భారత నేవీ నౌకను ఢీకొట్టిన పాక్ నేవీ నౌక..! కేంద్రం సీరియస్, సమన్లు..!
భారత్ పై (India) పొరుగుదేశం పాకిస్తాన్ (Pakistan) మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. అంతర్జాతీయ జలాల్లో మన నేవీ నౌకను పాకిస్తాన్ నేవీ నౌక ఢీకొట్టింది. ఎలాంటి కవ్వింపులు లేకుండా చోటు చేసుకున్న ఈ ఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం పాక్ రాయబారికి సమన్లు జారీ చేసింది. పాకిస్తానీ నౌకాదళ యూనిట్ల ఆమోదయోగ్యం కాని వృత్తివిరుద్ధమైన ప్రవర్తన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని విదేశీ మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే మన నౌకాదళ నౌకకు ఎలాంటి నష్టం జరగలేదు.
గతేడాది పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలోనే అంతర్జాతీయ జలాల్లో నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఉత్తర అరేబియా సముద్రంలో భారత యుద్ధనౌక సాధారణ నిఘా విధుల్లో ఉండగా.. పాకిస్థాన్ నౌకాదళ నౌక ఒకటి వేగంగా వచ్చి దానిని ఢీకొట్టింది. అయితే, దీనివల్ల మన నౌకకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే దీని వెనుక ఉన్న కారణాలేంటన్నది బయటకు రాలేదు.

అయినా ఇలా భారత నౌకను పాకిస్తాన్ నేవీ నౌక ఢీకొనడం కవ్వింపు చర్యల కిందకే వస్తుందని భావిస్తున్న కేంద్రం.. ఆ మేరకు వివరణ ఇవ్వాలని ఇస్లామాబాద్ రాయబారికి సమన్లు పంపింది. దీనిపై పాకిస్తాన్ స్పందన ఆధారంగా కేంద్రం తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సింధు జలాల విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంతో విలవిల్లాడుతున్న పాకిస్తాన్.. ఏదో విధంగా కవ్వింపు చర్యలకు దిగాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ జలాల్లో చోటు చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.













Click it and Unblock the Notifications
