నెవర్: రాజకీయాలపై తేల్చేసిన రజనీకాంత్, హక్కుఅని..
పనాజీ: రాజకీయ రంగ ప్రవేశంపై సూపర్ స్టార్ రజనీకాంత్ పెదవి విప్పారు. రాజకీయాల్లో చేరే ప్రసక్తే లేదని గురువారం ఆయన కుండబద్దలు కొట్టారు! 45వ అంతర్జాతీయ చలచిత్రోత్సవాల్లో పాల్గొనేందుకు గోవా వచ్చిన సందర్భంగా ఈ మేరకు ఆయన రాజకీయాల పైన ఓ ఆంగ్ల మీడియాతో ఇంటర్వ్యూలో స్పందించారు.
"నో, నెవర్ నో పాలిటిక్స్ ఫర్ మి" అంటూ వ్యాఖ్యానించారు. తాను రాజకీయాల్లోకి ఎప్పటికీ అడుగు పెట్టబోనని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రామదాసు మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చేందుకు రజనీకాంత్‌కు హక్కు ఉందన్నారు. అది ఆయన ఇష్టమని అభిప్రాయపడ్డారు.
కాగా, తాను రాజకీయాల్లోకి వచ్చే అంశం తన చేతులలో లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆదివారం అన్న విషయం తెలిసిందే. లింగా ఆడియో విడుదల కార్యక్రమం తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. ఈ సమయంలో పలువురు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. దీనిపై సూపర్ స్టార్ స్పందించారు.
సినిమాలు కూడా ఓ రకమైన సర్వీస్ అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాలు అంటే భయం లేదన్నారు. ‘మీరందరూ ఇంత ప్రేమగా అడుగుతుంటే, ఇప్పటికీ నేను రాజకీయాల గురించి మాట్లాడకపోతే నాకు పొగరనుకుంటారు' అంటూ రాజకీయాల గురించి తన మనసులో మాటని రజనీకాంత్ బయటపెట్టారు.

దశబ్దాలుగా నాతో ఎంతో సన్నిహితంగా ఉండే వారందరూ కూడా ఇప్పటికీ రజనీ మనసులో ఏముందో అర్థం చేసుకోలేకపోతున్నామంటుంటారని, వాళ్లకే కాదు, నిజానికి నా గురించి నాకే తెలీదని, పరిస్థితుల్లో నేను ఒక వస్తువుని మాత్రమేనని, రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయో మనకి తెలీదని, రాజకీయం గురించి నాకూ తెలుసునని, దాని లోతు, ఎంత ప్రమాదకరమైనదో కూడా తెలుసునన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.
వాటన్నింటినీ ఎదుర్కొని ప్రజలకు మంచి చేయగలనా అనే ఆలోచిస్తున్నానని చెప్పారు. దేనికైనా మంచి మార్గం ఏర్పడాలన్నారు. రాజకీయాల్లోకి రావడానికి నేను భయపడడం లేదు, సందేహిస్తున్నానంతే అన్నారు. రాజకీయాల్లోకి పోవడం సులభమేనని, కానీ, ప్రజలు ఎదురుచూసే విధంగా చెయ్యగలమా, లేదా అన్నది ముఖ్యమన్నారు. ప్రజలకి ఖచ్చితంగా మంచి చేస్తానని, కాకపోతే అది ఏదారిలో అన్నది ఆ పైవాడి నిర్ణయమేనంటూ రజనీకాంత్ పేర్కొన్నారు.
రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని, ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందని ఆయన అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. అలాగే రజనీకాంత్ కోసం వివిధ పార్టీలు ఎప్పుడు క్యూలో ఉంటాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రం పైన పలుమార్లు ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేది లేదని తెల్చి చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications