Bihar Election 2025 Schedule : బీహార్ ఎన్నికల తేదీలు విడుదల-పూర్తి వివరాలివే..!
జాతీయ స్ధాయిలో పలు లెక్కలు మారుస్తుందని అంచనా వేస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీల్ని ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్లో సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఇప్పటికే బీహార్ లో భారీ ఎత్తున ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణలు జరగడం, ఇందులో ఈసీ పాత్రపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకోవడం వంటి పరిణామాల మధ్య ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.
బీహార్ ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా జరుగుతాయని సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఓటర్లకు హామీ ఇచ్చారు. ప్రత్యేక ఓటర్ల సవరణతో జాబితాలను ప్రక్షాళన చేసినట్లు ఆయన తెలిపారు. ముసాయిదా ప్రకటన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ,, వ్యక్తుల అభ్యంతరాలు, వాదనలు వినిపించాలని కోరామని, తుది ముసాయిదా సెప్టెంబర్ 30న ప్రచురించామని ఆయన తెలిపారు. కాబట్టి దీనిపై ఎలాంటి అపోహలకు తావులేదన్నారు.

బీహార్ ఎన్నికల సందర్భంగా ఓటర్లలో విశ్వాసాన్ని నింపేందుకు సీఏపీఎఫ్ బలగాల్ని మోహరించినట్లు సీఈసీ తెలిపారు. అధికారులు పూర్తిగా నిష్పాక్షికంగా వ్యవహరించాలని, ప్రసార మాధ్యమాల్లో ఫేక్ వార్తలు నకిలీ వార్తలు లేదా తప్పుడు సమాచారం ఉంటే, దానికి కౌంటర్ ఇవ్వాలని సూచించారు. మాదకద్రవ్యాలు, మద్యం , నగదు లావాదేవీలను నిరోధించడానికి అన్ని చెక్‌పోస్టుల వద్ద కఠినమైన నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు సీఈసీ తెలిపారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్ని రెండు దశల్లో నిర్వహిస్తున్నట్లు సీఈసీ తెలిపారు. నవంబర్ 6, 11 తేదీల్లో ఈ ఎన్నికలు ఉంటాయన్నారు. నవంబర్ 14న ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఈ ఎన్నికల కోసం భారీ ఎత్తున ఎన్నికల సిబ్బందిని నియమిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 90712 మంది బీఎల్వోలు, 243 మంది ఈఆర్వోలు, 38 మంది డీఈఓలు ఎన్నికల విదుల్లో ఉంటారన్నారు.
బీహార్ లో తొలి దశ ఎన్నికలకు ఈ నెల 10 నోటిఫికేషన్ విడుదలవుతుంది. 17వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 18న నామినేషన్ల పరిశీలన తర్వాత 20న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. అనంతరం నవంబర్ 6న పోలింగ్ నిర్వహిస్తారు. అలాగే రెండో దశ ఎన్నికలకు ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ నెల 20 వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 21న నామినేషన్ల పరిశీలన, 23న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం వచ్చే నెల 11న రెండో దశ పోలింగ్ ఉంటుంది. అనంతరం నవంబర్ 14న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటాయి.












Click it and Unblock the Notifications