ఊపిరి పీల్చితే చావే.. విషపూరితంగా మారిన ఢిల్లీ గాలి..
శీతాకాలం ప్రారంభంతోనే దేశ రాజధాని న్యూఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. దసరా వేడుకల అనంతరం నగరం చుట్టూ తెల్లవారుజామునే దట్టమైన పొగమంచు, దుమ్ము కమ్మేయడంతో గాలి నాణ్యత తీవ్రంగా దిగజారింది. గురువారం ఉదయం నమోదైన గణాంకాల ప్రకారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 226 పాయింట్లకు చేరుకుని 'పూర్' కేటగిరీలో కొనసాగుతోంది. గాలి నాణ్యత ఒక్కసారిగా పడిపోవడంతో ఢిల్లీ ప్రజలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. జహంగీర్‌పురిలో ఏక్యూఐ 309, చాందినీ చౌక్‌లో 307గా నమోదై 'వెరీ పూర్' కేటగిరీకి చేరాయి. వీటితో పాటు ఆనంద్ విహార్, బవానా, రోహిణి, పట్పర్‌గంజ్, అక్షర్‌ధామ్, ఐటీవో ,వజీర్‌పూర్ వంటి కీలక ప్రాంతాల్లో కూడా గాలి నాణ్యత 200 దాటి నాసిరకం స్థాయిలోనే కొనసాగుతోంది. పండగ సంబరాల తర్వాత ఒక్కసారిగా కాలుష్యం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

అలర్ట్ అయిన అధికారులు: 'గ్రాప్-1' ఆంక్షలు షురూ
గాలి నాణ్యత క్రమంగా పడిపోతుండటంతో గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఢిల్లీతో పాటు పరిసర నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంత వ్యాప్తంగా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్-1 ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. వాయు కాలుష్యం మరింత తీవ్రం కాకుండా అడ్డుకునేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖలన్నీ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది.
ప్రజలకు కీలక సూచనలు
కేంద్ర కాలుష్య నియంత్రణ మంజి విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. సాధారణంగా ఏక్యూఐ 0-50 ఉంటే మంచిదిగా, 201-300 ఉంటే నాసిరకంగా పరిగణిస్తారు. రాబోయే రోజుల్లో కూడా కాలుష్య స్థాయిలు నాసిరకం కేటగిరీలోనే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగాల్లో దుమ్ము ఎగరకుండా చూడటం, వాహనాల పొగ నియంత్రణ వంటి చర్యలను వేగవంతం చేశారు. ప్రజలు కూడా బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.














Click it and Unblock the Notifications
