సీఈసీపై తేల్చేందుకు ఇండియా కూటమి సిద్ధం..! 30న కీలక భేటీ..!
కేంద్ర ఎన్నికల సంఘంలో తలెత్తిన విభేదాలు, ఆ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్న విపక్ష ఇండియా కూటమి ఈ వ్యవహారంలో దేశవ్యాప్త నిరసనలకు సిద్దమవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తాజాగా దేశవ్యాప్తంగా ఇదే అంశంపై ఆందోళనలు చేపట్టింది. దీనికి కొనసాగింపుగా ఇండియా కూటమిలోని (INDIA Bloc) అన్ని విపక్ష పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో, పార్లమెంట్ లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు ఈ నెల 30న భేటీ అవుతున్నారు.
సెప్టెంబర్ 30న ఢిల్లీలో 'ఇండియా' (INDIA) కూటమి పార్టీలు సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్నికల సంఘం ,ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.ఎన్నికల సంఘం పనితీరు ,ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై రాజకీయ వివాదం కొనసాగుతున్న తరుణంలో ఈ భేటీ జరగనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఆయనను తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న పలు రాష్ట్రాల్లో రోడ్డెక్కారు.
జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, చండీగఢ్, మణిపూర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రదర్శనలు చేశారు.

ఎన్నికల కమిషన్ కార్యాలయాల వరకు ర్యాలీగా వెళ్లి, కుమార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలని రాష్ట్ర విభాగాలను కోరుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిరసనలు జరిగాయి. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు ఇండియా కూటమి పార్టీలు సమావేశమవుతున్నాయి. ఇందులో సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని కోరుతూ పార్లమెంటు ఉభయ సభలలో ఒక తీర్మానాన్ని సిద్ధం చేస్తున్నట్లు ప్రతిపక్ష వర్గాలు తెలిపాయి. అంతకు ముందే సెప్టెంబర్ 29న న్యూఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చ చర్చిస్తారు.
ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణకు సంబంధించిన నిర్ణయాలు, ఉత్తర్వులపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి 10 నెలల వ్యవధిలో కనీసం 14 సార్లు అభ్యంతరాలు నమోదు చేశారని 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' జరిపిన దర్యాప్తులో తేలడంతో ఈ రాజకీయ వివాదం తీవ్రరూపం దాల్చింది.ఇందులో ఓటరు నమోదు ఫారం 6లో మార్పులు, ఓటర్ల జాబితాలో చేర్పులు ,తొలగింపులు, ఓటర్ల జాబితా సమాచారాన్ని కేంద్రీకరించడం వంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ అభ్యంతరాలు సంస్థాగత అసమ్మతి కిందకు వస్తాయన్న వాదనను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. భిన్నమైన అభిప్రాయాలు, కార్యాచరణపరమైన ప్రశ్నలు, అంతర్గత ఫీడ్‌బ్యాక్, పరిపాలనాపరమైన సూచనలు అనేవి బహుళసభ్యుల రాజ్యాంగ సంస్థ పనితీరులో భాగమేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ఈ వాదనలకు కౌంటర్ ఇవ్వబోతోంది.














Click it and Unblock the Notifications
