కేంద్ర హోమ్, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఉన్న నార్త్ బ్లాక్ లో అగ్నిప్రమాదం
దేశ రాజధానిలో అగ్నిప్రమాదం సంభవించింది. హైసెక్యూరిటీ జోన్ పరిధిలో ఉండే సెంట్రల్ విస్టాలో కొద్దిసేపటి కిందటే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వెలువడింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్న నార్త్ బ్లాక్ లో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హోమ్, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఉండేవి ఇక్కడే. ఈ నార్త్ బ్లాక్ నుంచే ఈ రెండు కీలక శాఖలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తోన్నాయి.
అటువంటి నార్త్ బ్లాక్ లోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భవన సముదాయం వెనుక భాగం నుండి దట్టమైన పొగలు ఆకాశంలోకి ఎగిసిపడ్డాయి. పార్లమెంట్ భవనానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో భద్రతా దళాలు, ఉన్నతాధికారులు శరవేగంగా స్పందించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ అగ్నిమాపక శాఖ రంగంలోకి దిగింది. మంటలు ఆర్పడానికి ఫైరింజిన్లను ఘటనా స్థలానికి తరలించింది.

మొత్తం ఆరు ఫైరింజిన్లు నార్త్ బ్లాక్ కు చేరుకున్నాయి. మంటలను అదుపు చేస్తోన్నాయి. శివసేన ఎంపీ మిలింద్ దేవరా దీనికి సంబంధించిన ఓ ఫొటోను తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. నార్త్ బ్లాక్ వెనుక భాగం నుంచి భారీగా పొగలు అలుముకోవడాన్ని ఇందులో చూడొచ్చు. నార్త్ బ్లాక్ లో ఎక్కడ ఈ ఘటన చోటు చేసుకుందనేది ఇంకా తెలియరావట్లేదు. దీనివల్ల ఎంత మేర నష్టం సంభవించిందనేది వెల్లడి కావాల్సి ఉంది.
నార్త్ బ్లాక్ భవనం పైకప్పుపై కొంతకాలంగా మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఈ ఉదయం వెల్డింగ్ చేస్తోన్న సమయంలో అకస్మాత్తుగా అక్కడ ఉన్న విద్యుత్ వైర్లలో షార్ట్ సర్క్యూట్ సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. దీని ప్రభావంతో అక్కడే ఉన్న ఏసీ బాయిలర్ వద్ద మంటలు చెలరేగిందని, ఆ ప్రాంగణమంతా దట్టమైన పొగ ఆవరించిందని పేర్కొన్నారు.
Noticed thick smoke rising from behind North Block while on my way to Parliament. It appears there may be a fire. Hope everyone is safe and emergency services are responding swiftly. https://t.co/mnUqpWfsWl
— Milind Deora | मिलिंद देवरा (@milinddeora) October 26, 2026
ఈ ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఉన్న పలువురు ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. మంటలు వెంటనే అదుపులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాద ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, కీలక ఫైళ్లకు గానీ, భవన నిర్మాణానికి గానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు ధృవీకరించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండటానికి నార్త్ బ్లాక్ భద్రతను పునఃసమీక్షిస్తోన్నారు.













Click it and Unblock the Notifications
