లైంగిక వేధింపులు జరగడం కామన్ ..హోం మంత్రి షాకింగ్ కామెంట్స్
ప్రతి రంగంలోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమిట్‌మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.
అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో కర్ణాటక హోం మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఇటీవల బెంగళూరులో ఓ యువతికి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఒక వ్యక్తి యువతి వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయకపోయినా బెంగళూరు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో , ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర స్పందించారు. బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో లైంగిక వేధింపులు జరగడం సర్వ సాధారణమంటూ ఆయన రియాక్ట్ అయ్యారు.పెద్ద నగరాల్లో లైంగిక వేధింపులు సాధారణంగా జరుగుతుంటాయంటూ కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మేము పోలీసులను 24 గంటలు అప్రమత్తంగా ఉండమని ఆదేశిస్తున్నాము. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.అయితే, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రజలు, ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలను సమర్థించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శిస్తున్నారు.

ఇలాంటి ఘటనలను నివారించడానికి చర్యలు తీసుకోవాల్సింది పోయి, వాటిని సాధారణీకరించడం సరికాదని అంటున్నారు. మంత్రి పరమేశ్వర వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇది చాలా సున్నితమైన విషయమని, లైంగిక వేధింపులను ఆయన తేలికగా తీసుకుంటున్నారని ఆరోపించింది. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయేలా ఆయన మాట్లాడుతున్నారని విమర్శించింది.మొత్తానికి, పరమేశ్వర చేసిన ఈ వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.












Click it and Unblock the Notifications