భార్యలు డబ్బు కోసం పారిపోతున్నారు: అనిరుద్ధాచార్య వ్యాఖ్యలపై దుమారం
మత ప్రచారకుడు అనిరుద్ధాచార్య మహారాజ్ తన ప్రవచనాలతో లక్షలాది మంది భక్తులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఆయన ప్రసంగాలు తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. సమాజంలోని కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల ఆయన కలియుగంలో భార్యాభర్తల సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
రామాయణాన్ని అపహాస్యం చేస్తూ..
మధురలో జరిగిన ఒక ఆధ్యాత్మిక ప్రసంగంలో, అనిరుద్ధాచార్య మహారాజ్ రామాయణంలోని సీత అపహరణ ఘట్టాన్ని నేటి కాలంలోని భార్యాభర్తల సంబంధాలతో పోల్చారు. ఆయన మాట్లాడుతూ.. నేటి కాలంలో డబ్బు కోసం భార్యలు తమ భర్తలను వదిలి పారిపోతున్నారని ఆరోపించారు. ఒకవేళ రావణుడు సీతను అపహరించడానికి వచ్చినట్లుగా, ఇప్పుడు భార్యలను ఎత్తుకెళ్లడానికి వస్తే, వారే స్వయంగా అతని విమానంలో దూకి 'మమ్మల్ని తీసుకెళ్ళు' అని బతిమలాడతారని పేర్కొన్నారు. అంతేకాకుండా, వారే స్వయంగా రావణుడికి ఉత్తరాలు రాసి, 'నేను ఇక్కడ ఉన్నాను, నన్ను అపహరించుకుపోవడానికి రా' అని ఆహ్వానిస్తారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రామాయణంలోని పవిత్రతను దెబ్బతీసేవిగా, మహిళలను కించపరిచేవిగా ఉన్నాయి.

గతంలోనూ అనిరుద్ధాచార్య వివాదాస్పద వ్యాఖ్యలు
అనిరుద్ధాచార్య మహారాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన అనేక సందర్భాల్లో విమర్శలను ఎదుర్కొన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహించే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. అమ్మాయిల పెళ్లి వయస్సు 18 ఏళ్ల కంటే ముందే ఉండాలని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఇండియాలో చట్టబద్ధంగా అమ్మాయిల వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉండగా.. అంతకంటే ముందు పెళ్లి చేయాలని సూచించడం సమాజంలో తప్పుడు సంకేతాలు పంపేదిగా ఉందని చాలా మంది విమర్శలు గుప్పించారు.
ఆధునిక జీవనశైలిలో భాగంగా మారిన లివ్-ఇన్ సంబంధాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయన లివ్-ఇన్ సంబంధాలను కుక్కలు, పిల్లుల ప్రవర్తనతో పోల్చారు. "ఇది కుక్కల సంస్కృతి" అని ఆయన చేసిన వ్యాఖ్యలు అనేకమందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఒక మత ప్రచారకుడు సామాజిక అంశాలపై ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించే వారికి కొదవలేదు.
అనిరుద్ధాచార్య మహారాజ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మద్దతుదారులు ఆయన నిజం మాట్లాడుతున్నారని, సమాజానికి సరైన మార్గాన్ని చూపిస్తున్నారని సమర్థిస్తుండగా, విమర్శకులు మాత్రం ఆయన వ్యాఖ్యలు సమాజంలో అనైతికతను, మహిళలపై అసభ్యతను పెంచుతున్నాయని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications