CBSE Scoring Plan : సీబీఎస్ఈ 12 ఫలితాలకు మూల్యాంకన పద్దతి ఇదే... సుప్రీం కోర్టుకు బోర్డు నివేదిక...
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో... విద్యార్థుల మార్కులకు సంబంధించిన మూల్యాంకన పద్దతిని బోర్డు ఖరారు చేసింది. ఈ మేరకు గురువారం(జూన్ 17) సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది. దాని ప్రకారం... 12వ తరగతి ప్రీ-బోర్డు పరీక్షతో పాటు 10,11 తరగతుల్లో సాధించిన సగటు ఆధారంగా మార్కులు కేటాయించనున్నారు. సీబీఎస్ఈ బోర్డు తరుపున అటార్నీ జనరల్ ఈ నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించారు.
12వ తరగతి ప్రీ బోర్డు పరీక్షకు 40 శాతం వెయిటేజీ,10,11 తరగతుల్లో సాధించిన మార్కులకు 30శాతం వెయిటేజీని కేటాయించనున్నారు. 10,12 తరగతుల్లో.. యూనిట్,టర్మ్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించిన మూడు పేపర్లను పరిగణలోకి తీసుకుని మార్కులు కేటాయించనున్నారు. ఇది థియరీ మార్కులకు సంబంధించిన మూల్యాంకన పద్దతి. ప్రాక్టికల్ మార్కులు ఆయా స్కూల్ యాజమాన్యాలే ఇవ్వాల్సి ఉంటుంది.

మొత్తం 13 మంది సభ్యులతో కూడిన టీమ్ సీబీఎస్ఈ 12వ తరగతి మూల్యాంకనంపై కసరత్తులు చేసి నివేదిక రూపొందించిందని బోర్డు సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఈ టీమ్ రూపొందించిన మూల్యాంకన పద్దతిని అమలుచేసేందుకు ప్రతీ స్కూల్లో ప్రిన్సిపాల్ నేత్రుత్వంలో రిజల్ట్స్ కమిటీ ఏర్పాటు ఉంటుందని తెలిపింది. ఈ కమిటీలో ఇద్దరు సీనియర్ పీజీటీ,ఇతర స్కూళ్లకు చెందిన మరో ఇద్దరు పీజీటీ ఉంటారని స్పష్టం చేసింది.
జులై 31వ తేదీ లోగా సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. సీఐఎస్ఈ 12వ తరగతి మూల్యాంకన పద్దతికి సంబంధించిన రిపోర్ట్‌ను కూడా సుప్రీం కోర్టుకు గురువారం సమర్పించనున్నారు. జులై 20 నాటికి సీఐఎస్ఈ ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది.
కరోనా నేపథ్యంలో సెంట్రల్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10,11,12 తరగతుల పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపి 12వ తరగతి పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకున్నారు. విద్యా శాఖ అధికారులతో విస్తృత సంప్రదింపుల తర్వాత.. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. పరీక్షల రద్దుతో మార్కుల కేటాయింపుకు తాజాగా ప్రత్యామ్నాయ మూల్యాంకన పద్దతిని తీసుకొచ్చింది. ఒకవేళ పరిస్థితులు చక్కబడిన తర్వాత పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు అవకాశం కల్పిస్తారా అన్నది చూడాలి.












Click it and Unblock the Notifications