మీరేమైనా దేవుడనుకుంటున్నారా? హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
మీరేమైనా ఈ వ్యవస్థకు దేవుడినని భావిస్తున్నారా? కోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయరా?" అంటూ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులపై బాంబే హైకోర్టు నిప్పులు చెరిగింది. ఆహార భద్రతా నిబంధనలను 88 శాతం మేరకు కచ్చితంగా పాటిస్తున్నట్లు స్వయంగా తనిఖీల్లో తేలినప్పటికీ, రెస్టారెంట్ల లైసెన్సుల నిలిపివేత ఎత్తివేసేందుకు నిరాకరించిన ఎఫ్‌డీఏ తీరుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది.
అధికారుల మొండి వైఖరిపై విసిగిపోయిన ధర్మాసనం.. తక్షణమే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరిస్తూ, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లోని ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రాంగణంలో మూతపడిన ఐదు ప్రముఖ రెస్టారెంట్లను వెంటనే తెరుచుకోవచ్చని సంచలన తీర్పునిచ్చింది.

88 శాతం నిబంధనలు పాటించినా మళ్లీ ఆంక్షలా?
పరిశుభ్రత లోపాలు, మూడో వ్యక్తికి నిర్వహణ బాధ్యతలు అప్పగించారనే నెపంతో ఎఫ్‌డీఏ అధికారులు ఎంసీఏ ప్రాంగణంలోని ఐదు రెస్టారెంట్ల లైసెన్సులను రద్దు చేస్తూ గతంలో ఆదేశాలు ఇచ్చారు. దీనిపై ఎంసీఏ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఇటీవల నిర్వహించిన తాజా తనిఖీల్లో ఈ రెస్టారెంట్లు 88 శాతం ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటిస్తున్నాయని స్పష్టమైంది. అయినప్పటికీ, లైసెన్సులు ఎంసీఏ పేరిట ఉండి.. నిర్వహణ మాత్రం షిర్కే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వద్ద ఉందనే సాంకేతిక కారణాన్ని సాకుగా చూపి ఎఫ్‌డీఏ ఆంక్షలు కొనసాగించడమే వివాదానికి మూలకారణంగా మారింది.
"కోర్టు మాట వినకపోతే జైలుకే పంపుతాం!"
టెక్నికల్ గా కాకుండా వ్యవహారికంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని గత విచారణలోనే ఎఫ్‌డీఏకు సూచించామని, అయినా అధికారులు కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి మొండిగా ప్రవర్తించారని తాత్కాలిక చీఫ్ జస్టిస్.. జస్టీస్ రవీంద్ర ఘుగే, జస్టిస్ గౌతమ్ అంఖాడ్‌ల ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. "ప్రతిసారీ డిపార్ట్మెంట్ అధికారులకు మొట్టికాయలు వేసి అలసిపోయాం. ఇప్పుడు కఠినమైన చర్యలు తీసుకోక తప్పడం లేదు. బాధ్యులైన అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించి జైలుకు పంపడానికైనా వెనుకాడబోం" అని న్యాయమూర్తులు హెచ్చరించారు.
రెస్టారెంట్లు తెరుచుకోవచ్చని స్పష్టమైన ఆదేశాలు
చట్టంలో స్పష్టమైన వెసులుబాటు ఉన్నప్పుడు, నిబంధనలు పాటించిన రెస్టారెంట్లను మూసివేయడానికి వీల్లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. కాంట్రాక్టు ఒప్పందాలపై ఎంసీఏ వివరణ తీసుకుని చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఎఫ్‌డీఏ కోర్టుకు హామీ ఇవ్వడంతో, ఆలోగా ఈ ఐదు రెస్టారెంట్లలో కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని హైకోర్టు అనుమతించింది. చట్టపరమైన అంశాలను సరిగా విశ్లేషించకుండా అధికారులు ఇంత తొందరపాటుగా ఎందుకు వ్యవహరించారో సమాధానం చెప్పాలని బాంబే హైకోర్టు నిలదీసింది.













Click it and Unblock the Notifications