వీఐపీ సంస్కృతికి స్వస్తి కబుర్లేనా?: మోదీ హయాంలో పెరిగిన భద్రత

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: మూడున్నరేళ్ల క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం సమయం వచ్చినప్పుడల్లా తమది వీఐపీ సంస్కృతి వ్యతిరేక ప్రభుత్వమని చెబుతూ వచ్చేది. సామాన్యుల మాదిరిగా వ్యవహరించాలని బీజేపీ ఎంపీలు, మంత్రులకు ప్రధాని మోదీ పదేపదే చెబుతుండే వారు.

కానీ వీఐపీ సంస్కృతి అమలు విషయమై ఆయన చెబుతున్న కబుర్లకు, ఆచరణకు మధ్య హస్తమాసికంతరం అంత తేడా ఉన్నట్లు కనిపిస్తున్నది. దీనికి నిదర్శనం వివిధ రంగాల ప్రముఖులకు 'వీఐపీ సంస్కృతి' కింద ప్రత్యేక భద్రత వసతి కల్పించడమే. గత కేంద్ర హోంశాఖ ప్రత్యేక భద్రత కల్పిస్తున్న జాబితాలో వీఐపీల సంఖ్య 475కు చేరింది. దేశ చరిత్రలో అత్యధిక మందికి 'వీఐపీ' భద్రత కల్పిస్తుండటం ఇదే తొలిసారి.

అయితే ఈ భద్రతా విధానాన్ని సమీక్షించి కొందరు నేతల భద్రతను కుదించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ సంఖ్య 350 మాత్రమేనన్నది గమనార్హం. ఓవైపు వీఐపీ సంస్కృతికి తాను వ్యతిరేకమని చెబుతున్న ప్రధాని మోడీ గతంలోకన్నా తన హయాంలోనే ఎక్కువమందికి ప్రత్యేక భద్రత కల్పించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేక భద్రత పొందుతున్నవారిలో రాజకీయ నేతలు, వారి వారసులు, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. వీరిలో కొందరికి ఇప్పుడు కల్పిస్తున్న జాతీయ భద్రతా దళాల(ఎన్‌ఎస్‌జీ) రక్షణను తొలగించే అవకాశం ఉంటుందని హోంశాఖ సీనియర్ అధికారి చెప్పారు.

భద్రత కొనసాగింపుపై ఇలా ఒత్తిళ్లు

భద్రత కొనసాగింపుపై ఇలా ఒత్తిళ్లు

అధికారంలో ఏ పార్టీ ఉంటే వారికి సంబంధించినవారికే భద్రత విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నారని, మిగతావారి గురించి పట్టించుకోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి. చట్టం ముందు అందరూ సమానులే అయినపుడు ప్రజా ధనాన్ని ఎవరి ఇష్టానుసారం వారు ఖర్చు చేయడమేమిటన్న ప్రశ్నలూ సహజంగానే తలెత్తుతాయి. భారత రాజ్యాంగం ఎవరికీ ప్రత్యేక హక్కులు ఇవ్వలేదన్నది గమనార్హం. ‘వీఐపీ సంస్కృతి' పెరిగిపోయిందన్న పేరిట ఎంతో కాలంగా కొనసాగుతున్న భద్రతను తొలగించేందుకు.. అందునా తమ వైరి పక్ష నేతలకు కల్పిస్తున్న భద్రతను తొలగించేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం పూనుకుంటున్నదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వీఐపీ భద్రత తొలగించేందుకు ప్రయత్నాలు జరిగినప్పుడల్లా తెర వెనక ఒత్తిళ్లతో కేంద్రం వెనుకడుగు వేస్తూ వస్తున్నది.

అఖిలేశ్, రమణ్ సింగ్‌లకూ అదే సెక్యూరిటీ

అఖిలేశ్, రమణ్ సింగ్‌లకూ అదే సెక్యూరిటీ

బీహార్ మాజీ సీఎం, ప్రస్తుతం ఏ పదశీలేని ఆర్‌జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్‌యాదవ్‌ ఎన్‌ఎస్‌జీతోపాటు సీఆర్‌పీఎఫ్‌ భద్రత కూడా అమలులో ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయనకు కల్పిస్తున్న భద్రతను సమీక్షించి.. ఏదో ఒకదానిని తొలగించే అవకాశాలు ఉన్నాయి. ఇదే తరహా భద్రతను ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌కు కల్పిస్తున్నారు. అఖిలేశ్, రమణ్ సింగ్ లకూ కల్పిస్తున్న రెండు రకాల భద్రతను కేంద్ర హోంశాఖ సమీక్షించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

జడ్ ప్లస్ భద్రతా కవచంలో 50 మంది నేతలు

జడ్ ప్లస్ భద్రతా కవచంలో 50 మంది నేతలు

తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎం. కరుణానిధి(93) ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ ఎటూ వెళ్లలేని స్థితిలో ఉన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లడం లేదు. ప్రస్తుతం డీఎంకే వ్యవహారాలన్నీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ నడుపుతున్నందున పార్టీ అధ్యక్షుడైనా.. కరుణానిధి బయటకు వెళ్లనందున ఆయన భద్రతపైనా సమీక్ష జరగనున్నది. జెడ్‌ ప్లస్‌ భద్రత పొందుతున్న రాజకీయ పార్టీ నాయకుల జాబితాలో 50మంది ఉన్నారు.

 ఎక్స్ నుంచి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇలా

ఎక్స్ నుంచి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇలా

యూపీఏ ప్రభుత్వ హయాంలో 26మందికి మాత్రమే జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత కల్పించే వారు. జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత పొందుతున్న వారికి 35 నుంచి 40మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. ప్రాణహాని హెచ్చరికలు ఉన్న నేతలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రత కల్పిస్తాయి. వివిధ వర్గాల నుంచి వచ్చే హెచ్చరికల తీవ్రతతోపాటు వారి హోదాల ఆధారంగా భద్రత స్థాయి ఎక్స్‌ నుంచి జెడ్‌ ప్లస్‌ కేటగరీలుగా విభజించారు. జడ్‌ కేటగరీ కింద 30 మంది భద్రతా సిబ్బందిని కేటాయిస్తారు. వై ప్లస్‌ కింద 11మందిని కేటాయిస్తారు.

హోంమంత్రి రాజ్ నాథ్ తనయుడికీ ఎన్ఎస్జీ భద్రత

హోంమంత్రి రాజ్ నాథ్ తనయుడికీ ఎన్ఎస్జీ భద్రత

యోగా గురువు రామ్‌దేవ్‌బాబా, ఆధ్యాత్మికవేత్త మాతా అమృతానందమయికి జెడ్‌ కేటగరీ భద్రత కల్పిస్తున్నారు. రామజన్మభూమి ఆలయ బోర్డు చైర్మన్‌ మహంత్‌ నృత్యగోపాల్‌దాస్‌, వివాదాస్పద ఎంపీ సాక్షి మహారాజ్‌కు వై కేటగరీ భద్రత కల్పిస్తున్నారు. కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కుమారుడు పంకజ్‌సింగ్‌ (మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు) సహా రాజకీయ నేతల వారసుల్లో 15మందికి ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పిస్తున్నారు.

తరుణ్ గొగోయికి సెక్యూరిటీ తొలగింపు

తరుణ్ గొగోయికి సెక్యూరిటీ తొలగింపు

అసోం సీఎం సర్బానంద సోనోవాల్‌సహా 15మంది రాజకీయ నాయకులకు బ్లాక్‌ కమాండోలతో భద్రత కల్పిస్తున్నట్టు ఎన్‌ఎస్‌జీ అధికారులు తెలిపారు. అంతకుముందు అసోం సీఎంగా పని చేసిన కాంగ్రెస్‌ నేత తరుణ్‌గొగోయికి కల్పిస్తున్న బ్లాక్‌ కమాండోల భద్రత తొలగించేశారు. దీంతో, సోనోవాల్‌ బీజేపీ నేత అయినందునే కల్పిస్తున్నారన్న విమర్శ సహజంగానే వస్తున్నది.

సీఐఎస్ఎఫ్ భద్రతా వలయంలో అజిత్ దోవల్ తదితరులు

సీఐఎస్ఎఫ్ భద్రతా వలయంలో అజిత్ దోవల్ తదితరులు

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా సహా 75మంది రాజకీయ ప్రముఖులకు సీఆర్‌పీఎఫ్‌ దళాలతో భద్రత కల్పిస్తున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్‌, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్‌ రిజిజ్‌సహా 75మందికి సీఐఎస్‌ఎఫ్‌ దళాలతో భద్రత కల్పిస్తున్నారు. జమ్మూకాశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లాసహా 18 మందికి ఐటీబీపీతో భద్రత కల్పిస్తున్నారు.

 యోగి ఆదిత్యనాథ్ నుంచి అనుప్రియా పటేల్ వరకు ఇలా

యోగి ఆదిత్యనాథ్ నుంచి అనుప్రియా పటేల్ వరకు ఇలా

వీఐపీల విభాగంలో అత్యధిక భద్రత కల్పిస్తున్నది ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకులకు మాత్రమే. ప్రస్తుత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఎన్ఎస్జీ భద్రత పొందుతున్న వారిలో ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్, ఆయన తనయుడు పంకజ్ సింగ్ లకూ ఇదే భద్రత కొనసాగుతున్నది. కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ కూడా యూపీ నుంచే లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

భద్రతా ఖర్చు భరిస్తున్న రిలయన్స్ అధినేత

భద్రతా ఖర్చు భరిస్తున్న రిలయన్స్ అధినేత

ప్రముఖ పారిశ్రామికవేత్త, దేశంలోకెల్లా సంపన్నుడు రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీకి జెడ్‌ కేటగరీ, ఆయన భార్య నీతా అంబానీకి వై కేటగరీ భద్రత కల్పిస్తున్నారు. ముఖేశ్ అంబానీ తమ దంపతులకు అయ్యే ఖర్చును ఆయనే భరిస్తుండటం గమనార్హం. పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల్లో వీఐపీ హోదాలో భద్రత పొందుతున్నదీ ముఖేశ్ అంబానీ దంపతులు మాత్రమే కావడం గమనార్హం. ఇక దేశమంతటా ఒకే భద్రతా విధానం అమలు చేసేందుకు కేంద్రం పూనుకుంటున్నది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేయాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Narendra Modi government sanctions special security, seen by many to signal VIP status, to 475 people, compared to the 350 protected by the previous Congress-led government. The Union Home Ministry's current list is an all-time high despite PM Modi's firm drive against a VIP culture, and senior officers said the government is looking at reviewing and trimming it soon.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి