Tamil Politics: డీఎంకేకు కాంగ్రెస్ షాక్ ! విజయ్ తో కొత్త కూటమి ?
ఈ ఏడాది చివర్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పటిష్టంగా కనిపిస్తున్న డీఎంకే-కాంగ్రెస్ కూటమితో పాటు బీజేపీ-అన్నాడీఎంకే కూటమి, విజయ్ పార్టీ టీవీకే, ఇతర చిన్నా చితకా పార్టీలు ఎన్నికల దిశగా వ్యూహప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. అలాగే వచ్చే ఎన్నికల్లో సీట్ల బేరసారాలు కూడా మొదలైపోయాయి. ఇదే క్రమంలో అధికార కూటమిలో ప్రధాన పార్టీ డీఎంకే చేసిన ఓ ప్రతిపాదన నచ్చని కాంగ్రెస్ షాకిచ్చింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 32 సీట్లు కేటాయిస్తామని డీఎంకే నుంచి ప్రతిపాదన వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ కనీసం 40 సీట్లు అయినా ఇవ్వాలని కోరుతోంది. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో గెలిస్తే అధికారంలో వాటా కూడా కావాలని డిమాండ్ చేస్తోంది. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీల్ని గెలిపించుకోవడం మాత్రమే కాదు కూటమి అధికారంలోనూ వాటా ఇస్తేనే మీతో పొత్తుల ఉంటాం లేకపోతే మా దారి మేం చూసుకుంటాం అంటూ డీఎంకేను బ్లాక్ మెయిల్ చేస్తోంది. దీంతో డీఎంకేకు షాకులు తప్పట్లేదు.

డీఎంకే 40 సీట్లు ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో కనీసం 38 సీట్లు అయినా ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు బేరం పెట్టారు. అయితే దీనికి కూడా డీఎంకే అంగీకరించదన్న అంచనాతో హీరో విజయ్ పార్టీ టీవీకేతో జట్టు కట్టి కొత్త కూటమి ఏర్పాటు చేస్తామంటూ హెచ్చరికలు మొదలుపెట్టింది. విజయ్ పార్టీతో పొత్తుపై తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రతిపాదనలు పంపుతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ వెల్లడించారు. దీంతో కొత్త కూటమి చర్చ మొదలైంది.

మరోవైపు భావజాలం ప్రకారం తాము కాంగ్రెస్ కు అనుకూలమంటూ తాజాగా విజయ్ పార్టీ టీవీకే అధికారప్రతినిధి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు ఇదే ప్రకటనతో అలర్ట్ అయిన బీజేపీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో తమ కూటమిలో చేరాలని విజయ్ ను సంప్రదిస్తోంది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే పాపులారిటీ పెంచుకునే పనిలో ఉన్న విజయ్ ఒంటరిగానే పోటీ చేసి గెలవాలని కోరుకుంటున్నారు. తప్పనిసరైతే మాత్రం చివరి నిమిషంలో పొత్తులకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications