మాజీ సీఎం గుడ్ బై: అరవమోళ్ల మార్నింగ్ వాక్ రాజకీయం: ఎత్తుగడకు చిత్తు
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తమిళనాడు. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. కొత్తగా ఆవిర్భవించిన టీవీకే సైతం పూర్తిస్థాయిలో ఈ ఎన్నికల బరిలో దిగబోతోండటం వల్ల త్రిముఖ పోటీ ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ పరిస్థితుల్లో తమిళ రాజకీయాల్లో ఈక్వేషన్లు మళ్లీ మారే అవకాశాలు కనిపిస్తోన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే చీలికవర్గం నాయకుడు, బహిష్కృత నేత పన్నీర్ సెల్వం.. సంచలన రాజకీయాలకు తెర తీశారు. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగినట్లు ప్రకటించారు. బీజేపీ- ఎన్డీఏ ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నారు.

ఈ ఉదయం ఆయన ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిశారు. మార్నింగ్ వాక్ కు వెళ్లిన స్టాలిన్‌ను కలిశారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, పొత్తులు, తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించిన పలు అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి.
స్టాలిన్ ను కలిసిన కొన్ని గంటల తర్వాత.. పన్నీర్ సెల్వం తాజాగా ప్రకటన చేశారు. ఎన్డీఏ నుంచి వైదొలగనున్నట్లు తెలిపారు. ఆయన తదుపరి కార్యాచరణ ప్రణాళిక ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరావట్లేదు గానీ.. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకుంటారనే ప్రచారం తమిళనాడు రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.
అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన తరువాత పన్నీర్ సెల్వం పార్టీ వాలంటీర్ల హక్కుల పునరుద్ధరణ కమిటీ అనే సంస్థను ప్రారంభించారు. సొంతగూటికి చేరడానికి తాను సుముఖత వ్యక్తం చేశారు. ఆయనను పార్టీలోకి తీసుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అంగీకరించలేదు. ఆయనను తీసుకునే సమయం దాటిపోయిందని వ్యాఖ్యానించారు.
ఇటీవలే ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మోదీని కలవడానికి పన్నీర్ సెల్వం ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదు. అపాయింట్‌మెంట్ కోరినప్పటికీ దక్కలేదు. బీజేపీ తనను గౌరవించకపోవడంతో పన్నీర్‌సెల్వం కూటమి నుంచి బయటకు రావాలని నిర్ణయించినట్లు ఆయన రాజకీయ సలహాదారు పీ రామచంద్రన్ వెల్లడించారు కూడా.
ఈ పరిణామాల మధ్య ఆయన స్టాలిన్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్టాలిన్ ఈ ఉదయం చెన్నై అడయార్ పార్క్‌లో వాకింగ్‌కు వెళ్లగా.. పన్నీర్ సెల్వం ఆయనను కలిశారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు విడుదలయ్యాయి. ఆ తరువాతే ఎన్డీఏను వీడనున్నట్లు పన్నీర్ సెల్వం ప్రకటించడం చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications