అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్
తమిళనాడు ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ అక్కడి వాతావరణం వేడెక్కుతోంది. సీట్లు, నియోజకవర్గాల పంపకాల్లో ఆయా పార్టీల అగ్రనేతలు తీరిక లేకుండా గడుపుతున్నారు. డీఎంకే, అన్నా డీఎంకే, టీవీకే.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.
ఈ పరిణామాల మధ్య తమిళన వెట్రి కజగం అధినేత విజయ్.. పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఆయన స్వయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రెండు నియోజకవర్గాల నుంచి బరిలో దిగనున్నారు. ఇదివరకే వార్తలు వచ్చినట్లుగా పెరంబూర్ స్థానం నుంచి విజయ్ బరిలో దిగారు. అదే సమయంలో మరో నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నారు. తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి కూడా ఆయన రేసులో నిల్చొన్నారు.

దీనిపై రాజకీయ, సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అధికార డీఎంకే సానుభూతిపరుడిగా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు బోస్ వెంకట్.. విజయ్ ను మెగాస్టార్ చిరంజీవితో పోల్చారు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావించారు. 2009 ఏపీ శాసనసభ ఎన్నికల్లో చిరంజీవి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన తీరును గుర్తు చేశారు. ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించిన వెంటనే చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగిన సంగతిని గుర్తు చేసుకున్నారు.
ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఆశించిన మేరకు రాణించలేకపోయింది. పాలకొల్లులో స్వయంగా చిరంజీవి సైతం ఓడిపోయారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. రాజ్యసభకు నామినేట్ అయ్యారు. కేంద్ర మంత్రిగా పని చేశారు. తదనంతరం పూర్తిగా క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకొన్నారు.
తాజాగా విజయ్ రాజకీయాలను చిరంజీవితో పోల్చారు బోస్ వెంకట్. చిరంజీవికి ఆంధ్రప్రదేశ్‌లో అప్పట్లో భారీ ప్రజాదరణ ఉన్నా, ఆయన పార్టీకి తగినన్ని సీట్లు లభించలేదని చెప్పారు. సినిమా రంగంలో ఎంత పాపులారిటీ ఉన్నప్పటికీ, రాజకీయాల్లో అది విజయాన్ని అందించలేదనే విషయాన్ని చిరంజీవిని చూసి తెలుసుకోవచ్చని అన్నారు. చిరంజీవికి ఉన్న క్రేజ్ ఓట్లుగా పడలేదని వ్యాఖ్యానించారు.
రాజకీయాలు వేరు.. సినిమా వేరు అని బోస్ వెంకట్ తన పోస్ట్‌లో రాశారు. విజయ్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. అదే బోస్ వెంకట్ ఇటీవలే సూర్యను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించిన విషయం తెలిసిందే. టీవీకే పార్టీ ప్రారంభమైన కొద్దికాలానికే సూర్య రాజకీయ ఎంట్రీని కోరుకున్నారాయన. బోస్ వెంకట్ డీఎంకే మద్దతుదారుడిగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం సైతం నిర్వహించారు.












Click it and Unblock the Notifications