బంగాళాఖాతంలో బలపడుతున్న రెమాల్ తుఫాను; ఎన్నికల వేళ అక్కడ ఆరెంజ్ అలెర్ట్!!
నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. నేడు ఇది వాయుగుండం గాను, ఆ తర్వాత ఇది మే 25 ఉదయం నాటికి తూర్పు-మధ్య బంగాళాఖాతం మీదుగా ఈశాన్య దిశగా కదులుతూ తుఫానుగా మరింత బలపడే అవకాశం ఉంది.రేపు సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారి ఎల్లుండి ఉదయం తీరాన్ని తాకనుంది.
రెమాల్ తుఫాను.. ఈ సీజన్ లో తొలి తుఫాను
ఈ తుఫానుకు వాతావరణ శాఖ నిపుణులు రెమాల్ అని పెట్టారు. ఆదివారం వరకు ఈ తుఫాన్ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడిన మొదటి తుఫాను రెమాల్ కావటం గమనార్హం. రెమాల్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిస్సా లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇక్కడ కూడా వర్షాలు.. మత్స్యకారులకు అలెర్ట్
అంతే కాదు మిజోరం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాలలో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ తుఫాను నేపథ్యంలో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు ఈనెల 27వ తేదీ వరకు సముద్రంలో వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ తుఫాను తీరం దాటేటప్పుడు గంటకు 110 నుండి 120 కిలోమీటర్ల వేగంతో తీరం దాటుతుంది.
తుఫాను నేపధ్యంలో అధికారులు అలెర్ట్
ఆపై గంటకు 135 కిలోమీటర్ల పైగా వేగంతో గాలులు వీస్తాయని ఐఎండి పేర్కొంది. మే 27వ తేదీ ఉదయం వరకు దాదాపు 24 గంటల పాటు ఈ తీవ్రత కొనసాగుతుందని ఆపై తీవ్రత తగ్గుతుందని పేర్కొంది. కాబట్టి పశ్చిమ బెంగాల్, ఒడిస్సా రాష్ట్రాలలో ప్రభుత్వ యంత్రాంగం తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
మే 26వ తేదీన పశ్చిమ బెంగాల్ తీరాన్ని రెనాల్ట్ తుఫాను తాకే అవకాశం ఉన్నందున కోల్కతా, హౌరా, నదియా,ఝర్ గ్రామ్ తదితర జిల్లాలలో వర్షాలు కురుస్తాయని ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ బెంగాల్ లో 8 లోక్ సభ స్థానాలకు లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అక్కడ ఎన్నికల సంఘం తుఫాను నేపధ్యంలో అధికారులను అప్రమత్తంగా ఉండాలని, తగిన ఏర్పాట్లు చెయ్యాలని సూచించింది.
ఏపీకి తప్పిన ముప్పు
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం తుఫాను ముప్పు తప్పిందని వాతావరణ నిపుణులు తెలియజేశారు.కానీ ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శని,ఆదివారాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.












Click it and Unblock the Notifications