Form 6 మార్పు: కమిషనర్ల అభ్యంతరాలు-ఈసీ సమర్ధన-చివరికి సుప్రీం బిగ్ ట్విస్ట్..!
మన దేశంలో కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారికి ఎన్నికల సంఘం ఇచ్చే ఫామ్ 6 (Form 6) దరఖాస్తు అత్యంత కీలకం. 18 ఏళ్లు పూర్తయిన లేదా త్వరలో పూర్తయ్యే అర్హులైన భారతీయులు ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇందులో కొత్త ఓటరు తన వ్యక్తిగత, నివాస, గుర్తింపు వివరాలను సమర్పించాలి. వాటిని పరిశీలించి ఈసీ అర్హులకు ఓటరు కార్డు జారీ చేస్తుంది. అయితే ఇన్నేళ్లుగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సాగిపోయిన ఈ ప్రక్రియ ఈసీ తప్పిదాల కారణంగా వివాదాస్పదంగా మారింది. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
ఫామ్ 6 వివాదం ఏంటి ? (Form 6 Controversy)
ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ నేపథ్యంలో ఆన్‌లైన్ ఫారం 6లో అదనపు డిక్లరేషన్‌ను చేర్చడంతో వివాదం మొదలైంది. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే వ్యక్తి తన తల్లిదండ్రులు గత SIRలో ఓటరు జాబితాలో మ్యాప్ అయ్యారా అనే విషయాన్ని వెల్లడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులకు సంబంధించిన గత ఓటరు జాబితా వివరాలు, పోలింగ్ స్టేషన్/సీరియల్ నంబర్ వంటి సమాచారాన్ని గుర్తించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ముఖ్యంగా తమ తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల పాత ఓటరు రికార్డులు అందుబాటులో లేని కొత్త ఓటర్లకు ఈ ప్రక్రియ ఇబ్బందిగా మారిందనే అభ్యంతరాలు వచ్చాయి.

ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, ఫారం 6లో చేపట్టిన ఈ అదనపు మార్పులపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మార్పులను అనుమతి లేకుండా చేయడం చట్టపరంగా సమస్యాత్మకమని వారు అభిప్రాయపడ్డారు. అయితే ఈ వివాదానికి కేంద్రబిందువు కేవలం ఫారం 6లో అదనపు వివరాలు అడగడమే కాదు. అలాంటి మార్పును చట్టబద్ధంగా ఏ ప్రక్రియ ద్వారా చేయాలి? ఎవరి అనుమతి అవసరం? అన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ మార్పు చట్టబద్దం కాదని, అక్రమమని కమిషనర్లు అభ్యంతరాలు తెలిపారు. కానీ ఈసీ వర్గాలు మాత్రం ఫారం 6లోని చట్టబద్ధమైన ఫారాన్ని మార్చలేదని, SIR ఆదేశాల్లో భాగంగా అదనపు డిక్లరేషన్‌ను ఉపయోగించామని, సంబంధిత SIR నిర్ణయాలకు కమిషన్‌లో ఏకాభిప్రాయం ఉందని గతంలో పేర్కొన్నాయి.
ఈసీ ఏం చెప్పింది ?
ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో ఈసీ కొన్ని రాష్ట్రాల్లో ఆన్‌లైన్ ఫారం 6 నుంచి అదనపు ఎస్ఐఆర్ డిక్లరేషన్‌ను తొలగించింది. SIR ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాల్లో ఆ అదనపు డిక్లరేషన్‌ను తొలగించి, సాధారణ చట్టబద్ధమైన ఫారం 6ను ఉపయోగించే విధానాన్ని పునరుద్ధరించింది. అయితే SIR ప్రక్రియ కొనసాగుతున్న ప్రాంతాల్లో పరిస్థితి వేరు. దీంతో ఫారం 6పై వివాదం పూర్తిగా ముగియకముందే అది మరో దశకు చేరింది. దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
ఇవాళ ఫారం 6 మార్పుల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా మార్చిన ఫారం 6ను తాము ఆమోదించలేదని ఛీఫ్ జస్టిస్ తెలిపారు. అలాగే ఈసీ రికార్డులు సమర్పించిన తర్వాత ఎవరు ఏం మార్చారనే విషయాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఎందుకంటే ఫారం 6కు సంబంధించిన అదనపు డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు/ఆదేశాల ఆధారంగా అమలు చేస్తున్నామని ఈసీ తరఫున వివరణ వచ్చిన నేపథ్యంలో సీజేఐ ఈ వ్యాఖ్య చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆ మార్పును తాను ఆమోదించలేదని ఇప్పుడు స్పష్టం చేసింది. ఫారం 6 మార్పుల సహా ఈసీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారు? అవి కమిషన్‌లో సమష్టి నిర్ణయాలా? సంబంధిత చట్టపరమైన ప్రక్రియను పాటించారా? వంటి ప్రశ్నలను కోర్టు పరిశీలిస్తోంది. అందుకే సీఈసీతో పాటు ఇద్దరు కమిషనర్లకు నోటీసులు ఇచ్చింది. కానీ సీఈసీని తాత్కాలికంగా సస్పెండ్ చేసేందుకు అంగీకరించలేదు.

ఫారం 6 అసలు ట్విస్ట్ ఇక్కడే
ఫారం 6 వివాదం ఇప్పుడు కేవలం ఒక ఆన్‌లైన్ ఫారంలో అదనపు కాలమ్ లేదా డిక్లరేషన్‌కు సంబంధించిన అంశంగా మిగలలేదు. ఇందులో మూడు ప్రధాన ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. మొదటిది చట్టబద్దమైన ఓటరు నమోదు ఫారంలో అదనపు అవసరాలను ఏ విధంగా చేర్చవచ్చు? రెండవది ఎన్నికల కమిషన్‌లోని బహుళ సభ్యుల మధ్య నిర్ణయాలు ఎలా తీసుకోవాలి?, మూడవది SIR వంటి భారీ ఓటరు జాబితా పునర్వ్యవస్థీకరణలో కొత్త ఓటర్ల నమోదుపై అదనపు షరతులు విధించడానికి ఉన్న చట్టపరమైన పరిధి ఎంత? ఈ ప్రశ్నలకు తుది సమాధానం ఇంకా న్యాయపరిశీలనలోనే ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు వీటిపై తేలిస్తే ఈసీలో ఎవరు దోషులన్నది తేలనుంది.












Click it and Unblock the Notifications
