భూమ్మీద 'స్వర్గం' అంటే ఇదే.. ఇక్కడికి వెళ్తే మళ్లీ రావాలనిపించదు..!
మంచుకొండలను చూస్తే ఎవ్వరైనా మైమరచిపోవాల్సిందే.. ఉత్తరాఖండ్ లోని ఔలి అనే హిల్ స్టేషన్ ఇప్పుడు పర్యటకులకు స్వర్గధామంగా మారింది. ఈ టూరిస్ట్ ప్లేస్ గురించి చాలామందికి తెలియదు.. ఇటీవల యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టా రీల్స్ కారణంగా ఒక్కసారిగా పాపులర్ అయింది. ఔలి ప్రాంతాన్ని 'భారత స్కీయింగ్ రాజధాని' అని పిలుస్తారు. ఇక్కడి మంచులో స్కీయింగ్ ఆట ఫేమస్. అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది.
ఔలి టూరిస్ట్ ప్లేస్ ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో ఉంది. ఈ ప్రాంతం చుట్టూ మంచుతో నిండిన హిమాలయ శిఖరాలు, పచ్చని మైదానాలు అలాగే దట్టమైన ఓక్ అడవులతో నిండి ఉంటుంది. సముద్ర మట్టానికి సుమారు 2,800 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ హిల్ స్టేషన్ నుంచి 'నందా దేవి' పర్వతాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఈ పర్వతాల మధ్య నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం చూడటమే కానీ మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది.
అలాగే ఔలి టూరిస్టు ప్రాంతంలో సాహసప్రియులు హైకింగ్, స్కైయింగ్ వంటివి ఎంజాయ్ చేసే వీలుంది. దాంతో ఇక్కడికి నిత్యం వందలాది మంది టూరిస్టులు వస్తుంటారు. ఈ ప్రాంతం హిమాలయాలకు తక్కువ దూరంలోనే ఉన్న క్రమంలో అందమైన అడవులు పర్యాటకుల్ని మరింతగా ఆకట్టుకుంటాయి. ఇక ఇక్కడి చల్లని వాతావరణం, స్వచ్ఛమైన గాలి, ప్రకృతి అందాలు రోజూవారీ బిజీ లైఫ్, ఉరుకులు పరుగుల జీవితం, కాంక్రీట్ లైఫ్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. థ్రిల్లింగ్ ను పంచే వింటర్ స్పోర్ట్స్ నుంచి హాయిగా సాగే వేసవి నడకల వరకు ఔలి ఏడాది పొడవునా పర్యటకులకు స్వాగతం పలుకుతుంది.
ఔలిలో చూడాల్సిన ప్రదేశాల్లో మానవ నిర్మితమైన సరస్సు ఒకటి. చుట్టూ కొండలు, అడవుల మధ్య ఈ సరస్సు ఉంటుంది. అలాగే గోర్సన్ బుగ్యాల్ కూడా మంచి ట్రెక్కింగ్ ప్లేస్ గా పేరుపొందింది. ఇది ఔలి పట్టణం నుంచి సుమారు 3 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక చత్రాకుండ్ అనే సరస్సు కూడా పర్యాటకులకు అమితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు క్రిస్టల్ క్లియర్ వాటర్ చూసే అవకాశం ఉంది. వీటితోపాటు కువారీ పాస్, సప్త్ కుండ్, పంగార్చుల్లా.. ట్రెక్కింగ్ పాయింట్లు పర్యాటకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి.

ఇక ఔలిని చేరుకోవాలంటే సమీప విమానాశ్రయం డెహ్రాడూన్ లోని జోలీ గ్రాంట్ ఎయిర్‌పోర్ట్.. అక్కడ నుండి మీరు టాక్సీ ద్వారా ఔలి హిల్ స్టేషన్ కు ఈజీగా చేరుకోవచ్చు. అలాగే సమీప రైల్వే స్టేషన్ అయితే రిషికేశ్.. అక్కడి నుండి రోడ్డు మార్గంలో జోషిమఠ్ చేరుకుని.. అక్కడి నుంచి ఔలికి చేరుకోవచ్చు. ఇక రోడ్డు మార్గం అయితే ఉత్తరాఖండ్ లోని ప్రధాన నగరాల నుండి ఔలికి రోడ్డు సౌకర్యం ఉంది. జోషిమఠ్ వరకు టాక్సీలు గానీ బస్సులు గానీ అందుబాటులో ఉంటాయి.












Click it and Unblock the Notifications