CTET 2021 Exam రద్దు.. సాంకేతిక లోపం- అభ్యర్థుల్లో ఆందోళన
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నిర్వహిస్తున్న సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్)కు ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా తయారైంది. పరీక్ష రాసే అభ్యర్థులు ఈ పరీక్ష కోసం ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యారు. అయితే చివరి నిమిషంలో పరీక్ష రద్దు కావడంతో అంతా నిరాశకు గురయ్యారు. డిసెంబర్ 16 గురువారం నుంచి సీటెట్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే అభ్యర్థులు అంతా సమయానికే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఇక అంతా సెటిల్ అయ్యాక ఆన్‌లైన్ వ్యవస్థ మొరాయించింది. దేశవ్యాప్తంగా ఇదే జరగడంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే మళ్లీ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

సీటెట్ 2021 పరీక్ష రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తున్నారు. పేపర్ -1 ఉదయం 9:30 గంటలకు పేపర్ -2 మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఉదయం పేపర్-1 పరీక్ష ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగింది. ఇక మధ్యాహ్నం జరగాల్సిన పేపర్-2 పరీక్ష మాత్రం రద్దయ్యింది. అభ్యర్థులు అంతా వచ్చి తమకు కేటాయించిన గదుల్లో కూర్చున్నారు. ఇన్విజిలేటర్లు వచ్చి అభ్యర్థుల నుంచి ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేశారు. ఇక అంతా ఓకే అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఆన్‌లైన్ వ్యవస్థ పనిచేయలేదు. సాంకేతిక లోపంను సరిజేసేందుకు చాలాసేపు సిబ్బంది కష్టపడ్డారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. దీంతో పరీక్ష వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వాయిదా పడ్డ పరీక్ష తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌పై పొందుపరుస్తామని స్పష్టం చేశారు.

Recommended Video
సీటెట్‌కు హాజరైన అభ్యర్థులు కొందరు వన్‌ఇండియాతో మాట్లాడారు. ఈ పరీక్ష కోసం చాలా కష్టపడి చదివామని.. ఎక్కడెక్కడో పనిచేసే తాము కొన్ని రోజుల పాటు సెలవులు పెట్టి పరీక్ష రాసేందుకు వచ్చామని చెప్పారు. అయితే చివరి నిమిషంలో పరీక్ష సాంకేతిక కారణాలతో వాయిదా పడటం నిజంగా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది అనంతపురంకు చెందిన లావణ్య అనే అభ్యర్థిని. మళ్లీ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో తెలుసుకునేందుకు వెబ్‌సైట్‌ను చూడమన్నారని చెప్పారు. అంతా ఓకే అనుకున్న సమయంలో పరీక్ష రద్దు చేస్తున్నట్లు ప్రకటన వచ్చిందని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పరీక్ష రద్దు కావడంపై సోషల్ మీడియా వేదికగా కూడా అభ్యర్థులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. 2:30కు ప్రారంభం కావాల్సిన పరీక్ష 4 గంటలైనా ఇంకా ప్రారంభం కాలేదని వెబ్‌సైట్ పనిచేయడం లేదని పేర్కొన్నారు. చివరకు పేపర్ రద్దు అయ్యిందన్న ప్రకటన వచ్చిందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications