
రూ.1,000, రూ.500 నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు సంచలనం - నవంబర్ 9న: మోదీ ఆ నిర్ణయంపై..!!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటి- పెద్ద నోట్ల రద్దు. 1,000, 500 రూపాయి నోట్లను చిత్తు కాగితాలుగా ప్రకటించారు ప్రధాని మోదీ. అప్పటివరకు చలామణిలో ఉన్న ఆయా నోట్లన్నీ 2016 నవంబర్ 8వ తేదీ నుంచి ఎందుకూ కొరగాకుండా పోయాయి. వాటిని మార్పిడి చేసి, కొత్త నోట్లను తీసుకోవడానికి దేశ ప్రజలందరూ బ్యాంకుల ముందు బారులు తీరి నిల్చున్నారు అప్పట్లో.

నోటీసులు..
ఈ వ్యవహారం ఇప్పుడు మళ్లీ తాజాగా తెర మీదికి వచ్చింది. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇప్పటివరకు దాఖలైన మధ్యవర్తిత్వపు దరఖాస్తులు, ఇతర పిటీషన్లన్నింటినీ విచారణకు స్వీకరించిన ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనం నోటీసులను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్‌కు ఈ నోటీసులు పంపించింది.

అఫిడవిట్ దాఖలుకు..
పెద్ద నోట్ల రద్దు వ్యవహారం మీద ఓ సమగ్రమైన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిర్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం- ఇవ్వాళ పెద్ద నోట్ల రద్దుపై దాఖలైన పిటీషన్లు, ఇతర దరఖాస్తులపై విచారణ చేపట్టింది. మొత్తంగా 58 పిటీషన్లు దాఖలయ్యాయి.

ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా..
అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్లు పీ చిదంబరం, శ్యామ్ దివాన్ వాదనలను వినిపించారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పెద్ద నోట్లను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించారు. ఈ సమస్య అకడమిక్ విధానానికి సంబంధించినది కాదని, ఈ విషయాన్ని నిర్ణయించాల్సింది ఉన్నత న్యాయస్థానమేనని అన్నారు. దీనికి అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి బదులిచ్చారు.

వాడివేడిగా వాదనలు..
పెద్ద నోట్ల రద్దు చట్టాన్ని సరైన కోణంలో పిటీషనర్లు న్యాయస్థానంలో సవాలు చేయకపోతే, ఆ సమస్య తప్పనిసరిగా అకడమిక్‌గానే ఉంటుందని, దాన్ని అలాగే పరిగణించాల్సి ఉంటుందని వాదించారు. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేయడంలో ఎదురయ్యే లక్ష్మణరేఖ గురించి తమకు తెలుసునని వ్యాఖ్యానించింది.
ప్రభుత్వ ఉద్దేశం..
పెద్ద నోట్ల రద్దు వ్యవహారం అనేది అకడమిక్ అంశంగా కేంద్ర ప్రభుత్వం భావించిందా? లేదా? అనేది నిర్ణయించడానికే 2016 నాటి కేంద్ర ప్రభుత్వ డీమానిటైజేషన్ నిర్ణయాన్ని పరిశీలించాలని భావిస్తున్నట్లు న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఏదైనా ఓ అంశం రాజ్యాంగ ధర్మాసనం సమక్షానికి వచ్చిన సమయంలో దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. డీమోనిటైజేషన్ అంశం ప్రస్తుతం తమ వద్దకు వచ్చిందని, పిటీషన్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.