోలీసులు కూల్చివేశారు. ఇలా ఇళ్లు ధ్వంసమైన వారిలో సల్మాన్ అనే నిందితుడు కూడా ఉన్నాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.












Click it and Unblock the Notifications