PF చందాదారులకు భారీ గుడ్ న్యూస్- విత్ డ్రా విధానంలో కీలక మార్పులు..!
దేశవ్యాప్తంగా పీఎఫ్ చందాదారులైన (EPF Subscribers) ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) ఇవాళ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా రిటైర్మెంట్ వేళ తీసుకునే పీఎఫ్ ప్రయోజనం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 6.2 లక్షల మంది రిటైర్ అవుతున్న ఉద్యోగులకు ప్రయోజనం కలగబోతోంది. దీనికి సంబంధించిన వివరాలను భవిష్యనిధి సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
పీఎఫ్ చందాదారులైన ఉద్యోగులు తమ రిటైర్మెంట్ వేళ పీఎఫ్ మొత్తాన్ని ఒకేసారి ఉపసంహరించుకోకుండా నెల వారీ వాయిదాల్లో విత్ డ్రా చేసుకునేందుకు అనుమతిస్తూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజా మార్పు ప్రకారం రిటైర్ అయిన వారు తమ పీఎఫ్ పొదుపు మొత్తం నుంచి క్రమం తప్పకుండా ఆదాయం పొందుతూ, మిగిలిన డబ్బును ఈపీఎఫ్ లోనే పెట్టుబడిగా ఉంచుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకూ రిటైర్ కాగానే పూర్తి మొత్తం పీఎఫ్ చందాదారులకు వడ్డీతో సహా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు కొంత మొత్తం తీసుకుని, మిగతా మొత్తం ఉంచుకునే ఛాన్స్ లభించింది.

తాజా నిర్ణయం వల్ల పీఎఫ్ చందాదారులు రిటైర్ అయినప్పుడు తీసుకునే మొత్తం తర్వాత మిగిలిన మొత్తానికి అప్పుడు వర్తించే వడ్డీ ప్రకారం భవిష్యత్తులో తీసుకునే అవకాశం లభిస్తుంది. దీంతో తమ పీఎఫ్ ఖాతాల్లో 5 లక్షలకు పైగా పీఎఫ్ కలిగిన 55 ఏళ్లు పైబడిన సుమారు 6.2 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం లభించనుంది. తాజా మార్పులతో పీఎఫ్ లో దాచుకున్న డబ్బును వాయిదాలతో తీసుకునే అవకాశంతో పాటు మిగిలిన మొత్తంపై బయట ప్రత్యామ్నాయ పథకాల కన్నా మంచి వడ్డీ రేటు పొందే అవకాశం లభించనుంది. అసలు మొత్తాన్ని ఉంచి, సంపాదించిన వడ్డీ మాత్రమే తీసుకునే ఆప్షన్ కూడా ఇందులో కల్పించబోతున్నారు.
అలాగే పీఎఫ్ చెల్లింపు వ్యవధిలో చందాదారుడు చనిపోతే, నామినీ లేదా వారిపై ఆధారపడిన వారు మిగిలిన మొత్తం విత్ డ్రా చేసుకోవడానికి లేదా అతని తరహాలోనే ఆయా చెల్లింపుల్ని తర్వాత కూడా తీసుకోవడానికి సైతం వీలు కల్పిస్తారు. తాజా మార్పులతో రిటైర్ అయిన ఉద్యోగులు పీఎఫ్ ద్వారా వచ్చిన డబ్బుపై వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే 55 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న సభ్యులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ లో 75 శాతానికి బదులు 90 శాతం వరకూ వెనక్కి తీసుకునే అవకాశం కల్పించారు. అయితే ఈ మార్పులు వెంటనే అమల్లోకి రావు. ఈపీఎఫ్ఓ అధికారికంగా నోటిఫై చేసి, మార్గదర్శకాలు విడుదల చేశాక ఇవి అమల్లోకి వస్తాయి.












Click it and Unblock the Notifications
