Chandrayaan 3: రోవర్ బయటికొచ్చిందోచ్: ల్యాండర్ మీదుగా జారుకుంటూ: ఫస్ట్ పిక్ ఇదిగో..!!
బెంగళూరు: కోట్లాదిమంది భారతీయుల నిరీక్షణ ఫలించింది. చందమామ చేతికి అందింది. జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. భారత్.. నింగిని జయించింది. ఇస్రో చేపట్టిన చంద్ర మండల యాత్ర- విజయ తీరాలకు చేరింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్ ఈ సాయంత్రం 6:04 నిమిషాలకు జాబిల్లి మీద అడుగు మోపింది.
చంద్రుడి ఆర్బిటర్ నుంచి ఒక్కో దశలో కిందికి దిగింది చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్ విక్రమ్. అవరోహణ క్రమంలో కిందికి దిగుతూ వచ్చింది. అప్పటివరకు అండాకారంలో పరిభ్రమిస్తూ వచ్చిన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడి ఉపరితలానికి సమీపించిన వెంటనే వర్టికల్‌గా మారింది. నిట్టనిలువుకు చేరుకుంది. అక్కడే సగం విజయం సాధించినట్టయింది.

అనంతరం ఒక్కో దశను అధిగమిస్తూ క్రమంగా చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయింది. దీనితో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా ఆవిర్భవించింది భారత్. ఇంతకుముందు- రష్యా (సోవియట్ యూనియన్), అమెరికా, చైనా ఈ ఘనతను సాధించాయి. దక్షిణ ధృవంపై ల్యాండింగ్ చేసిన తొలి దేశం.. భారత్.
ఇక చంద్రుడిపై ఏం జరగబోతోంది?, విక్రమ్ ల్యాండర్.. చందమామ దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ తరువాత ఇస్రో ఏం చేయబోతోంది?, వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతోన్నాయి. రోవర్ ఎప్పుడు బయటికొస్తుంది?, చంద్రుడిపై ఎప్పుడు కాలు పెడుతుంది? దీని తరువాత చంద్రయాన్ 3 ఎలాంటి పరీక్షలను జరుపుతుంది?, చంద్రుడి నుంచి ఎలాంటి డేటాను సేకరిస్తుంది? అనేది చర్చనీయాంశమౌతోంది.
ఈ ప్రశ్నలకు తెర పడింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి రోవర్ బయటికి వచ్చింది. దీనికి ఇస్రో పెట్టిన పేరు.. ప్రజ్ఞాన్. ఈ ప్రజ్ఞాన్ రోవర్ ల్యాండర్‌కు చెందిన లెగ్ ర్యాంప్ మీదుగా జారుకుంటూ కిందికి దిగింది. దీనికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్పేస్ ఛైర్మన్ పవన్ కే గోయెంకా పోస్ట్ చేశారు. ల్యాండర్ మాడ్యుల్ ల్యాండ్ అయిన మూడు గంటల తరువాత రోవర్ బయటికి దూసుకొచ్చింది.
ల్యాండ్ అయినప్పుడే బయటికి వచ్చేలా ప్రోగ్రామింగ్ చేయలేదు ఇస్రో. దీనికి కారణం లేకపోలేదు. ల్యాండర్ ల్యాండ్ అయిన తరువాత ఎగిసిన ధూళి- మొత్తం అణగిపోయేంత వరకూ అది బయటికి రాదు. ధూళి వల్ల రోవర్ డ్యామేజ్ కాకూడదనే ఉద్దేశంతోనే ఇస్రో శాస్త్రవేత్తలు ఈ జాగ్రత్త తీసుకున్నారు. ఈ సాయంత్రం 6:04 నిమిషాలకు ల్యాండర్ ల్యాండ్ కాగా.. సరిగ్గా రాత్రి 9:04 నిమిషాలకు రోవర్ బయటికి వచ్చింది.












Click it and Unblock the Notifications