వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిండి: కేరళను తలపించే ఈ కోనసీమ రిసార్ట్స్ ప్రత్యేకత ఏమిటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
దిండి రాసార్ట్స్

ఆత్మీయ ఆతిథ్యానికి మారుపేరైన గోదావరి జిల్లాల్లో చెప్పుకోదగ్గ, చూడదగ్గ ప్రాంతాలు కోకొల్లలు. వాటిలో దిండి ప్రత్యేకమైనది.

కోనసీమలో ఏ ప్రాంతానికి వెళ్లాలి? అని బాగా సెర్చ్ చేసి ''దిండి రిసార్ట్స్’’ బాగుంది అని అక్కడికి వచ్చేశాం.

ఇంతకీ దిండి విశేషాలేమిటి? ఇక్కడకు ఎలా రావాలి?

దిండి రాసార్ట్స్

ఎలా రావాలి?

హైదరాబాద్ నుంచి పాలకొల్లుకు మేం రైలు ఎక్కాం. రాత్రి రైలు ఎక్కితే పొద్దున్న 8 గంటలకు పాలకొల్లులో దిగాం. అక్కడ నుంచి దిండి 15 కిలోమీటర్లు.

ఇక్కడకు రావడానికి ఆటోలు, ప్రైవేట్ ట్రావెల్స్ అందుబాటులో ఉన్నాయి.

ముగ్గురికి 500 రూపాయలు తీసుకొని మమ్మల్ని దిండికి తీసుకొచ్చారు.

క్యాబ్ ఎక్కింది మొదలు ఎటు చూసిన కొబ్బరి చెట్లు.. చక్కటి రోడ్లు.. అప్పుడే రోజువారీ పనులకి వెళ్తున్న ఊరి జనం.. చల్లటి గాలి.. ఎంత స్వచ్ఛంగా ఉందో అనిపించింది మా ప్రయాణం.

కేరళ తరహా హౌస్ బోటింగ్ దిండి ప్రత్యేకత. ఇక్కడ పర్యటక శాఖకు చెందిన హరిత కోకోనట్‌ కంట్రీ రిసార్ట్‌లో 32 ఏసీ గదులతో పాటు రెస్టారెంట్, కాన్ఫెరెన్స్‌ హాల్, స్విమ్మింగ్‌ పూల్‌ ఉన్నాయి.

సాధారణ రోజుల్లో రోజుకు 50 శాతం ఆక్యుపెన్సీతోనూ, వీకెండ్‌లో వంద శాతం గదులు నిండిపోతాయి అని నిర్వాహకులు చెప్పారు.

దిండిలో వాటర్‌ స్పోర్ట్స్‌ ఆస్వాదించేందుకు ఎక్కువ మంది రావడం మేం గమనించాం.

అన్వర్

వచ్చినవారు ఏమంటున్నారు?

ఇక్కడ అతిథి మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని హైదరాబాద్‌కు చెందిన అన్వర్ అన్నారు.

''హైదరాబాద్ నుంచి దిండికి చేరుకునే దారి కొంచెం బాగు చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఉండటానికి మంచి వ్యూ కలిగిన రూమ్ దొరికింది. రూమ్‌లో మెయింటెనెన్స్ ఇష్యూ ఉందని చెప్పగానే సరి చేశారు. అతిథి మర్యాదల గురించి ఇక చెప్పే అవసరమే లేదు. మేం వచ్చిన దగ్గర నుంచి ఏ లోటు లేకుండా ఇక్కడ నిర్వాహకులు చూసుకుంటున్నారు. దిండికి రావడం ఇదే మొదటి సారి.. కానీ మళ్లీమళ్లీ రావాలని ఉంది’’అని ఆయన చెప్పారు.

మరోవైపు ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందని హైదరాబాద్‌కు చెందిన వాణి గౌడ్ చెప్పారు.

''ఇది చూడటానికి చాలా బాగుంది. మేం కుటుంబంతో కలిసి వచ్చాం. దగ్గర్లో ఉన్న దేవాలయాలు కూడా చూశాం. ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ధరలు తక్కువే ఉన్నాయి. బోటింగ్ చెయ్యడం నాకు బాగా నచ్చింది. రెస్టారెంట్‌లో ఫిష్ కర్రీ తిన్నాం. ఫుడ్ చాలా నచ్చింది’’అని ఆమె చెప్పారు.

మరోవైపు ఎప్పటినుంచో ఇక్కడికి తాము రావాలని భావించినట్లు పెద్దాపురానికి చెందిన రమేశ్ తెలిపారు. ''కుటుంబంతో పాటు అందరం ఇక్కడికి రావాలని చాలా రోజులుగా అనుకుంటున్నాం. ఇప్పటికి కుదిరింది. ఈ చోటు చాలా బావుంది. మహిళలకు ప్రత్యేకమైన మరుగుదొడ్లు లేవు. ఇది ఇంకా చాలా అభివృద్ధి చేయాలి’’అని ఆయన అన్నారు.

దిండి రాసార్ట్స్

సురక్షితమేనా?

బోటింగ్ దగ్గర అందరూ సురక్షితంగా ఉండేలా చూసేందుకు నిర్వాహకులు అందుబాటులో ఉంటారు. బోటింగ్ చేసేవారు కచ్చితంగా లైఫ్ బోట్ జాకెట్ వేసుకోవాలి.

ఫోటోలు కోసం కొంతసేపు జాకెట్ తీసినా.. వెంటనే మళ్ళి వేసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

వెళ్ళడానికి మంచి సమయం ఏమిటి?

అక్టోబర్ నుంచి మార్చి వరకు ఇక్కడికి రావడానికి అనుకూల సమయం.

ఆ మధ్యలో వస్తే, ఇక్కడి ప్రకృతిని హాయిగా ఆస్వాదించొచ్చు.

వసతులు ఉన్నాయా?

దట్టమైన మడ అడవుల ''బ్యాక్‌ వాటర్స్‌’’లో బోటు ప్రయాణం పర్యటకులను కట్టిపడేస్తోంది.

కేరళ స్టైల్ హౌస్ బోటింగ్‌లో అటాచ్డ్‌ బాత్‌రూమ్, ఏసీ, సిటౌట్, డైనింగ్‌ ఏరియా... ఇలా నక్షత్రాల హోటల్‌ను మరిపించే సౌకర్యాలతో రెండు హౌస్‌ బోట్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి.

ఈ బోట్లు దాదాపు 40 కిలో మీటర్ల మేర గోదావరిలో ప్రయాణిస్తాయి.

దిండిలో బయలు దేరి రాజోలు లంక ఐలాండ్, నరసాపురం రేవు మీదుగా తిరిగి గమ్యస్థానానికి చేరుకుంటాయి.

దిండి రాసార్ట్స్

ఫుడ్ ఎలా ఉంటుంది?

రిసార్ట్స్‌లో ఉన్న రెస్టారెంట్‌లో వెజ్, నాన్‌వెజ్ ఫుడ్ ఉంటుంది. గోదావరి జిల్లాలో దొరికే నోరూరించే స్పెషల్ వంటకాలు కూడా ఇక్కడ చేస్తారు.

ఎక్కడికి ఎంత దూరం?

రాజమండ్రి విమానాశ్రయం నుంచి 100 కిలోమీటర్లు, రాజోలు నుంచి 8 కిలోమీటర్లు, పాలకొల్లు, నరసాపురం రైల్వే స్టేషన్‌ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో దిండి ఉంది.

దగ్గర్లో ఏమున్నాయి?

ప్రముఖ పుణ్యక్షేత్రాలు, దేవస్థానాలు, ఎటు చూసినా పచ్చని పట్టు చీర కట్టుకున్న భూమాతలా కనిపించే దృశ్యాలు మనసును కట్టిపడేస్తాయి.

దిండి నుంచి 23కి.మీ. దూరంలో అంతర్వేది-శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, 25 కి.మీ.లో అంతర్వేది - అన్నాచెల్లెళ్ల గట్టు, 25కి.మీ.లో అప్పన్నపల్లి బాలబాలాజీ దేవాలయం, 15కి.మీ.లో పాలకొల్లు రామ లింగేశ్వర స్వామి దేవాలయం, 40కి.మీ. లో పేరుపాలెం బీచ్ ఉన్నాయి.

దిండి రాసార్ట్స్

పాపి కొండలు కూడా దగ్గరే..

దిండికి 80 కిలోమీటర్ల దూరంలో పాపికొండలు ఉంటాయి.

ఇక్కడి నుంచి 23 కి.మీ. దూరంలో అంతర్వేదిలో లక్ష్మీ నర్సింహా స్వామి దేవస్థానం ఉంది. రాతి గోడల నడుమ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం ఉంటుంది.

అంతర్వేదిలో ఉండటానికి ప్రైవేట్ హోటల్స్ చాలా ఉన్నాయి. రోజుకి రూ.1000 నుంచి రూ.1,500 వరకు ధరలు ఉంటాయి.

అంతర్వేది, అన్నచెల్లెల గట్టు, లైట్ హౌస్ ఇవన్నీ ఒకేసారి కవర్ చేయొచ్చు.

అంతర్వేది గ్రామంలో చాలా సినిమాలు చిత్రీకరించారు. సముద్రంలో వశిష్ఠ నది కలిసే చోటును అన్న చెళ్ళెళ్ళ గట్టు అంటారు. ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేట వేసి ఉంటుంది.

దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్ఛంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. ఇక్కడికి చేరుకోవడానికి ప్రైవేట్ పడవలు ఉంటాయి.

ఇక్కడి లైట్ హౌస్ పైనుంచి అన్న చెల్లెళ్ళ గట్టుని, ఆ సంగమాన్ని చూస్తుంటే మంచి అనుభూతి లభిస్తుంది. లైట్ హౌస్ చుట్టూ అందమైన తోటలు ఉన్నాయి. కే

కేవలం భక్తులు, యాత్రికులే కాదు.. వనభోజనాల కోసం కూడా ఇక్కడికి చాలా మంది వస్తుంటారు.

వసతి - ధరలు

ఏ/సి లో స్టాండర్డ్ , డీలక్స్ , సూట్ రూములు అందుబాటులో ఉన్నాయి. ధర రూ.2,500 నుంచి రూ.6 వేల మధ్యలో ఉన్నాయి.

హౌస్ బోటింగ్

  • 2 గంటలకు - 8 వేలు
  • 12 గంటలకు - 12వేలు
  • 24 గంటలకు - 15 వేలు

స్పీడ్ బోట్

ఒక రౌండ్ - 500 రూ.

వశిష్ఠ , గోదావరి బోటింగ్

  • 1 గంటకు - 3,500 రూ.
  • 2 గంటలకు - 6000రూ.
  • 15 నిమిషాలకు (Adult) - 80రూ.
  • (Child) - 60రూ.

ఆత్రేయ బోటింగ్

  • 1 గంటకు - 6000రూ.
  • 15 నిమిషాలకు (Adult) - 150రూ.
  • (Child) - 120రూ.

మొత్తంగా దిండి రిసార్ట్స్‌ పర్యటనతో ఒక ఆహ్లాదకరమైన అనుభూతి మీకు మిగులుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Dindi: What is special about these Konaseema resorts that resemble Kerala?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X