బీజేపీలో బిగ్ వికెట్: మాజీ ముఖ్యమంత్రి రాజీనామా: అవమానకరంగా
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు సాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరికి అందజేశారు. స్పీకర్ అందుబాటులో లేకపోయినప్పటికీ- తన రాజీనామా లేఖను అందజేయడానికి జగదీష్ షెట్టార్ అదే పనిగా సిర్సికి వెళ్లారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు టికెట్ ఇవ్వట్లేదనే విషయాన్ని చివరి నిమిషం వరకూ దాచి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనకు టికెట్ కేటాయించట్లేదనే విషయాన్ని కనీసం రెండువారాల కిందట అయినా సూచనప్రాయంగానైనా తెలియజేసి ఉంటే- రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొని ఉండేవాడినని అన్నారు. టికెట్ ఖరారవుతుందని, ప్రచార కార్యక్రమాలను చూసుకోవాలంటూ పార్టీ అధిష్ఠానం నుంచి కూడా తనకు సందేశాలు అందాయని, తీరా జాబితాలో విడుదలైన తరువాత తన పేరు గల్లంతైందని జగదీష్ షెట్టార్ ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అగ్రనాయకత్వం ఉద్దేశపూరకంగానే తనను పక్కన పెట్టిందని భావిస్తోన్నానని, అవమానకర పరిస్థితుల్లో తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారాయన. ఇదివరకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవదికి కూడా టికెట్ కేటాయించలేదు బీజేపీ హైకమాండ్. దీనితో ఆయన ముందుజాగ్రత్త పడ్డారు. పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. బెళగావి జిల్లాలోని అథణి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిల్చున్నారు.

ఇప్పుడు తాజాగా జగదీష్ షెట్టార్ కూడా కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం కర్ణాటకలో జోరుగా సాగుతోంది. కోలార్ పర్యటనకు రానున్న అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు చెబుతున్నారు. బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన జగదీష్ షెట్టార్.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గుడ్‌బై చెప్పడం బీజేపీకి ఎదురుదెబ్బగా భావిస్తోన్నారు.












Click it and Unblock the Notifications