వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్ఐవీ/ఎయిడ్స్: ఇలా చేస్తే రాకుండా ఉంటుందా, ‘పెప్’ ట్రీట్‌మెంట్ అంటే ఏంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఎయిడ్స్

కుమార్ ఇటీవల ఉద్యోగం కోసం పుణె వచ్చారు. డేటింగ్ యాప్‌లో నీతా అనే అమ్మాయిని ఆయన కలిశారు. నీతా కూడా వేరే ప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చారు.

రెండు నెలల్లో వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. కొత్త నగరం, కొత్త జీవితం వారిని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి.

వీరిద్దరూ కలిసి జీవించాలని ఒక రోజు నిర్ణయం తీసుకున్నారు. అలా రోజురోజుకీ వీరు మరింత దగ్గరయ్యారు. ఒకరోజు సెక్స్ చేసేటప్పుడు కుమార్ కండోమ్ చిరిగిపోయింది.

కుమార్ ఇదివరకెప్పుడూ అసురక్షిత శృంగారం (అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్)లో పాల్గొనలేదు. ఇలా జరగడం ఆయనకు ఇదే తొలిసారి.

మరోవైపు తను కూడా ఇలాంటి అసురక్షిత శృంగారంలో ఎప్పుడూ పాల్గొనలేదని నీతా కూడా ఆయనకు చెప్పారు.

అయినప్పటికీ కుమార్‌కు ఏదో అనుమానం వెంటాడుతూనే ఉండేది. తనకు హెచ్‌ఐవీ సోకుతుందని ఆయన భయపడేవారు.

ఎయిడ్స్

అన్నీ వేగంగా..

నేటి డేటింగ్ యాప్స్ ప్రపంచంలో అన్నీ చాలా వేగంగా జరిగిపోతున్నాయి. ఎదుటివారి నేపథ్యం తెలుసుకోవడానికి పెద్దగా సమయం కూడా యువత వెచ్చించడం లేదు.

అవతలి వ్యక్తి సెక్స్ హిస్టరీ, ఆరోగ్యం గురించి కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు.

అయితే, కుమార్‌ అలా కాదు. ఆ మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే తన స్నేహితుడైన ఒక డాక్టర్‌కు జరిగిన సంగతి చెప్పారు.

వెంటనే తను హెచ్‌ఐవీ టెస్టు చేయించుకోవాలని భావిస్తున్నట్లు వివరించారు.

అయితే, ముందుగా పెప్ (పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ ట్రీట్‌మెంట్ Post-Exposure Prophylaxis-PEP)కు హాజరుకావాలని కుమార్‌కు అతడికి డాక్టర్ మిత్రుడు సూచించారు. వెంటనే కొన్ని మాత్రలు వేసుకోవాలని చెప్పారు.

ఆ తరువాత 28 రోజులు కుమార్ క్రమం తప్పకుండా సూచించిన మందులను వేసుకున్నారు, అలా ప్రమాదంతోపాటు భయం నుంచీ కూడా తప్పించుకున్నారు.

బహుశా ఇప్పుడు మీ బుర్రలో కొన్ని ప్రశ్నలు పుట్టుకొచ్చి ఉండొచ్చు. వాటికి ఇప్పుడు సమాధానాలు చూద్దాం.

ఈ అంశంపై ఐసీఎంఆర్-ఎన్ఏఆర్ఐ మాజీ ఆరోగ్య అధికారి డాక్టర్ రిషీకేశ్ అంధాల్కర్‌తో బీబీసీ మాట్లాడింది.

హెచ్‌ఐవీ వ్యాప్తి గురించి ఆయన సంవత్సరాలపాటు పరిశోధనలు చేశారు. ప్రస్తుతం ఆయన లండన్ క్వీన్ మేరీ యూనివర్సిటీలో పబ్లిక్ హెల్త్ అండ్ పాలసీలో రీసెర్చ్ చేస్తున్నారు.

ఎయిడ్స్

1. 'పెప్’ అంటే ఏమిటి?

పెప్ అంటే పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్(PEP) ట్రీట్‌మెంట్. సాధారణంగా హెచ్‌ఐవీ రోగులకు ఇచ్చే మందులనే పెప్‌లో భాగంగా ఇస్తారు. ఈ ఔషధం టాబ్లెట్ల రూపంలో ఇస్తారు.

హెచ్ఐవీ సోకిన వ్యక్తితో సెక్స్ చేసినా లేదా హెచ్‌ఐవీ సోకినట్లు అనుమానం ఉండే వ్యక్తితో సెక్స్ చేసినా లేదా అసురక్షిత శృంగారంలో పాల్గొన్నా లేదా ఓరల్ సెక్స్ చేసినా లేదా హెచ్‌ఐవీ రోగుల కోసం పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందికి ఈ పెప్ ట్రీట్‌మెంట్‌ను సూచిస్తుంటారు.

అయితే, సెక్స్‌లో పాల్గొన్న లేదా వైరస్‌ వ్యాపించినట్లు అనుమానం వచ్చిన తొలి 72 గంటల్లోనే పెప్ చికిత్సను మొదలుపెట్టాల్సి ఉంటుంది.

అయితే, ఈ చికిత్సను 24 గంటల్లోనే మొదలుపెట్టడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

ఎందుకంటే వైరస్ సోకిన తర్వాత ప్రతి గంటా చాలా ముఖ్యమైనది. వీలైనంత త్వరగా చికిత్స మొదలుపెట్టాలి.

2. ఎలాంటి పరిస్థితుల్లో పెప్ మొదలుపెట్టాలి?

  • హెచ్ఐవీ సోకినా లేదా హెచ్‌ఐవీ సోకినట్లు అనుమానం వచ్చిన వ్యక్తితో సెక్స్ చేసిన వెంటనే..
  • హెచ్ఐవీతో కలుషితమైన రక్తాన్ని తాకినప్పుడు లేదా ఆ కలుషితమైన రక్తాన్ని ఎక్కించినప్పుడు..
  • హెచ్ఐవీ ముప్పును పెంచే ఎలాంటి చర్యలకైనా పాల్పడినప్పుడు..
  • ఒకరి కంటే ఎక్కువ మంది సెక్స్ భాగస్వాములు ఉన్నప్పుడు లేదా సెక్స్ చేసినప్పుడు కండోమ్ చిరిగిపోతే..
  • ఒకే సూది ద్వారా ఎక్కువ మంది డ్రగ్స్ తీసుకున్నప్పుడు..
ఎయిడ్స్

3. ఎవరికి పెప్ అవసరం?

  • అసురక్షిత ఓరల్, యానల్, వెజైనల్ సెక్స్ చేసినవారు
  • లైంగిక దాడి బాధితులు
  • ఎల్‌జీబీటీక్యూ వర్గాల ప్రజలు
  • హెచ్ఐవీ వ్యాప్తి ముప్పును పెంచే చర్యలకు పాల్పడేవారు

4. పెప్ చికిత్స ఎన్ని రోజులు తీసుకోవాలి?

సాధారణంగా పెప్ చికిత్స 28 రోజులు లేదా నెల రోజులు ఉంటుంది. ముఖ్యంగా ఈ మందులను మధ్యలో ఆపేయకూడదు. లేదా విరామం ఇవ్వకూడదు.

వరుసగా 28 రోజులూ ఆ మాత్రలను వేసుకోవాలి.

ఒకవేళ ఏదైనా ఒక రోజు మధ్యలో మిస్ అయితే, 24 గంటల్లోపే వెంటనే ట్యాబ్లెట్ వేసుకొనేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఒకవేళ 48 గంటల కంటే ఎక్కువ గ్యాప్ వస్తే.. ఆ చికిత్స ఇక పని చేయనట్లుగా భావించాలి. అలాంటప్పుడు వైద్యులను సంప్రదించిన తర్వాత ఆ ట్యాబ్లెట్స్ ఇక వేసుకోవడం ఆపేయాలి.

ఎయిడ్స్

5. పెప్ వల్ల హెచ్ఐవీ ముప్పు ఎలా తగ్గుతుంది?

ప్రాథమిక దశల్లో హెచ్‌ఐవీ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అయితే, ఈ వైరస్ తన సంఖ్యను పెంచుకోకుండా ప్రెప్ అడ్డుకుంటుంది.

6. పెప్‌తో దుష్ప్రభావాలు ఉంటాయా?

పెప్ వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉండొచ్చు. అయితే, ఇవేమీ ప్రాణాలు పోయేంత ముప్పులను కలిగించవు. పెప్ వల్ల కలిగే ప్రయోజనాలతో పోలిస్తే, ఈ ముప్పులు కాస్త తక్కువగానే ఉన్నట్లు పరిగణించాలి.

సాధారణంగా నీరసం, డయేరియా, వాంతులు, తలనొప్పి, కడుపునొప్పి, కడుపులో గ్యాస్ పేరుకోవడం లాంటి దుష్ప్రభావాలు పెప్ తీసుకునే వారిలో కనిపిస్తాయి.

కొన్ని అరుదైన కేసుల్లో కొంతమందికి కుంగుబాటు(డిప్రెషన్) కూడా రావొచ్చు.

ఎయిడ్స్

7. పెప్‌కు ప్రత్యామ్నాయం ఉందా?

హెచ్ఐవీ రోగులు లేదా ఇన్ఫెక్షన్ సోకినవారు లేదా ఒకరి కంటే ఎక్కువ మంది లైంగిక పార్ట్‌నర్‌లు ఉండేవారికి నిత్యం సెక్స్ చేసేవారికి పెప్‌తో ఉపయోగం ఉండదు.

వీరికి ప్రెప్(Pre-exposure prophylaxis-PrEP) ) అనే మరో చికిత్స అందుబాటులో ఉంది.

పెప్ అనేది కీలకమైన సమయంలో ముప్పు నుంచి తప్పించేందుకు తోడ్పడుతుంది. అయితే, పెప్ తీసుకున్నంత మాత్రాన వంద శాతం ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ ఉంటుందని భావించకూడదు.

అసురక్షిత సెక్స్ తర్వాత ప్రతి గంటా అమూల్యమైనది. వీలైనంత త్వరగా పెప్‌ను మొదలుపెట్టాలి. అయితే, అసలు అసురక్షిత శృంగారానికే దూరంగా ఉండటం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

8. పెప్‌తో లైంగిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా?

పెప్ చికిత్స తీసుకున్న వారిలో లైంగిక ఆరోగ్యం ప్రభావితం అవుతున్నట్లు ఏ పరిశోధనలోనూ బయటపడ లేదు.

9. ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీకి పెప్ ఎందుకు ముఖ్యం?

అసురక్షిత శృంగారంలో ఎక్కువగా పాల్గొనే ఎల్‌జీబీటీ కమ్యూనిటీకి ప్రెప్( PrEP) చికిత్స చాలా ముఖ్యమైనది. ఇందుకంటే వీరికి ఒకరి కంటే ఎక్కువ మంది సెక్స్ పార్ట్‌నర్‌లు ఉండే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి పెప్ కంటే ప్రెప్ తీసుకోవడమే మేలు.

10. పెప్ చికిత్స ఎక్కడ దొరుకుతుంది? ఏ డాక్టర్‌ను మనం సంప్రదించాలి?

ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా పెప్ చికిత్స అందుబాటులో ఉంటుంది. అక్కడ ఉచితంగా ఈ మాత్రలు ఇస్తారు. మరోవైపు కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఈ చికిత్స అందుబాటులో ఉంటోంది.

అయితే, సదరు డాక్టర్‌తో మాట్లాడిన తర్వాత మాత్రమే ట్యాబ్లెట్లు వేసుకోవడం మొదలుపెట్టాలి.

మాత్రలను సూచించే ముందు ఆ వ్యక్తి ఆరోగ్య చరిత్రను డాక్టర్ పరిశీలిస్తారు. ఆ తర్వాతే చికిత్స మొదలుపెడతారు.

11. పెప్ చికిత్స ఖర్చు ఎంత?

సాధారణంగా పెప్ ఔషధాలు రూ.1000 నుంచి రూ.1500 వరకు ఉంటాయి. అయితే, వైద్యుల సూచనల మేరకే ఈ చికిత్సను ఆశ్రయించాలి.

12. రోగుల సమాచారం గోప్యంగా ఉంచుతారా?

అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు.. రెండు ఆసుపత్రులూ రోగుల వివరాలను గోప్యంగా ఉంచుతాయి.

13. పెప్ సమర్థవంతంగా పనిచేస్తుందా?

ఇది వంద శాతం కచ్చితంగా పనిచేస్తుందని చెప్పలేం. కానీ, సెక్స్ తర్వాత మొదటి 72 గంటలు చాలా కీలకం. ఎంత వేగంగా మనం చికిత్స మొదలుపెడితే అంత మంచిది. మొదటి 24 గంటలూ మరింత ముఖ్యం. 28 రోజుల చికిత్స తర్వాత, ఆరు నెలలు కూడా చాలా ముఖ్యం. ఆ ఆరు నెలల తర్వాత హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవాలి. సీడీ4 కౌంట్ కూడా చెక్ చేసుకోవాలి. పెప్ ఎంత వరకు పనిచేసింది అనేది ఈ పరీక్షల్లో తెలుస్తుంది.

14. అందరికీ పెప్ చికిత్స ఒకేలా ఉంటుందా?

మహిళలు, పురుషులు, ఎల్‌జీబీటీ వర్గాలు ఇలా అందరికీ పెప్ చికిత్స ఒకేలా ఉంటుంది.

15.ప్రతి అసురక్షిత సెక్స్ తర్వాత పెప్ తీసుకోవాలా?

నిజానికి ఇది అనుకోకుండా జరిగిన తప్పును సవరించే ప్రక్రియ. తరచూ ఇలా అసురక్షిత సెక్స్‌లో పాల్గొన్నా లేదా డ్రగ్స్ ఒకే సూదితో చాలా మంది తీసుకున్నా.. ప్రెప్‌(PrEP)ను తీసుకోవడం ఉత్తమం.

నిజానికి పెప్ కంటే ముందు కండోమ్‌లను తరచూ ఉపయోగించాలి. మరోవైపు ఒకరి కంటే ఎక్కువ మందితో సెక్స్ చేయడాన్ని మానుకోవాలి.

16. ప్రెప్(PrEP) అంటే ఏమిటి?

ప్రెప్ అంటే ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రోఫిలాక్సిస్. ఇది కూడా ట్యాబ్లెట్ల రూపంలో అందుబాటులో ఉంటుంది.

రోజూ ఈ మాత్రను వేసుకోవడంతో హెచ్ఐవీ రాకుండా అడ్డుకోవచ్చు.

అయితే, ప్రెప్ చికిత్స తీసుకోకముందే, మీకు హెచ్ఐవీ సోకలేదని నిర్ధారించుకోవాలి. మీరు ప్రెప్ తీసుకున్న తర్వాత హెచ్ఐవీ బాధితులతో సెక్స్ చేసినప్పుడు మీకు వైరస్ సోకే అవకాశాలు దాదాపుగా ఉండవు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
HIV/AIDS: Can It Be Prevented What is 'Pep' Treatment?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X