మణిపూర్‌లో నా భార్యను నగ్నంగా ఊరేగించారు: కార్గిల్ వార్ హీరో ఆవేదన
ఇంఫాల్: మణిపూర్‌లో చెలరేగిన హింస చల్లారట్లేదు. రెండున్నర నెలలుగా ఈ ప్రశాంత రాష్ట్రం మండిపోతూనే వస్తోంది. మేటీ, కుకీ సామాజిక వర్గాల మధ్య మొదలైన రిజర్వేషన్ అంశం రోజురోజుకూ తీవ్రరూపాన్ని దాల్చుతూనే ఉంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపినప్పటికీ.. ఏ మాత్రం ఫలితం ఉండట్లేదు.
మే 3వ తేదీన మణిపూర్‌లో మేటీ, కుకీ సామాజిక వర్గాల మధ్య హింస చెలరేగింది. అప్పటి నుంచి 150 మందికి పైగా మరణించారు. అనేకమంది గాయపడ్డారు. ఇప్పటివరకూ ఈ హింసాత్మక పరిస్థితులకు అడ్డుకట్ట పడట్లేదు. దాడులు, ప్రతిదాడులతో తగలబడుతూనే ఉంది మణిపూర్. రాజకీయ జోక్యం కూడా పని చేయట్లేదు.

ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి.. ఊరేగించడం, అందరూ చూస్తుండగానే వారిపై అత్యాచారానికి పాల్పడిన అమానవీయ సంఘటనల వీడియోలు వెలుగులోకి రావడం- అక్కడి హింసాత్మక పరిస్థితులకు ఆజ్యం పోసినట్టయింది. ఈ ఘటన- అటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ ప్రస్తావనకు వచ్చింది. ఉభయసభల్లో ప్రకంపనలు పుట్టించింది. ఈ దారుణ ఘటనకు ప్రధాన కారకుడైన హుయిరెమ్ హెరోదాస్ మేటీ సహా మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాంగ్‌పోక్పి జిల్లాలో ఒక వర్గానికి చెందిన మహిళలను ప్రత్యర్థులు నగ్నంగా ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు హుయిరేమ్ హెరోదాస్ మేటీ ఇంటిపై బాధితురాలి సామాజిక వర్గానికి చెందిన వారు దాడి చేశారు. ఇంటిని తగులబెట్టారు. ఈ దాడి చేసిన వారిలో మహిళలే పెద్ద సంఖ్యలో ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్, కిరోసిన్‌తో వారు హెరోదాస్ ఇంటిని దగ్ధం చేశారు.
ఈ దాష్ఠీకానికి బలైన ఇద్దరు మహిళల్లో ఒకరు- మాజీ సైనికాధికారి భార్య. కార్గిల్ వార్ యుద్ధంలో పాల్గొన్నారాయన. భారత భూభాగంపైకి చొచ్చుకు వచ్చిన పాకిస్తానీయులను తరిమి కొట్టిన జవాన్లకు నాయకత్వాన్ని వహించారు అప్పట్లో. అస్సాం రెజిమెంట్‌లో సుబేదార్ హోదాలో పని చేశారు. గతంలో శ్రీలంకలో ఐక్యరాజ్య సమితి శాంతి బలగాల్లో పాల్గొన్న భారత సైన్యానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహించారు.
తన భార్యతో పాటు మరో మహిళను నగ్నంగా ఊరేగించడం పట్ల ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి, దేశాన్ని కాపాడుకోగలిగాను గానీ మణిపూర్‌లో అల్లరి మూకల బారి నుంచి తన భార్యను రక్షించుకోలేకపోయానంటూ కన్నీరు పెట్టుకున్నారు.












Click it and Unblock the Notifications