క్రికెటర్ కేదార్ జాదవ్ తండ్రి మిస్సింగ్..!!
ముంబై: భారత క్రికెట్ జట్టు ఆటగాడు కేదార్ జాదవ్ తండ్రి మహదేవ్ జాదవ్ అదృశ్యం అయ్యారు. ఈ ఉదయం నుంచి ఆయన కనిపించట్లేదు. ఈ మేరకు మహారాష్ట్రలోని పుణె పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఉదయం 11:30 గంటల నుంచి మహదేవ్ జాదవ్ కనిపించకుండా పోయారు. చివరిసారిగా ఆయన పుణేలోని కొథ్రూడ్ ప్రాంతంలో కనిపించారు. ఆ తరువాత అదృశ్యం అయ్యారు. దీనితో కేదార్ జాదవ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుణేలోని అలంకార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహదేవ్ జాదవ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనికోసం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తోన్నారు. కేదార్ జాదవ్ తన తల్లిదండ్రులు మహదేవ్ జాదవ్, మందాకిని జాదవ్‌తో కలిసి పుణేలోని కొథ్రూడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిటీ ప్రైడ్ థియేటర్ సమీపంలో నివసిస్తోన్నారు. మహదేవ్ జాదవ్ వయస్సు 75 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన డైమెన్షియాకు గురయ్యారు.

ఆయన నివసిస్తోన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో గల సీసీటీవీలను పోలీసులు పరిశీలించగా.. పార్కింగ్ స్థలంలో వాకింగ్ చేస్తూ కనిపించారు. ఆ తరువాత గేట్ తీసుకుని బయటికి వెళ్లారు. కొథ్రూడ్ ప్రాంతంలో ఆటో రిక్షాలో వెళ్లిపోయారు. ఆ తరువాత ఆయనకు సంబంధించిన ఆచూకీ ఏదీ తెలియరాలేదు ఇప్పటివరకు. అదృశ్యమైన సమయంలో మహదేవ్ జాదవ్.. తెల్ల చొక్కా, బూడిద రంగు ప్యాంటు వేసుకున్నారని కేదార్ జాదవ్ తన కంప్లైంట్ రిపోర్టులో పొందుపరిచారు. ఇతర ఆనవాళ్లను పోలీసులకు వివరించారు.
మహదేవ్ జాదవ్ తన వెంట సెల్ ఫోన్ గానీ, డబ్బులు గానీ తీసుకెళ్లలేదని రిపోర్టులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన వెంటనే పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన ఫొటోను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లల్లో గాలించారు. అక్కడ అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలించారు. ఇప్పటివరకు మహదేవ్ జాదవ్ కు సంబంధించిన ఎలాంటి ఆచూకీ కనిపించలేదు.
కేదార్ జాదవ్ కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటోన్నాడు. ఆయన వైఫల్యాలు వెంటాడుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లను ఆడినప్పటికీ- అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. ఐపీఎల్ 2023 సీజన్ కు కూడా ఆయన ఎంపిక కాలేదు. ఫామ్ కోల్పోవడం వల్ల ఆయనను తీసుకోవడానికి ఏ జట్టు కూడా ఆసక్తి చూపించలేదు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో మెరిశాడు కేదార్ జాదవ్. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 93 మ్యాచ్‌లను ఆడాడు. 1196 పరుగులు చేశాడు. వ్యక్తిగత అత్యధిక పరుగులు 69.












Click it and Unblock the Notifications