సుప్రీంకోర్టులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బిగ్ షాక్
Electoral Bonds: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. దేశ అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఈ బ్యాంకు దాఖలు చేసుకున్న దరఖాస్తును సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. ఎస్బీఐ కోరిన విధంగా గడువు పొడిగించడానికి నిరాకరించింది.
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలంటూ సుప్రీంకోర్టు.. గతంలో ఎస్బీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇచ్చే ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై కిందటి నెల 15వ తేదీన సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

ఈ బాండ్లను జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు అయిదుమంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ)తో పాటు సమాచార హక్కు చట్టం ఉల్లంఘన కిందికి ఇవి వస్తాయని పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడం క్విడ్ ప్రొ కొ కిందికి వస్తుందని స్పష్టం చేసింది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ ఈ నెల 6వ తేదీ నాటికి కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుందని ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు అంటే- వాటిని ఎవరు ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? మొత్తం ఎంత అనే వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.
గడువు సమీపించిన నేపథ్యంలో ఎస్బీఐ.. సుప్రీంకోర్టు గడప తొక్కింది. ముందుగా ఆదేశించినట్లుగా ఈ నెల 6వ తేదీ నాటికి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీకి అందజేయలేమని తెలిపింది. గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. జూన్ 30వ తేదీ వరకు గడువు కోరింది ఎస్బీఐ.
ఈ దరఖాస్తును తాజాగా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎస్బీఐ కోరిన విధంగా జూన్ 30వ తేదీ వరకు కాకుండా.. వారం రోజుల పాటు మాత్రమే గడువును పొడిగించింది. గతంలో ఈ నెల 6వ తేదీ వరకు ఇచ్చిన గడువును తాజాగా 12వ తేదీ వరకు పొడిగించింది. బ్యాంకు వ్యాపార కార్యకాలాపాలు ముగిసే సమయానికి ఎలక్టోరల్ బాండ్ల వివరాలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి అందజేయాలని ఆదేశించింది.
అదే సమయంలో సుప్రీంకోర్టు.. ఎన్నికల అధికారులకు కూడా కొన్ని ఆదేశాలను ఇచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందజేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలన్నింటినీ కూడా ఈ నెల 15వ తేదీన సాయంత్రం 5 గంటల్లోగా తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చాల్సి ఉంటుందని సూచించింది.












Click it and Unblock the Notifications