EPFO కొత్త యాప్, 75% PF వెంటనే విత్‌డ్రా
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (PF) విత్ డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయబోతోంది. ఈపీఎఫ్ఓ (EPFO) సబ్‌స్క్రైబర్‌లకు యూపీఐ (UPI) ద్వారా నేరుగా పీఎఫ్ డబ్బు తీసుకునే అవకాశం కల్పించే కొత్త మొబైల్ యాప్‌ను మార్చి చివరి నాటికి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మనీ కంట్రోల్‌కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఉమంగ్ (UMANG) యాప్‌కు భిన్నంగా, ఈ కొత్త ఈపీఎఫ్ఓ యాప్‌ను పూర్తిగా ఆధునికంగా రూపొందించారు. ఇది నేరుగా సబ్‌స్క్రైబర్‌ల బ్యాంక్ ఖాతాలకు అనుసంధానమవుతుంది. అంతేకాకుండా, భీమ్ (BHIM)తో పాటు ఇతర యూపీఐ యాప్‌లతో కూడా లింక్ అయ్యే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేశారు.

"ఈ కొత్త యాప్ ద్వారా ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్‌లు తమ పీఎఫ్ డబ్బును నేరుగా బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసుకోవచ్చు. ఆ తర్వాత యూపీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా సులభంగా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది" అని సమాచారం
EPFO నిధులను UAN పోర్టల్ ద్వారా..
ప్రస్తుతం ఈపీఎఫ్ఓ నిధులను యూఏఎన్ (UAN) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉపసంహరించుకునే సౌకర్యం ఉన్నప్పటికీ, యూపీఐ ద్వారా నేరుగా విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు లేదు. అయితే, కొత్త యాప్‌కు సంబంధించిన పరీక్షలు విజయవంతంగా పూర్తవడంతో, యూపీఐ ఆధారిత పీఎఫ్ విత్‌డ్రా సదుపాయం మార్చి చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
అధికారిక వివరాల ప్రకారం, సబ్‌స్క్రైబర్‌లు తమ ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్‌లో గరిష్టంగా 75 శాతం వరకు బ్యాంక్ ఖాతాలకు ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం, ఖాతాలో కనీసం 25 శాతం బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అయితే, ఒకవేళ ఉద్యోగం కోల్పోయిన పరిస్థితుల్లో, మిగిలిన ఆ 25 శాతం మొత్తాన్ని 12 నెలల తర్వాత మాత్రమే ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంటుంది.
EPFO రూ.26 లక్షల కోట్లు..
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్న మొత్తం నిధులు దాదాపు రూ.26 లక్షల కోట్లకు చేరువయ్యాయి. ఈపీఎఫ్ఓ కింద సుమారు 7.5 కోట్ల మంది క్రియాశీల సబ్‌స్క్రైబర్‌లు నిరంతరం చందాలు జమ చేస్తుండగా, మొత్తం సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య దాదాపు 30 కోట్లకు చేరినట్లు అంచనా.












Click it and Unblock the Notifications