వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాయు కాలుష్యంలోని కర్బన ఉద్గారాలతో ఫ్లోర్ టైల్స్‌ తయారు చేస్తున్న భారతీయుడు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పొల్యూషన్

ప్రపంచవ్యాప్తంగా అనేక అనారోగ్యాలకు ప్రధాన కారణం పొగమంచు. కానీ గాలిలోని కర్బన కాలుష్యాన్ని సంగ్రహించి రీసైకిల్ చేస్తే గాలి స్వచ్ఛంగా మారడమే కాకుండా ఆ సంగ్రహించిన కాలుష్య పదార్థాలతో టైల్స్ తయారు చేయొచ్చని భారత్‌కు చెందిన ఓ ఆవిష్కర్త ఆశిస్తున్నారు.

అంగద్ దర్యానీ ముంబయిలో నివసిస్తారు. పదేళ్ల వయసులో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడే సమయంలో పొగమంచు కారణంగా శ్వాస తీసుకోవడంలో ఆయన తరచుగా ఇబ్బంది పడేవారు. బాగా కలుషితమైన గాలి వల్ల ఆస్తమా ఆయన్ను తీవ్రంగా వేధించేది.

''నేను ముంబయి మైదానాల్లో ఆడుకునేటప్పుడు, కాలుష్యం కారణంగా ఎప్పుడూ దగ్గు వస్తుండేది. అప్పుడు నాకు ఉబ్బసం ఉండేది. దానివల్ల మైదానంలో నా సామర్థ్యం మేరకు రాణించలేకపోయేవాడిని'' అని 23 ఏళ్ల దర్యానీ చెప్పారు.

ప్రపంచంలోనే అతి ప్రమాదకరమై స్థాయిలో వాయు కాలుష్యం భారత్‌లో ఉంది. ప్రపంచంలో అత్యధిక కాలుష్యాన్ని కలిగిన 30 నగరాల్లో 22 భారత్‌‌కు చెందినవే.

విషపూరితమైన గాలి వల్ల ఇండియాలో ఏటా పది లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు.

భారత్‌లోని చాలా నగరాల్లోని గాలిలో పీఎం 2.5 పార్టికల్స్‌గా పిలిచే అత్యంత ప్రమాదకరమైన సూక్ష్మ ధూళి కణాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి.

ఈ కాలుష్య కారకాలు ఊపిరితిత్తులు, గుండె జబ్బులకు కారణమవుతున్నాయి. రోగ నిరోధక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తున్నాయి.

దిల్లీలో గతేడాది 54,000 అకాల మరణాలకు పీఎం 2.5 వాయు కాలుష్యం కారణమైందని గ్రీన్‌పీస్ ఆగ్నేయాసియా తన విశ్లేషణలో వెల్లడించింది.

''భారత్‌లో, అమెరికా నగరాలతో పోలిస్తే శక్తి స్థాయిల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. కాలుష్యం కారణంగా ఉదయం లేచిన కాసేపటికే మనం అలసిపోతాం'' అని దర్యానీ చెప్పారు.

వాయు కాలుష్యం గ్లోబల్ వార్మింగ్‌కు దారితీస్తోంది. గాలిలోని బ్లాక్ కార్బన్.. కార్బన్ డయాక్సైడ్ కన్నా 10 లక్షల రెట్లు అధికంగా సూర్యుని నుంచి శక్తిని గ్రహిస్తోంది. కాలుష్య కారకమైన బ్లాక్ కార్బన్ స్థాయి తగ్గించడం ద్వారా గాలి నాణ్యతను పెంచడంతో పాటు, గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యంపై వాయు కాలుష్యం చూపే ప్రభావాన్ని దర్యానీ స్వయంగా అనుభవించారు. కాబట్టే భారతదేశంలో ఆకాశాన్ని శుభ్రం చేసేందుకు ముందుకొస్తోన్న పారిశ్రామికవేత్తలలో దర్యానీ కూడా చేరారు.

ఆయన ఈ సమస్యకు పరిష్కారంగా... గాలిలోని మసిని, ఇతర కాలుష్య కారకాలను కంటైనర్‌లలో సంగ్రహించడం ద్వారా స్వచ్ఛమైన గాలిని పొందవచ్చని చెబుతున్నారు.

సంగ్రహించిన కాలుష్య పదార్థాలతో టైల్స్‌ను రూపొందించవచ్చని అంటున్నారు.

''వాతావారణ మార్పులకు, ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతోన్న వాయు కాలుష్యాన్ని నిర్మూలించడం ఎంత ప్రధాన అవసరమో కరోనా మహమ్మారి వల్ల ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది'' అని దర్యానీ అన్నారు.

''ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది వాయు కాలుష్యానికి బలవుతున్నారు. కానీ ఈ సమస్యను మనం కరోనా లాంటి తీవ్రమైన సమస్యగా పరిగణించం.''

గత ఏడాది దిల్లీలో పీఎం 2.5 పార్టికల్స్ సాంద్రత ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన పరిమితి కన్నా 14 రెట్లు అధికంగా నమోదైంది.

ఆ సమయంలో కరోనా వ్యాప్తి పెరుగుదలకు వాయు కాలుష్యమే కారణమని దిల్లీ ముఖ్యమంత్రి ఆరోపించారు.

అత్యధిక స్థాయిలోని వాయు కాలుష్యం కారణంగానే కోవిడ్-19 మరణాలు గణనీయంగా పెరిగి ఉండవచ్చని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.

హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం, ఒక ఘనపు మీటర్ గాలిలో 1 మైక్రోగ్రామ్ పీఎం 2.5 పార్టికల్స్ పెరుగుదల వల్ల యూఎస్ నగరాల్లో 15 శాతం ఎక్కువగా కోవిడ్ మరణాలు నమోదైనట్లు చెబుతోంది.

కాలుష్యం

''వాయు కాలుష్యంలోని కొంచెం పెరుగుదల కూడా మరణాల సంఖ్యను గణనీయంగా పెంచింది'' అని హార్వర్డ్ విశ్వవిద్యాలయ సెంటర్ ఫర్ క్లైమేట్, హెల్త్, గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ డైరెక్టర్ ఆరోన్ బెర్న్‌స్టెయిన్ చెప్పారు.

ప్రజారోగ్యాన్ని రక్షించడానికి భారత్ అత్యవసరంగా కాలుష్యాన్ని తగ్గించాలి అని దర్యానీ అన్నారు.

''భారత్‌లో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలనే వినియోగించడానికి ఇంకా కనీసం 30 ఏళ్ల సమయం పడుతుంది. ఈలోగా దేశమంతా కాలుష్యమయం అయిపోతుంది. అందుకే నగరాల వారీగా గాలిని శుద్ధిచేయాలి'' అని దర్యానీ వివరించారు.

వాయు కాలుష్యానికి ఆయన సూచించిన పరిష్కారం కూడా సులభంగానే ఉంది. కలుషితమైన గాలిని సంగ్రహించి దాన్ని మరొక ఉత్పత్తిగా మార్చే వ్యవస్థను అతి తక్కువ వ్యయంతో రూపొందించారు.

అమెరికాలోని జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదివే సమయంలో దర్యానీ 'అవుట్ డోర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్‌'ను రూపొందించారు.

ఈ పరికరం గాలిలోని కాలుష్య కారకాలను, సూక్ష్మ ధూళి కణాలను వేరుచేస్తుంది. వేరు చేసిన ఈ కాలుష్య కారకాలను ఆ పరికరం ఒక కంటైనర్‌లో బంధించి ఉంచుతుంది. స్వచ్ఛమైన గాలిని బయటకు విడుదల చేస్తుంది.

ఈ పరికరాన్ని రూపొందించిన తర్వాత 2017లో దర్యానీ 'ప్రాన్' అనే స్టార్టప్‌ను ప్రారంభించారు. అందరికీ అందుబాటులో ఉండే, ప్రత్యేకమైన అవుట్ డోర్ ఎయిర్ ప్యూరిఫయర్‌ను తయారు చేయాలనే ఉద్దేశంతోనే ప్రాన్‌ను ఏర్పాటు చేశారు.

వీలైనంత ఎక్కువ గాలిని శుద్ధి చేయగలిగే, ప్రపంచంలోనే తొలి ఫిల్టర్‌లెస్ ప్యూరిఫయర్‌ను తయారు చేయడమే 'ప్రాన్' లక్ష్యం.

pollution

ప్రాన్ తయారు చేసిన పరికరం 176 సెంటీ మీటర్ల పొడవు ఉంటుంది. దీన్ని వీధుల్లో, అపార్ట్‌మెంట్ బ్లాక్స్, పాఠశాలల్లో సులభంగా ఏర్పాటు చేయవచ్చు. దీని ధర ఐఫోన్ ప్రొ కన్నా తక్కువే ఉంటుందని దర్యానీ చెప్పుకొచ్చారు.

ఇళ్లలో ఉపయోగించే ఫిల్టర్ ఆధారిత ఎయిర్ ప్యూరిఫయర్లను అభివృద్ధి చేయడం మా లక్ష్యం కాదు. ఎందుకంటే ఫిల్టర్లను ప్రతీరోజు మార్చాల్సి వస్తుంది. ఇన్‌డోర్ ప్యూరిఫయర్లను ఉపయోగించే హోటళ్లు ఫిల్టర్ల కోసమే ఏటా లక్షల డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. '' అందుకే ఫిల్టర్‌లెస్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలనుకున్నా'' అని దర్యానీ చెప్పారు.

దర్యానీ అభివృద్ధి చేసిన ఈ ఒక్క పరికరం, నిమిషానికి 300 క్యూబిక్ ఫీట్ల గాలిని శుద్ధి చేయగలదు. 11,540 క్యూబిక్ సెంటీమీటర్ల కాలుష్య కారకాలను బంధించగలదు.

వాతావరణంలోని కాలుష్యాన్ని బట్టి... కాలుష్య కారకాలను బంధించే చాంబర్‌ను 2 నుంచి 6 నెలలకు ఒకసారి ఖాళీ చేయాల్సి ఉంటుంది.

పరికరం సంగ్రహించిన కాలుష్య కారకాలను పారేయడానికి బదులుగా వాటిని సద్వినియోగం చేయాలని దర్యానీ బృందం భావించింది.

కంటైనర్లలో నిల్వ చేసే కార్బన్‌ను ప్రాసెస్ చేసే ప్రక్రియను మరో భారత కంపెనీకి అప్పగించింది. 'కార్బన్ క్రాఫ్ట్ డిజైన్' అనే కంపెనీ, కార్బన్ కారకాలను పొడిరూపంలో చేసి వాటి నుంచి అందమైన ఫ్లోరింగ్ టైల్స్‌ను తయారు చేస్తోంది.

కాలు

కర్బన కారకాలు క్వారీల్లో లభించే రాతి వ్యర్థాల్లాగా, బంకమట్టి, సిమెంట్ లాంటి బైండింగ్ ఏజెంట్లలాగా పనిచేస్తాయి. అందుకే వీటితో టైల్స్‌ను తయారు చేస్తారు. ఈ విధంగా తయారు చేసిన టైల్స్‌ను హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌లో వినియోగిస్తారు.

అమెరికా, భారత్‌లోని ఇన్వెస్టర్లు 'ప్రాన్'లో 15 లక్షల డాలర్ల పెట్లుబడులు పెట్టారు. వీటిని ఉపయోగించి ఒక పైలట్ ప్రాజెక్టును అమలు చేయాలని దర్యానీ భావిస్తున్నారు. దేశంలోని పాఠశాలలు, హోటళ్లు, పరిశ్రమల్లో ఈ పరికరాలను అందుబాటులో ఉంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

విదేశాలకు కూడా ఈ టెక్నాలజీని చేర్చాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే దక్షిణ కొరియా, మెక్సికో దేశాలు దర్యానీ ఆవిష్కరణపై ఆసక్తి కనబరిచాయి.

"కానీ, సరసమైన ధరలో ఈ పరికరం లభించేలా చేయడమే మా మొదటి ప్రాధాన్యం. ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్న దేశాలన్నీ పేద దేశాలే. పరిశ్రమల్లో, భవనాల్లో, వీధుల్లో ఎక్కువగా పేదవారే పనిచేస్తుంటారు. కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగిస్తారు. వారు అధిక కాలుష్యమున్న ప్రాంతాల్లోనే జీవిస్తుంటారు. అక్కడే పని చేస్తుంటారు'' అని దర్యానీ అన్నారు.

భారత్‌లో వాయుకాలుష్యంతో మరణించే వారిలో అధిక శాతం పేదవారేనని ఇటీవలే ఒక అధ్యయనంలో వెల్లడైంది.

''తక్కువ ఆదాయ వర్గాలు ఎక్కువ వాయు కాలుష్యాన్ని ఉత్పత్తి చేయకపోయినా ఆ ప్రభావానికి బలయ్యేది మాత్రం వారే'' అని యాలే స్కూల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎనర్జీ సిస్టమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ నరసింహారావు అన్నారు.

''మురికివాడల్లో, పారిశ్రామిక ప్రాంతాల్లో, హైవేల పక్కన నివసించే వారి ఆరోగ్యాలను కాపాడాలంటే మరిన్ని అధునాతన సాంకేతికతలు అందుబాటులోకి రావాలని'' మార్కటస్ సెంటర్‌ ఎమర్జెంట్ వెంచర్స్‌కు నాయకత్వం వహిస్తోన్న ఆర్థికవేత్త శ్రుతి రాజగోపాలన్ చెప్పారు.

'ప్రాన్' స్టార్టప్‌కు ప్రారంభ దశలోనే ఎమర్జెంట్ వెంచర్స్ రెండుసార్లు నిధులను అందజేసింది. ''కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోన్న వ్యవస్థలకు పెట్టుబడులు అందించడం చాలా ముఖ్యం' అని శ్రుతి అన్నారు.

కాలుష్యం

కార్బన్ డయాక్సైడ్‌ను బంధించే మరో పరికరాన్ని కూడా దర్యానీ తయారు చేస్తున్నారు. దీనిద్వారా గాలిలో గ్రీన్ హౌస్ గ్యాస్‌లను తగ్గించాలని అనుకుంటున్నారు.

ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్‌ను సంగ్రహించే పరికరాన్ని ఈ ఏడాది చివరిలోగా తయారు చేసి, దాన్ని పార్కులు, పారిశ్రామిక ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ఆయన ఆశిస్తున్నారు.

2050 నాటికి ఉద్గారాలను పూర్తిగా తగ్గిస్తామని ప్రతిజ్ఞ చేసిన యూఎస్, యూరప్‌లకు చెందిన కస్టమర్లు ఇప్పటికే దర్యానీ ఆవిష్కరణలపై ఆసక్తి చూపుతున్నారు.

''రాబోయే తరాలు తమకు కూడా భవిష్యత్ ఉందని భావించాలి'' అని దర్యానీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Indian making floor tiles with carbon emissions from air pollution
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X