CEC రాజీనామా రచ్చ వేళ ఈసీ కీలక నిర్ణయం- 5 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు..!
కేంద్ర ఎన్నికల సంఘంలో (EC) ఎస్ఐఆర్ విషయంలో తలెత్తిన విభేదాలు ఓవైపు, కేంద్రం మూడేళ్ల క్రితం తెచ్చిన ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు విచారణ మరోవైపు, సీఈసీ రాజీనామా చేయాలన్న డిమాండ్లతో ఢిల్లీ, ముంబైలో ఆందోళనలు ఇంకోవైపు కొనసాగుతున్న వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాలకు ఈసీ బృందాల్ని పంపాలని నిర్ణయించింది. దీంతో ఆయా బృందాలకు నిరసన సెగ తప్పేలా లేదు.
ఓవైపు దేశవ్యాప్తంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు నిరసనలు పెరుగుతున్నా కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం మౌనంగా తన పని తాను చేసుకుపోతోంది. ముఖ్యంగా 2027 అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను ఈసీ ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ల నేతృత్వంలోని బృందాలు ఈ వారం నుంచే ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో పర్యటనలు ప్రారంభించనున్నాయి. ఇందులో ఓ బృందం ఈ వారం గోవాలోనూ, ఆ తర్వాతి వారం ఉత్తరాఖండ్‌లోనూ పర్యటించనుంది. రాబోయే వారాల్లో పంజాబ్, మణిపూర్‌లలో పర్యటనలు జరుగుతాయి. ఉత్తరప్రదేశ్‌లో కమిషన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు.

వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం చేపట్టిన సన్నాహక చర్యలలో భాగంగా ఈ పర్యటనలు జరుగుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 690 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇందులో ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 403 స్థానాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం 2027 మే 22తో ముగుస్తుండగా, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీల పదవీకాలం 2027 మార్చిలో ముగుస్తుంది. ఎన్నికల చట్టం ప్రకారం ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ముగియడానికి ఆరు నెలల ముందు నుండే ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించవచ్చు.దీంతో ఈసీ క్షేత్రస్దాయిలో సన్నాహాలు చేసుకుంటోంది. మరోవైపు సీఈసీ రాజీనామా చేయాల్సిన పరిస్ధితులు వస్తే ఏం జరుగుతుందనే దానిపై ఉత్కంఠ పెరుగుతోంది.














Click it and Unblock the Notifications
