• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియా హిందూ దేశంగా మారుతోందా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కాషాయ జెండా

ప‌ద్నాలుగు శ‌తాబ్దాల క్రితం ఓ టీనేజీ ముస్లిం జ‌న‌ర‌ల్ సింధ్‌ను ఆక్ర‌మించాడు. క్రీస్తు శ‌కం 712లో భ‌యంక‌ర‌మైన యుద్ధం చేసి అప్ప‌టికి భార‌త దేశంలో భాగంగా ఉన్న ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కోల్పోయిన‌ భూభాగం చాలా చిన్న‌దే అయినా దాని ప‌రిణామాలు మాత్రం చాలా పెద్ద‌వి. భార‌త ఉప ఖండం చ‌రిత్ర‌లో అదొక భారీ మ‌లుపు అని చ‌రిత్రకారులు భావిస్తారు.

అత‌డు చేసిన ఈ ఆక్ర‌మ‌ణ కార‌ణంగా ఇస్లామిక్ సంస్కృతి ప్రాచీన వైదిక నాగ‌రిక‌త స‌మీపంలోకి వ‌చ్చింది. భార‌త ఉప ఖండంలో ఇస్లాం వ్యాప్తికి దారులు వేసింది.

ఆ 17 ఏళ్ల జ‌న‌ర‌ల్- మ‌హ‌మ్మ‌ద్ బిన్ కాసీంకు నిజంగా అప్పుడు తెలియ‌దు.. తాను చేసిన ఆ దాడి శ‌తాబ్దాల త‌ర‌బ‌డి ఉన్న రాజ‌కీయ‌, సామాజిక కూర్పును క‌దిలింప‌జేసింద‌ని...

అప్ప‌టి నుంచి భార‌త దేశం లౌకిక‌, ప్ర‌జాస్వామిక గ‌ణతంత్ర దేశంగా మారేందుకు ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌యాణాన్నే చేసింది.

అది ఇప్పుడు మారుతోందా?

అవ‌న్నీ బానిస‌త్వంలో మునిగిపోయిన శ‌తాబ్దాలంటూ 2014లో ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన అనంత‌రం పార్ల‌మెంటులో చేసిన ప్ర‌ప్ర‌థ‌మ ప్ర‌సంగంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ విమ‌ర్శించారు.

ఆ చ‌రిత్ర చ‌క్ర‌భ్ర‌మ‌ణాల‌ను నెమ‌రువేసుకుంటూ ఆ శ‌తాబ్దాల‌ను బానిస యుగ‌మ‌ని అభివ‌ర్ణించారు. "1200 ఏళ్ల బానిస మ‌న‌స్త‌త్వం మ‌న‌ల్ని ఇబ్బంది పెడుతోంది" అని అన్నారు.

చ‌రిత్ర‌కారులు మాత్రం ఎప్ప‌డూ ఒక‌టి చెబుతుంటారు..భార‌త దేశంలో బానిస యుగం కేవ‌లం 200 సంవ‌త్స‌రాల పాటే ఉంద‌ని, అదీ బ్రిటిష్ రాజ్ కొన‌సాగిన‌ప్పుడు మాత్ర‌మేన‌ని..

ఆర్ఎస్ఎస్ ఆధ్వ‌ర్యంలోని మొత్తం రైట్ వింగ్ ప్ర‌పంచ‌మంతా మోదీ భావాల‌తో జ‌త‌క‌ట్టింది. భార‌తీయులు 1,200 ఏళ్ల‌పాటు బానిస‌లుగా ఉన్నార‌ని న‌మ్ముతోంది. అంటే స‌హ‌జంగా ఇందులో వంద‌ల‌ ఏళ్ల పాటు కొన‌సాగిన ముస్లిం పాల‌న కూడా ఉంది.

ఇలా చెప్ప‌డం ద్వారా ముస్లిం దాడుల‌కు ముందు భార‌త దేశం ఓ హిందూ దేశ‌మ‌ని, ఎలాంటి విదేశీ ప్ర‌భావాల‌కు లోనుకానిది అన్న ఊహ‌ల‌కు ఆస్కారం క‌లిగిస్తోంది.

ఘ‌న‌మైన‌ వైదిక నేప‌థ్యంతో భర‌త వ‌ర్ష లేదంటే హిందూ దేశం ఉండేద‌ని సంఘ్ ప‌రివార్, ఇత‌ర పున‌రుద్ధ‌ర‌ణ‌వాద హిందూ సంస్థ‌లు న‌మ్ముతున్నాయి.

ప్రాచీన కాలం నుంచే హిందూ దేశం అన్న భావ‌న ఉండేద‌ని హిందుత్వ సిద్ధాంతక‌ర్త‌లు సావ‌ర్క‌ర్‌, గోల్వాల్క‌ర్‌లు భావించేవారు.

అయితే ఈ భావ‌న‌తో అమెరికాకు చెందిన హిందూ మ‌త నిపుణులు ప్రొఫెస‌ర్ వెండీ డొనిగెర్ ఏకీభ‌వించ‌డం లేదు. ప్రాచీన భార‌తం హిందూ రాష్ట్రమేన‌న్న భావ‌న స‌రికాద‌ని చెప్పారు.

ప్రొఫెస‌ర్ డొనిగెర్ బీబీసీతో మాట్లాడుతూ "ఇండియా ఎప్పుడూ హిందూ దేశం కాదు. వేద కాలంలో... వైదిక గ్రంథాల్లో పేర్కొన్న‌ పూజ‌లు కేవలం ఉప‌ఖండానికి చెందిన ఓ చిన్న ప్రాంతానికి మాత్ర‌మే ప‌రిమిత‌మై ఉండేవి. అప్ప‌టి నుంచి నిరంత‌రం చాలా మంది ప్ర‌జ‌లు, ఇత‌ర మ‌తాల (బౌద్ధ‌మ‌తం, జైన మతం, క్రైస్త‌వం, ఇస్లాం) వారే కాకుండా..హిందూ మ‌తంలోని ఇత‌ర రూపాల్లో దేవుళ్ల‌ను పూజించ‌డం ప్రారంభించారు. ' హిందూమ‌తం ' అన్న ఛ‌త్రం నీడ‌నే వీటిని కొలిచేవారు. అందువ‌ల్ల ఎంతో మంది మేధావులు హిందూమ‌తాన్ని ఏక‌మ‌తంగా ప‌రిగ‌ణించ‌రు. దేశంలోకి ప్ర‌వేశించిన భిన్న మ‌తాలు, సంస్కృతుల కార‌ణంగా.. స‌హ‌జంగానే భిన్న‌మైన‌ హిందువుల‌కు ఉన్న భిన్న‌మైన భావ‌న‌లు 'ప‌ల‌చ‌న' ఏమీ కాలేదు. నిజానికి పెరిగాయి. అందువ‌ల్ల ఆ మొత్తం వాద‌న అర్థం లేనిది " అని అన్నారు.

ప్రాచీన భార‌త‌దేశ వ్యవహారాల చ‌రిత్ర‌కారిణి సోనాలిక కౌల్ మాత్రం ప్రాచీన కాలంలో హిందూ దేశం ఉండేద‌ని చెబుతున్నారు.

అందువ‌ల్ల హిందూ దేశం అన్న భావ‌న మొద‌ట్లో ఎలా ఉండేది? ఇండియా హిందూ దేశంగా మారుతోంద‌న‌డానికి ఏవైనా సూచిక‌లు ఉన్నాయా? హిందూ రాష్ట్ర భావ‌న‌ను ప్రోత్స‌హించ‌డానికి చ‌రిత్ర‌, విద్యా రంగాల్లో ఇప్పుడు ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు? అందులో మైనారిటీల స్థానం ఏమిటి? ఇందుకు రాజ్యాంగప‌ర‌మైన స‌వ‌ర‌ణ‌లు అవ‌స‌ర‌మా? 2024 జ‌న‌ర‌ల్ ఎలక్ష‌న్ల‌లో ఇది ఎన్నిక‌ల అంశంగా ఉండ‌బోతుందా? ఇలాంటి కొన్ని ప్ర‌శ్న‌ల‌కు ఈ వ్యాసంలో స‌మాధానాలు ల‌భిస్తాయి.

హిందూ దేశ భావ‌న మొద‌ట్లో ఎలా ఉండేది?

హిందూ రాష్ట్ర పున‌రుద్ధ‌ర‌ణ‌కు ఆరెస్సెస్ చాలా కాలం నుంచి కృషి చేస్తోంది.

ప్ర‌ఖ్యాత చ‌రిత్ర కారుడు, హిందుత్వ నిపుణుడు ప్రొఫెస‌ర్ క్రిస్టోఫీ జెఫెర్‌లోట్ దీంతో ఏకీభ‌విస్తున్నారు.

" హిందూ దేశం ఏర్పాటు చేయాల‌న్న స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యం సంఘ్‌ప‌రివార్ నుంచి ఎప్పుడూ ఉంటుంది. హిందూ దేశం నిర్మాణానికి స‌మాజంలో కింది స్థాయి నుంచి ప‌రివ‌ర్త‌న తీసుకురావాలని వారు అనుకుంటుంటారు. క్షేత్ర స్థాయిలోని హిందువుల్లో హిందూ భావ‌జాలం ఉండేలా సంస్క‌రించ‌డానికి శాఖ‌లు, ఆరెస్సెస్ విభాగాలు పని చేస్తున్నాయి. 1925లోనే వారు ఈ దిశగా కృషి చేయడం మొదలుపెట్టారు. . 100 ఏళ్ల అనంత‌రం ఈ దిశ‌గా వారు చాలా సాధించారు " అని వివ‌రించారు.

హిందూ దేశం కావాల‌న్న డిమాండ్ కొత్త‌దేమీ కాద‌ని చ‌రిత్ర‌కారుడు పురుషోత్తం అగ‌ర్వాల్ కూడా అభిప్రాయ‌ప‌డ్డారు.

"సంఘ్ (ఆరెస్సెస్‌)ను 1925లో నెల‌కొల్పారు. దాదాపు అదే స‌మ‌యంలో హిందుత్వ సిద్ధాంత‌క‌ర్త వి.డి.సావ‌ర్క‌ర్ 'హిందుత్వ‌: హూ ఈజ్ హిందూ' అన్న‌ పుస్త‌కాన్ని రాశారు. దాంట్లో ఈ భావ‌న‌ను పొందుప‌రిచారు. సావ‌ర్క‌ర్ ఈ పుస్త‌కంలో హిందుత్వ భావ‌జాలానికి సైద్ధాంతిక స్వ‌రూపాన్ని క‌ల్పించారు" అని తెలిపారు. ఆ భావ‌జాల‌మే ఇప్పుడు ఇండియాలో అధికారంలో ఉంది.

సావ‌ర్క‌ర్ ప్ర‌కారం హిందుత్వ అన్న‌ది హిందూ మ‌తం క‌న్నా అధిక‌మైన భావ‌న‌లు క‌లిగిన‌ది. రాజ‌కీయ సిద్ధాంతంగా అది కేవ‌లం హిందూ విశ్వాసాల‌కే ప‌రిమితం కాలేదు. ఆయ‌న మూడు మంత్రాలు ఇచ్చారు. అవి హిందుత్వ‌కు అత్యంత అవ‌శ్య‌మైన‌వి.

అవి రాష్ట్ర (దేశం), జాతి, సంస్కృతి.

హిందుత్వ సిద్ధాంత‌క‌ర్త వి.డి.సావ‌ర్క‌ర్

ఆయ‌న అభిప్రాయం ప్ర‌కారం భార‌త దేశంలో జన్మించిన‌ప్ప‌టికీ ముస్లింలు, క్రైస్త‌వులు ఈ మూడు లక్ష‌ణాలను క‌లిగి ఉన్నామ‌ని చెప్పుకోలేరు.

అందువ‌ల్ల పురాత‌న కాలం నుంచి ఉంటూ వ‌స్తున్న ఈ దేశాన్ని హిందువులే ఏర్పాటు చేశారని న‌మ్మారు. అందుకు అనుగుణంగా హిందూ దేశానికి నిర్వ‌చ‌నం ఇచ్చారు.

హిందూ దేశం కావాలంటూ శ‌క్తిమంతులైన మ‌త నాయ‌కులు, హిందూత్వ సంస్థ‌లు డిమాండు చేయ‌డం ఎప్ప‌టి నుంచో ఉంటున్న‌దే. అది ముఖ్యంగా మోదీ పాల‌న‌లో మ‌రింత తీవ్ర‌మ‌యింది.

ఉదాహ‌ర‌ణ‌కు దిల్లీలోని తల్క‌తోరా స్టేడియంలో ఈ ఏడాది మొద‌ట్లో జ‌రిగిన ఓ స‌మావేశంలో పూరీ శంక‌రాచార్య స్వామీ నిశ్చ‌లానంద స‌ర‌స్వ‌తి మాట్లాడుతూ ఇండియాను హిందూ దేశంగా ప్ర‌క‌టించాల‌ని డిమాండు చేశారు. ఇండియాను హిందూ దేశంగా ప్ర‌క‌టిస్తే ప్ర‌పంచంలోని మ‌రో 15 దేశాలు ఆదే మార్గాన్ని అనుస‌రిస్తాయ‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం ఇండియా, నేపాల్‌... ఈ రెండు మాత్ర‌మే స్ప‌ష్టంగా హిందువుల మెజార్టీ ఉన్న దేశాలు.

ప్రొఫెస‌ర్ జెఫెర్‌లోట్ మాట్లాడుతూ " కొంత మార్పు క‌నిపిస్తోంది. అయితే (హిందూ రాష్ట్ర ప్ర‌క‌ట‌న‌) భావన అంతటా లేదు. కానీ క‌చ్చితంగా ప్ర‌చారాల సంఖ్య పెరిగింది. వాటి తీవ్ర‌త కూడా పెరిగింది. వాటి భౌగోళిక ప‌రిధి విస్త‌రించింది" అని చెప్పారు.

హిందూ దేశం అన్న‌ మాట‌ భ‌విష్య‌త్తులో కొన్నేళ్ల త‌రువాత వ‌స్తుందేమో. అయితే ఇందుకోసం కొంత క‌స‌ర‌త్తు జ‌రుగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

విశ్లేష‌కుల అభిప్రాయం ప్ర‌కారం స‌మాఖ్య వ్య‌వ‌స్థ‌, లౌకిక వాదం, సామాజిక‌-ఆర్థిక స‌మాన‌త్వం అన్న భావ‌న‌ల‌ను తొల‌గించేలా వ్య‌వ‌స్థ‌ల‌ను త‌యారు చేస్తున్నారు.

ముస్లిం చ‌రిత్రను మిన‌హాయిస్తూ, న‌గ‌రాలు, వీధుల‌కు ముస్లిం పేర్లు లేకుండా చేస్తూ పాఠాల‌ను తిరిగి రాసేలా విద్యా సంస్థ‌ల‌ను త‌యారు చేస్తున్నారు.

ప్ర‌తిప‌క్ష నేత‌, దేశంలో ప్ర‌ముఖ న్యాయ‌వాది అయిన క‌పిల్ సిబ‌ల్ మాట్లాడుతూ దేశంలోని ప్ర‌ముఖ సంస్థ‌ల‌ను గుప్పిట పెట్ట‌కున్నార‌ని విచారం వ్య‌క్తం చేశారు. "వారు (మోదీ ప్ర‌భుత్వం) న్యాయ వ్య‌వ‌స్థ‌ను త‌ప్ప అన్ని సంస్థ‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. మీడియాను మాయ‌ చేస్తున్నారు. పార్ల‌మెంటును స్వాధీనం చేసుకున్నారు. స్వ‌త్రంత్ర గొంతుల‌ను అణ‌చివేస్తున్నారు. ప్ర‌భుత్వ యంత్రాంగాలు (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌, సీబీఐ, ఆదాయ‌పు ప‌న్ను విభాగం)ల‌ను చెప్పుచేత‌ల్లో పెట్టుకున్నారు " అని ఆరోపించారు.

అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను బీజేపీ, కేంద్ర ప్ర‌భుత్వాలు ఖండిస్తున్నాయి. ఇండియాలో ప్ర‌జాస్వామ్యం వ‌ర్ధిల్లుతోంద‌ని చెబుతున్నాయి. ముఖ్యంగా మోదీ నాయ‌క‌త్వంలో గ‌త ఏడాది చాలా విశేషంగా అభివృద్ధి చెందింద‌ని అంటున్నాయి.

భార‌త్ హిందూ దేశంగా మారుతోందా? సంకేతాలు ఏమిటి?

గ‌త ఏడాది డిసెంబ‌రులో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ' హ‌ర హ‌ర మ‌హాదేవ్‌' నినాదాల న‌డుమ కాశీ విశ్వ‌నాథ్ ధామ్‌ను ఆవిష్క‌రించారు. కాషాయ దుస్తులు ధ‌రించి సాధువు మాదిరిగా శీత‌ల గంగా జ‌లాల్లో మునిగారు. కాల భైర‌వ మందిరంలో పూజ‌లు చేశారు.

ప్రేమ చూపి, ఆశీర్వాదాలు ఇచ్చినందుకు ప‌విత్ర గంగా న‌దికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు.

ఆయ‌న ఆ స‌మ‌యంలో "ఔరంగ‌జేబు ఎప్పుడు ఉంటాడో శివాజీ కూడా అప్పుడే ఉంటాడు" అని కూడా అన్నారు.

ఆయ‌న అన్న ఈ మాట‌లు లౌకిక దేశ నాయ‌కునిగా క‌న్నా హిందూత్వ ప్ర‌ధాని నుంచి వ‌చ్చిన‌వేనన్న స్ప‌ష్ట‌మైన‌ సందేశాన్ని పంపించాయ‌ని ఆ సంద‌ర్భంగా కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు వ్యాఖ్యానించారు.

కాల‌మిస్ట్ వీర్ సంఘ్వి ఆ స‌మావేశంపై వ్యాసం రాస్తూ " మోదీ మాదిరిగా ఏ ఇత‌ర ప్ర‌ధానీ అలాంటి ప్రార్థ‌నల‌ను ప్ర‌జ‌ల ఆక‌ర్ష‌ణ కోసం ఉద్దేశించిన భారీ శాటిలైట్ టీవీ కార్య‌క్ర‌మంగా మార్చ‌లేదు" అని వ్యాఖ్యానించారు.

భార‌త రాజ్యాంగం కులం, మ‌తం, జెండ‌ర్ ఆధారంగా ఎలాంటి వివ‌క్ష ఉండ‌ద‌ని హామీ ఇస్తోంది. అయితే పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం (సిటిజ‌న్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్‌-సీఏఏ)ను ముస్లింల‌కు వ్య‌తిరేక‌మైన‌దాన్నిగానే చూస్తున్నారు.

ఈ చ‌ట్టం ప్ర‌కారం కొన్ని పొరుగు దేశాల నుంచి వ‌ల‌స వ‌చ్చే వారు హిందువులు, సిక్కులు, బౌద్ధులు అయితేనే పౌర‌స‌త్వం మంజూరు చేస్తారు. వారు ముస్లింలు అయితే ఎలాంటి పౌర‌స‌త్వాన్ని ఇవ్వ‌రు.

అయితే ఈ చ‌ట్టం భార‌తీయుల‌పై ఎలాంటి ప్ర‌భావం చూప‌ద‌ని బీజేపీ ప్ర‌భుత్వం వాదిస్తోంది.

కానీ వివిధ పార్టీల నాయ‌కులు దీనిపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇది ముస్లింల ప‌ట్ల వివ‌క్ష చూపేదిగా ఉంద‌ని విమ‌ర్శ‌లు చేశారు.

ఇది హిందూ దేశం ఏర్పాటు దిశ‌గా వేసిన పెద్ద అడుగు అన్నారు డీఎంకే ఎంపీ క‌నిమొళి.

ఎన్ఆర్‌సీ ప్ర‌కారం అస్సాంలో 19 లక్షల మంది ముస్లింల‌ను నాన్‌-ఇండియ‌న్స్‌గా ప్ర‌క‌టించారు. సీసీఏ ప్ర‌కారం వారికి పౌర‌స‌త్వం మంజూరు చేసే అవ‌కాశం లేదు. ఎందుకంటే మ‌త‌మే అడ్డంకి. పౌర‌స‌త్వం కోసం ద‌ర‌ఖాస్తు చేయాలంటే వారికున్న ఏకైక ప్ర‌త్యామ్నాయం హిందూ/సిక్/ జైన్ మ‌తంలోకి మార‌డ‌మే. ఇందుకు వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు జ‌రిగాయి.

కాంగ్రెస్ పాల‌న‌లో ముస్లిం బుజ్జ‌గింపు విధానాలు ఉన్నాయంటూ వాటికి వ్య‌తిరేకంగా 30 ఏళ్ల క్రిత‌మే బీజేపీ నాయ‌కుడు ఎల్‌.కె.అద్వానీ ప్ర‌చారాన్ని ప్రారంభించారు.

ముస్లిం బుజ్జ‌గింపు విధానాల‌కు షాబోనో మ‌నోవ‌ర్తి కేసును త‌ర‌చూ ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తుంటారు. 1986లో షాబానోకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

ఇది ష‌రియా చ‌ట్టాల‌కు విరుద్దంగా ఉందంటూ ముస్లిం మ‌త పెద్ద‌లు భావించారు. దాంతో వారి మెప్పు కోసం అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టు తీర్పును ప‌ల‌చ‌న చేసేలా కొత్త చ‌ట్టాన్ని తీసుకొచ్చింది.

ఇలాంటి బుజ్జ‌గింపు చ‌ర్య‌లే త‌ద‌నంత‌ర కాలంలో భారీ స్థాయి హిందూ ప్ర‌తిక్రియ చ‌ర్య‌లకు దారితీశాయ‌ని మేధావులు, ర‌చ‌యిత‌లు అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇది ఎల్‌.కె.అద్వానీ రామ జ‌న్మ‌భూమి ఉద్య‌మాన్ని చేపట్టడానికి దారి తీసింది. చివ‌ర‌కు అయోధ్య‌లోని బాబ్రీ మ‌సీదును ధ్వంసం చేయ‌డం వ‌రకు వెళ్లింది.

బాబ్రీ మ‌సీదు

దీనిపై చ‌రిత్రకారుడు పురుషోత్తం అగ‌ర్వాల్ మాట్లాడుతూ "ముస్లిం ఓటు బ్యాంకు మాదిరిగానే హిందూ ఓటు బ్యాంకు ఏర్పాటుకు హిందుత్వ శ‌క్తులు ప్ర‌య‌త్నించాయి. ఇది వారి రాజ‌కీయ ల‌క్ష్యం. దాన్ని సాధించాయి. హిందూ ఓటు బ్యాంకును వ్య‌తిరేకించే ధైర్యం ఇప్పుడు ఎవ‌రికీ లేదు" అని అన్నారు.

బీజేపీ అధికారంలోకి వ‌చ్చినప్పటి నుంచి ముస్లిం పేర్ల‌ను మార్చే కార్య‌క్ర‌మం ఆరంభ‌మ‌యింది. చాలా న‌గ‌రాలు, వీధుల పేర్లు మార్చారు. దిల్లీలోని ఔర‌గ‌జేబ్ రోడ్డు పేరు మార్చిన‌ట్టే అక్బ‌ర్ రోడ్‌, షాజ‌హాన్ రోడ్‌ల పేర్లు కూడా మార్చాల‌న్న డిమాండ్లు ఉన్నాయి.

ఈ డిమాండ్లు హిందుత్వ శ‌క్తుల ద్వంద్వ వైఖ‌రికి నిద‌ర్శ‌న‌మ‌ని ప్రొఫెస‌ర్ పురుషోత్తం అగ‌ర్వాల్ అన్నారు. "వారికి అక్బ‌ర్ రోడ్‌తోనో, షాజహాన్ రోడ్‌తోనే పెద్ద స‌మ‌స్య ఉన్న‌ట్టుంది. కానీ ఢిల్లీలో మాన్‌సింగ్ రోడ్ ఉంది. ఆయ‌న ఎవ‌రు? ఆయ‌న అక్బ‌ర్ సైన్యాధిప‌తి. ఢిల్లీలో తోడ‌ర్‌మ‌ల్ రోడ్‌, బీర్‌బ‌ల్ రోడ్‌లు కూడా ఉన్నాయి. తోడ‌ర్‌మ‌ల్ అక్బ‌ర్ ఆర్థిక మంత్రి. బీర్‌బ‌ల్ అక్బ‌ర్ కొలువులోని న‌వ‌ర‌త్నాల్లో ఒక‌రు. అక్బ‌ర్‌ను చెడుగా చూపించాల‌ని అనుకుంటారు. కానీ బీర్‌బ‌ల్‌, తోడ‌ర్‌మ‌ల్‌, మాన్‌సింగ్‌ల‌ను మాత్రం కాదు. ఎందుకు? " అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

హిందూ రాష్ట్ర భావ‌న‌ను క‌లిగి ఉండాలంటూ గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా వివిధ హిందుత్వ సంఘాల శ్రేణులు ప్ర‌జ‌ల్ని ప్రోత్స‌హిస్తున్నాయ‌ని ప్రొఫెస‌ర్ అగ‌ర్వాల్ అన్నారు. ప‌దేళ్ల కిందటి ప‌రిస్థితుల‌తో పోల్చి చూస్తే ఈ భావ‌న‌కు సామాన్య హిందువుల్లో ఆమోదం ల‌భిస్తోంద‌ని చెప్పారు.

ఈ అభిప్రాయంతో జాతీయ స్థాయి హిందుత్వ సంస్థ జ‌న జాగృతి స‌మితి (హెచ్‌జేఎస్‌) ఏకీభ‌విస్తోంది. హిందూ దేశం కోసం స‌మావేశాలు, అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను అది నిర్వ‌హిస్తోంది. హిందూ రాష్ట్ర డిమాండుపై ఒత్తిడి తీసుకురావ‌డానికి స‌మ‌యం ఆస‌న్న‌మ‌యింద‌ని అది చెబుతోంది.

ఇటీవల మ‌హారాష్ట్రలో జ‌రిగిన స‌మావేశంలో ఆ సంస్థ ఆధ్యాత్మిక విభాగమైన‌ స‌నాత‌న్ సంస్థ అధికార ప్ర‌తినిధి అభ‌య్ వార్త‌క్ మాట్లాడుతూ "ఇండియాను హిందూ దేశంగా మార్చేందుకు హిందువులు త్యాగాలు చేయ‌క‌పోతే వారి అస్థిత్వానికే ముప్పు వ‌స్తుంద‌ని అన్నారు.

హిందూ జ‌న‌జాగృతి స‌మితి జాతీయ అధికార ప్ర‌తినిధి ర‌మేష్ శిందే బీబీసీతో మాట్లాడుతూ "మాలాంటి సంస్థ‌ల ప‌ని ఏమిటంటే దేశ ప్ర‌జ‌ల్లో హిందూ రాష్ట్ర సందేశాన్ని వ్యాపింప‌జేయ‌డ‌మే" అని చెప్పారు.

"నిర్మాణ ప‌రంగా చూస్తే ఇండియా ఇప్ప‌టికే హిందూ దేశంగా మారిన‌ట్టే" అని త‌న తాజా పుస్త‌కం హిందూ నేష‌న్‌లో ర‌చ‌యిత ఆకార్ ప‌టేల్ వాదించారు.

2019 ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించిన‌ ద‌గ్గర నుంచి హిందూ రాష్ట్ర ల‌క్ష‌ణాలు మ‌రింత స్ఫ‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని ప్రొఫెస‌ర్ జెఫెర్‌లోట్ చెప్పారు. "మొద‌టిది, 2019 త‌రువాత అన్నీ మ‌రింత విప్ల‌వాత్మ‌కంగా జ‌రుగుతున్నాయి. కొత్త చ‌ట్టాలు, రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌లు త‌దిత‌రాల‌న్నీ.. కొంత‌వ‌ర‌కు ఇది మ‌లుపులాంటిదే"

రెండోది, నిజమైన స‌మ‌స్య‌ల నుంచి ప్ర‌జ‌ల దృష్టిని కొద్దిగా మ‌ళ్లించాల్సిన అవ‌స‌రం కొంత‌వ‌ర‌కు వ‌చ్చింది. వాస్త‌వ స‌మ‌స్య‌లు చాలా ఒత్తిడి క‌లిగిస్తున్నాయి. ఉద్యోగాలు లేక‌పోవ‌డం, ధ‌ర‌ల పెరుగుద‌ల ఇర‌త్రా స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఈ స‌మ‌స్య‌ల నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించ‌డానికే అస్థిత్వ రాజ‌కీయాల‌ను ముమ్మ‌రం చేశార‌ని మీరు అన్వ‌యించ‌వ‌చ్చు.

"ఇది నిరంతర వ్యూహంగా ఉంది. దీంతోపాటుగా ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు విభ‌జ‌న రాజ‌కీయాలు అమ‌లు చేయ‌డం ఎలాగూ ఉంది" అని అభిప్రాయ‌ప‌డ్డారు.

హిందూ దేశం కోసం చ‌రిత్ర‌, పుస్త‌కాల తిరిగి రాత‌

పాఠ‌శాల‌లు, విశ్వ విద్యాల‌యాల చ‌రిత్ర పుస్త‌కాల‌పై మొద‌టి నుంచీ హిందూ రైట్ వింగ్ సంస్థ‌లు ఓ ఫిర్యాదు చేస్తున్నాయి. వీటిని ఎల్ల‌ప్పుడూ వామ‌ప‌క్ష, మార్కిస్టు చ‌రిత్రకారులే రాస్తున్నార‌ని, వారు జాతీయ‌వాద హిందువుల‌ను వ్య‌తిరేకిస్తూ పాక్షిక దృష్టితోనే చూస్తుంటార‌ని విమ‌ర్శిస్తుంటాయి. అందువ‌ల్ల త‌మ దృక్కోణానికి కూడా చోటు క‌ల్పించాల‌ని వాదిస్తుంటాయి.

రైట్ వింగ్ చ‌రిత్ర‌కారులు చేసే ఈ వ్యాఖ్యానం వ్య‌ర్థ‌మైన‌దంటూ వామ‌ప‌క్ష చ‌రిత్ర‌కారులు తిర‌స్క‌రిస్తుంటారు. వారివి 'అంధ విశ్వాసాల‌'ని కొట్టిపారేస్తుంటారు. వాటినే చ‌రిత్ర‌గా ప్ర‌చారం చేస్తుంటార‌ని విమ‌ర్శిస్తుంటారు.

నూత‌న విద్యావిధానం తీసుకురావ‌డానికి మోదీ ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌య‌త్నాలు ప్ర‌స్తుతం కొన‌సాగుతున్నాయి. భార‌త దేశ విద్యా వ్య‌వ‌స్థ‌లో అవ‌స‌ర‌మైన మార్పులు తీసుకొచ్చే విష‌య‌మై ప‌ర్య‌వేక్షించ‌డానికి ఓ క‌మిటీ ఏర్పాట‌యింది.

ఈ క‌మిటీలో స‌భ్యునిగా ఉన్న గోవింద్ ప్ర‌సాద్ శ‌ర్మ గ‌త ఏడాది ఓ ఆంగ్ల దిన ప‌త్రిక‌తో మాట్లాడుతూ "ప్ర‌స్తుతం బోధిస్తున్న చ‌రిత్ర అంతా మ‌నం ఇక్క‌డ ఓడిపోయాం. మ‌నం అక్క‌డ ఓడిపోయాం అని చెబుతుంది. విదేశీ దురాక్రమణదారులకు వ్య‌తిరేకంగా మ‌న సంఘ‌ర్ష‌ణ‌లు, వీరోచిత పోరాటాల గురించి చ‌ర్చించాల్సి ఉంది. మ‌నం వాటిని త‌గినంత ప్రాముఖ్యంగా ప్ర‌స్తావించ‌లేదు" అని అన్నారు. వేద గ‌ణితాన్ని కూడా ఒక అంశంగా బోధించాల్సి ఉంటుంద‌ని శ‌ర్మ తెలిపారు.

కాంటెంప‌ర‌రీ ఇండియ‌న్ హిస్ట‌రీ విభాగం ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్న డాక్ట‌ర్ ఆదిత్య ముఖ‌ర్జీ 'ఆరెస్సెస్‌, స్కూల్ టెక్ట్స్‌ బుక్స్ అండ్ ద మ‌ర్డ‌ర్ ఆఫ్ మ‌హాత్మా గాంధీ' అన్న పుస్త‌కానికి స‌హ ర‌చ‌యిత‌ కూడా. ఆయ‌న ఒక‌సారి దేశంలోని మీడియాతో మాట్లాడుతూ చ‌రిత్ర స్థానంలో అంధ‌విశ్వాసాలు వ‌స్తున్నాయ‌ని, ఇదే నిజ‌మైన ప్ర‌మాద‌మ‌ని అన్నారు.

"గ‌ణేశుడు, క‌ర్ణుని జ‌న‌నానికి ప్లాస్టిక్ సర్జరీ, జెనిటిక్ సైన్స్ కార‌ణాల‌ని ప్ర‌ధాన మంత్రి చెబుతుంటే ఆయ‌న‌తో ఏ డాక్ట‌రైనా వాదించగ‌ల‌డా? చ‌రిత్ర అంటే ఇది కాదు" అని చెప్పారు.

విద్య.. రాష్ట్రాలు, కేంద్రం రెండింటి ప‌రిధిలో ఉన్న అంశం. అయితే జాతీయ‌త కోణంలోనే చ‌రిత్ర పుస్త‌కాలు రాయాల్సి ఉంటుంద‌ని విద్యా బోర్డులు, క‌మిటీలు చెబుతున్నాయి.

బీజేపీ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో పాఠ‌శాల‌ల పాఠ్య పుస్త‌కాల్లో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

కొన్ని నెల‌ల క్రితం పాఠ్య పుస్త‌కాల్లో చేసిన మార్పుల కార‌ణంగా నెల‌కొన్న వివాదం క‌ర్ణాట‌క‌లోని బీజేపీ ప్ర‌భుత్వాన్ని కుదిపేసింది.

ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుడు క‌పిల్ సిబ‌ల్ బీబీసీ హిందీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూపాఠ‌శాల పాఠ్య పుస్త‌కాల స‌మీక్ష సంఘం చీఫ్ చ‌క్ర‌తీర్థ‌పై విమ‌ర్శ‌లు చేశారు.

పాఠ్య పుస్త‌కాల‌ను 'కాషాయీక‌ర‌ణ' చేస్తున్నార‌ని ఆరోపించారు. ఆరెస్సెస్ సిద్ధాంత‌క‌ర్త హెగ్డెవార్ ప్ర‌సంగాన్ని పొందుప‌ర‌చ‌డం; ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు, సంఘ సంస్క‌ర్త‌లు, పేరుపొందిన సాహితీ వేత్త‌ల ర‌చ‌న‌ల‌ను తొల‌గించ‌డం వంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు.

కేంద్ర ప్ర‌భుత్వ స్థాయిలో పాఠ్య‌పుస్త‌కాల్లో భారీగా మార్పులు చేయ‌డం ద‌శాబ్దాల్లో ఒక్క‌సారి మాత్ర‌మే సాధ్య‌ప‌డుతుంది.

పుస్త‌కాల్లో మార్పుల విష‌య‌మై ఎన్‌సీఈఆర్‌టీ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సిఫార్సు చేయ‌వ‌చ్చు. వీటిని అవి ఆమోదించ‌వ‌చ్చు. లేదంటే తిర‌స్క‌రించ‌వ‌చ్చు.

ఆ విష‌యాల‌న్నింటినీ చెప్పిన అనంత‌రం 2019లో 9, 10 త‌ర‌గ‌తుల పాఠ్య పుస్త‌కాల్లో మార్పులు చేశారు.

ముస్లింలు

హిందూ రాష్ట్రలో ముస్లింలు, ఇత‌ర మైనార్టీల‌కు ఉన్న హ‌క్కులేమిటి?

ముస్లింలు, క్రైస్త‌వులు త‌మ ప్రార్థ‌నా స్థ‌లాల‌ను నిర్మించుకొని ఆరాధ‌న‌లు చేసుకోవ‌చ్చా? త‌మ మ‌త‌విశ్వాసాల‌ను బోధించి ఆచ‌రించ‌వ‌చ్చా?

హిందూ రాష్ట్రలో మైనార్టీలైన ముస్లింలు, క్రైస్త‌వులు ఇక ఎంత మాత్రం మైనార్టీలుగా ఉండ‌బోర‌ని సంఘ్ ప‌రివార్ నాయ‌కులు ఎల్లప్పుడూ చెబుతూ ఉంటారు.

దిల్లీలో రెండేళ్ల క్రితం అల్ల‌ర్లు రెచ్చ‌గొట్టార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న దిల్లీ బీజేపీ నాయ‌కుడు క‌పిల్ మిశ్ర ప్ర‌స్తుతం 'హిందూ ఎకోసిస్టం ' పేరుతో ఆన్‌లైన్ నెట్‌వ‌ర్క్ న‌డుపుతున్నారు. ఇది బాధితులైన హిందువుల కోసం ప‌నిచేస్తున్న‌ట్టు ఆయ‌న చెబుతున్నారు.

ఆయ‌న చెప్పినదాని ప్ర‌కారం హిందూ రాష్ట్రలో మైనార్టీలంటూ ఎవ‌రూ ఉండ‌రు. "ముస్లింలు (హిందువుల త‌రువాత‌) రెండో మెజార్టీగా ఉంటారు" అని చెప్పారు.

హిందూ మెజార్టీ పాల‌న‌లో మైనార్టీలు సుర‌క్షితంగా ఉంటార‌ని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు. వారు వారి మ‌తాన్ని ఆచ‌రించుకోవ‌చ్చు అని తెలిపారు. "ఇండియా లౌకిక రాజ్యంగా ఉంటుంది. హిందూ మెజార్టీ పాల‌న‌లో ఉన్నంత‌కాలం మ‌త సామ‌ర‌స్యం అమ‌ల‌వుతుంది" అని వివ‌రించారు.

బ‌ల‌ప్ర‌యోగం ద్వారానో, ఉద్యోగాలు, సొమ్ము ఆశ చూప‌డం ద్వారానో ముస్లింలు, క్రైస్త‌వులు త‌మ మ‌తాన్ని ప్ర‌చారం చేసుకుంటామంటే అనుమ‌తించ‌బోర‌ని క్షేత్ర స్థాయి నాయ‌కులు వాదిస్తుంటారు.

నిజానికి క‌నీసం తొమ్మిది రాష్ట్రాలు మ‌త మార్పిడి వ్య‌తిరేక చ‌ట్టాలు తీసుకొచ్చాయి.

ధ‌నం, ఉద్యోగాలతో ప్ర‌లోభ‌ పెట్టి మ‌త మార్పిడి చేయ‌డం చ‌ట్ట‌వ్య‌తిరేక‌మ‌ని ప్ర‌క‌టించాయి.

ఎవ‌రి పూర్వీకులైతే ఇత‌ర ప్రాంతాల నుంచి భ‌ర‌త వ‌ర్షానికి వ‌చ్చారో అలాంటి వారికి సావ‌ర్క‌ర్ చెప్పిన హిందుత్వ భావ‌న‌లో చోటు లేదు.

అంటే దాదాపుగా ఈ భావ‌న నుంచి ముస్లింలు, క్రైస్త‌వుల‌ను మిన‌హాయించారు. ఈ రెండూ దేశంలోని ప్ర‌ధాన మైనార్టీలు.

సావ‌ర్క‌ర్ ప్ర‌తిపాదించిన హిందూ రాష్ట్రలో మైనార్టీల స్థాన‌మేమిట‌న్న‌దానిపై స్ప‌ష్టంగా చెప్ప‌లేదు. మ‌హా అయితే వారు ఒక‌ర‌క‌మైన ద్వితీయ శ్రేణి పౌర‌స‌త్వంపై ఆశ‌లు పెట్టుకోవ‌చ్చు. దీని ప్ర‌కారం మ‌రీ ఎక్కువ హ‌క్కుల కోసం ఆశించ‌కుండా ఉండొచ్చు.

అయితే ఇటీవ‌ల కాలంలో ఆరెస్సెస్ నాయ‌కులు ముస్లింలు, ఇత‌ర మైనార్టీల‌ను న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నాలు చేస్తూ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని భ‌రోసా ఇస్తున్నారు.

ఆరెస్సెస్ అధినేత మోహ‌న్ భ‌గ‌వ‌త్ త‌ర‌చూ ఓ మాట చెబుతుంటారు..హిందువులు, ముస్లింల‌కు ఉమ్మ‌డి వార‌స‌త్వం ఉంద‌ని, అందువ‌ల్ల ఇండియ‌న్స్ అంతా హిందువులేన‌ని అంటుంటారు.

ముస్లింల పూర్వీకులంతా హిందువులేన‌ని, బ‌ల‌వంతంగా మ‌త మార్పిడి చేయించార‌ని ఆ సంస్థ చెబుతోంది.

ముస్లింలు, క్రైస్త‌వుల‌కు చేరువ కావ‌డానికి ఆ సంస్థ వ‌ద్ద విశేష‌మైన కార్య‌క్ర‌మాలు ఉన్నాయి.

ముస్లింల‌కు చేరువ కావాలంటూ ఆరెస్సెస్‌లో ప్ర‌తిపాద‌న చేసిన వారి పేరు ఇంద్రేష్ కుమార్‌. ఆయ‌న‌ను సంప్ర‌దించ‌డానికి బీబీసీ ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ ఫ‌లించ‌లేదు.

మ‌రోవైపు హిందూ మెజార్టీ పాల‌న‌లో త‌మ‌ను వెలివాడ‌ల‌కు ప‌రిమితం చేసి, ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తారోమోన‌ని ముస్లింలు భ‌య‌ప‌డుతున్నారు. రాజ‌కీయ‌ప‌రంగా వెలివేత‌కు, ఎన్నిక‌ల్లో జాతి వివ‌క్ష‌కు గుర‌వుతామేమోన‌ని సందేహిస్తున్నారు.

హిందుత్వ నాయ‌కులు అప్పుడ‌ప్పుడూ చేసే తీవ్ర‌మైన విమ‌ర్శ‌ల కార‌ణంగా వారిలో ఆ భ‌యాలు క‌లుగుతున్నాయి.

బుల్ డోజర్

ఆరెస్సెస్‌లో క్రియాశీల స‌భ్యుడైన ఫైర్ బ్రాండ్ బీజేపీ నాయ‌కుడు విన‌య్ క‌టియార్ ఒక‌సారి మాట్లాడుతూ "దేశంలో ముస్లింలు ఉండ‌కూడ‌దు. జ‌నాభా ప్రాతిప‌దిక‌న వారు దేశాన్ని ఒక‌సారి విభ‌జించారు. అందువ‌ల్ల వారెందుకు ఇక్క‌డ ఉండాలి? ముస్లింల‌కు వారి వాటా వారికి ఇచ్చారు. వారు బంగ్లాదేశ్‌కో, పాకిస్తాన్‌‌కో వెళ్లిపోవాలి. భార‌త‌దేశంలో ఉండాల్సిన ప‌ని వారికి లేదు" అని అన్నారు.

క్షేత్ర స్థాయి వాస్త‌వం ఏమిటంటే..ముస్లింల‌తో క‌లిసి కూర్చొని మాట్లాడుతుంటే..హిందూ రాష్ట్రలో జీవించాల్సిన త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌స్తుందేమోన‌న్న‌ భావ‌న వారిలో క‌నిపిస్తుంది.

వారు 15వ శ‌తాబ్ద‌పు స్పెయిన్ చ‌రిత్ర‌ను గుర్తు చేస్తారు. స్పెయిన్‌ను ముస్లింలు 800 సంవ‌త్స‌రాల పాటు పాలించారు. క్యాథ‌లిక్ సైన్యం దాన్ని స్వాధీనం చేసుకున్న‌ప్పుడు ముస్లింల‌కు రెండు ఆప్ష‌న్లు ఇచ్చింది. దేశాన్ని విడిచిపెట్ట‌డ‌మో, క్రైస్త‌వ మ‌తాన్ని స్వీక‌రించ‌డ‌మో చేయాల‌ని స్ప‌ష్టం చేసింది. మ‌తం మార్పిడికి నిరాక‌రించిన వారిని పూర్తిగా నిర్మూలించింది.

భార‌త దేశంలో ముస్లింల‌ను స‌మూలంగా నిర్మూలించ‌డం సాధ్యం కాద‌ని ప్రొఫెస‌ర్ జెఫెర్‌లోట్ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం 'ఘ‌ర్ వాప‌సీ' (పాత మ‌తంలో తిరిగి చేర‌డం) న‌డుస్తున్నా అది వీలుప‌డ‌ద‌ని అన్నారు.

"ముస్లింల‌ను పూర్తిగా నిర్మూలించాల‌న్న‌ది ప్ర‌త్య‌క్షంగా ఎవ‌రి అజెండాలోనూ లేదు. ఇది ప్రాక్టిక‌ల్‌గా సాధ్య‌మ‌వుతుంద‌ని కూడా ఎవ‌రూ భావించ‌లేరు. ప్రాక్టిక‌ల్‌గా ఉండే ల‌క్ష్యం ఏమిటంటే ఒక‌టి.. వారిని మ‌త‌మార్పిడి చేసి ముస్లింలు అన్న‌వారు క‌నిపించ‌కుండా చేయ‌డం..లేదంటే వారిని వెలివాడ‌లకే ప‌రిమితం చేయ‌డం. ఇప్ప‌టికే కొన్ని న‌గ‌రాల్లో వెలివాడ‌లు లాంటివి ఏర్పాట‌వుతున్నాయి" అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

ఆ ఫ్రెంచ్ ప్రొఫెస‌ర్ త‌న వాద‌న కొన‌సాగిస్తూ ప్ర‌జా జీవితంలో ముస్లింలు ముస్లింలా, క్రిస్టియ‌న్లు క్రిస్టియ‌న్లుగా కొన‌సాగాలంటే కొంత రిస్కు తీసుకోవాల్సి ఉంటుంద‌ని చెప్పారు.

"అంటే వారు భ‌య‌ప‌డాల్సింది ఏమీ లేదు; అన్నీ వ‌దులుకుంటే... ముస్లింలుగా మీ గుర్తింపును వ‌దులుకోండి. ప్ర‌జాజీవితంలో ముస్లింలుగా మీ ప్ర‌వ‌ర్త‌నను విడిచిపెట్టండి. వారు త‌ప్ప‌నిస‌రిగా సెకండ్ క్లాస్ సిటిజ‌న్స్‌గానే బ‌త‌కాల్సి ఉంటుంది. వారు హిందువుల‌తో విద్య‌, ఉద్యోగ రంగాల్లో పోటీ ప‌డ‌లేరు" అని అభిప్రాయ‌ప‌డ్డారు.

ప్రొఫెస‌ర్ జెఫెర్‌లోట్ ఇంకా త‌న అభిప్రాయాలు చెబుతూ " హిందూ దేశాన్ని ఏర్పాటు చేస్తున్నార‌ని అంటే మీరు మైనార్టీల‌ను వాస్త‌వ ద్వితీయ శ్రేణి పౌరులు-డిఫాక్టో సెకండ్ క్లాస్ సిటిజెన్స్‌-గా చేయ‌డ‌మేన‌ని భావించ‌వ‌చ్చు. అలాంట‌ప్ప‌డు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప్ర‌చారాల‌కు ఎంతో అర్థం ఉంది. ఎందుకంటే మీరు వారిని చాలా దుర్బ‌ల‌మైన వ్యక్తులుగా చేస్తారు. వెలివాడ‌ల నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికే వారు భ‌య‌ప‌డుతారు. స‌మీప ప్రాంతాల‌ను దాటి వెళ్ల‌లేరు. చ‌దువులు, ఉద్యోగాలు, హౌసింగ్ మార్కెట్‌ను వ‌దులుకోవాల్సి ఉంటుంది. అది డిఫాక్టో హిందూ రాజ్‌గా ఉంటుంది. అంటే పూర్తిగా కంటికి క‌నిపించ‌ని కొంద‌రు ప్ర‌జ‌లు ఉంటారు. క‌నిపించే వారు ఎవ‌రంటే మెజార్టీగా ఉండే హిందువులే " అని వివ‌రించారు.

వెంట‌నే మ‌రో మాట కూడా చెప్పారు. బీజేపీకి ముస్లింల అవ‌స‌ర‌ముంద‌ని అన్నారు. " సంఘ్ ప‌రివార్‌ కు ' ఇత‌ర వ్యక్తి ' అవ‌స‌రం ఉంది. అత‌డు (ముస్లిం) అన్నీ పోగొట్ట‌కున్న‌వాడే కావ‌చ్చు. కానీ అత‌డ్ని మెజార్టీ వ‌ర్గానికి ముప్పు క‌లిగించే వ్య‌క్తిగా చూపించాల్సి ఉంటుంది " అని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఈ వాద‌న‌తో ప్రొఫెస‌ర్ అగ‌ర్వాల్ ఏకీభ‌వించారు. అయితే హిందుత్వ శ‌క్తుల‌కు తీవ్ర‌వాద ముస్లిం నాయ‌కులుగా పిల‌వ‌బ‌డుతున్న‌వారే స‌హ‌క‌రిస్తున్నార‌ని చెప్పారు. "వారు హిందుత్వ శ‌క్తుల‌ను వ్య‌తిరేకిస్తున్న‌ట్టు క‌నిపిస్తుంటారు. నిష్పాక్షికంగా ప‌రిశీలించిన‌ప్పుడు వారికి నిజంగా స‌హ‌క‌రిస్తున్నారు" అని తెలిపారు.

సంఘ్ ప‌రివార్ హిందూ బ‌హు సంఖ్యాక పాల‌న‌-హిందూ మెజారిటేరియ‌న్ రూల్‌- కావాల‌ని కోరుకుంటోంద‌న్న అభిప్రాయాల‌ను క‌పిల్ మిశ్ర తిర‌స్క‌రించారు. దేశంలో మెజార్టీగా ఉన్న హిందువులు చాలా స‌హ‌న‌శీలురు, లౌకిక వాదులు అని చెప్పారు.

''పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల‌ను చూడండి. అక్క‌డ హిందువులు మెజార్టీ సంఖ్య‌లో లేరు. అందుకే వారు స‌హ‌న‌శీలురు, లౌకిక వాదులు కారు. అందువ‌ల్ల మెజార్టీగా ఉన్న హిందువులకు ఎలాంటి ముప్పు రాకూడ‌ద‌న్న ఆందోళ‌న‌ ఉండాల‌ని అనుకుంటా. వారిని ర‌క్షించాల్సి ఉంది" అని చెప్పారు.

హిందూ రాష్ట్ర ఏర్పాటు ఎప్పుడు?

హిందూ రాష్ట్ర ఏర్పాటు ఎప్పుడు?

హిందూ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన కాల‌క్ర‌మ‌ణం ఏమిట‌న్న‌దానిపై ఇంకా స్ప‌ష్ట‌త లేదు. అయితే మ‌ద్ద‌తుదారులు మాత్రం 'మ‌నం ఆ ప‌రివ‌ర్త‌న ద‌శ‌'లో ఉన్నామ‌ని గ‌ట్టిగా న‌మ్ముతున్నారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఇప్ప‌టికే న‌మూనా రాష్ట్రంగా మారింద‌ని బీజేపీ నాయ‌కుడు క‌పిల్ శ‌ర్మ చెప్పారు. హిందూ రాష్ట్ర ఎలా క‌నిపిస్తుందో చూడ‌డానికి ఇదొక గ‌వాక్షంలాంటిద‌ని తెలిపారు.

"లౌకిక‌వాదం, స‌హ‌న‌శీల‌త‌, మ‌త స‌మాన‌త్వానికి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఆద‌ర్శ రాష్ట్రంగా మారింది. గ‌తంలో యూపీలోని చాలా ప్రాంతాల్లో రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రాళ్లు విసిరేవారు. దాని స్థానంలో ఇప్పుడు పూలు చ‌ల్లుతున్నారు. మొత్తం దేశంలో ప‌రిపాల‌న‌కు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఆశాజ‌న‌క ఉదాహ‌ర‌ణ‌గా ఉంది" అని వివ‌రించారు.

ఇండియా ఎప్ప‌టికీ హిందూ దేశంగానే ఉంటుంద‌ని ఆరెస్సెస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ ఎల్ల‌ప్పుడూ చెబుతునే ఉంటారు. హిందువులు, ముస్లింల పూర్వీకులు ఒక్క‌రే కాబ‌ట్టి ఇండియాలో జ‌న్మించిన‌వారు ఎవ‌రైనా స‌రే స‌హ‌జంగానే హిందువుల‌వుతార‌ని అంటుంటారు.

ఇండియాను హిందూ రాష్ట్రగా పిల‌వ‌డానికి ముందు చాలా ప‌నులు ఇంకా చేయాల్సి ఉంద‌ని హిందుత్వ నాయ‌కులు నిజంగానే గుర్తెరిగారు.

వారి ప్ర‌కారం అసంపూర్తిగా మిగిలిన ప‌లు లక్ష్యాలు ఇలా ఉన్నాయి...హిందువుల్లో ఐక్య‌త‌, కుల వ్య‌వ‌స్థ‌కు ముగింపు, వివిధ వ‌ర్గాల‌కు మైనార్టీ హోదా ఇచ్చే విధానానికి స్వ‌స్తి, క‌శ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదానికి ముగింపు, ముస్లింల బుజ్జ‌గింపు విధానాల‌ను ఆపివేయ‌డం, హిందుత్వ‌, హిందూ అన్న‌వి ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌మైన‌వ‌న్న 'అపోహ 'ల‌ను నివృత్తి చేయ‌డం, ఇంకా ఇలాంటివి ఉన్నాయి.

చికాగోలోని వెట‌ర‌న్ జ‌ర్న‌లిస్ట్ శ్రీ‌ధ‌ర్ దామ్లే బీబీసీతో మాట్లాడుతూ "ఓ ప‌రిణామ క్ర‌మంలో మార్పులు తీసుకురావాల‌ని ఆరెస్సెస్ కోరుకుంటోంది. ఎలాంటి ఘ‌ర్ష‌ణ‌లు లేకుండానే ల‌క్ష్యాల‌ను సాధించాల‌ని భావిస్తోంది" అని చెప్పారు. గ‌త 50 ఏళ్లుగా ఆరెస్సెస్ ఎదిగిన క్ర‌మాన్ని ఆయ‌న ప్ర‌త‌క్ష్యంగా చూశారు. దీనిపై ఆయ‌న పుస్త‌కం రాశారు. ద‌శాబ్దాల పాటు ఎంద‌రో ఆరెస్సెస్ చీఫ్‌ల‌ను క‌లిశారు. వారితో జ‌రిపిన సంభాష‌ణ‌ల ఆధారంగానే పై అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

పీఠాధిపతులు

గ‌త ఏడాది పూరీ శంక‌రాచార్య నిశ్చ‌లానంద స‌ర‌స్వ‌తి మాట్లాడుతూ ఇండియా మ‌రో మూడున్న‌రేళ్ల‌లో హిందూ రాష్ట్రగా మారుతుంద‌ని జోస్యం చెప్పారు.

మ‌రింత దృఢంగా క‌నిపిస్తున్న ఈ టైమ్‌లైన్‌ను స‌నాత‌న్ సంస్థ త‌న వెబ్‌సైట్‌లో పేర్కొంది.

2023-2025 మ‌ధ్య ఇండియా హిందూ రాష్ట్రగా మారుతుందంటూ ఆ యోగి జోస్యం చెప్పారని వివ‌రించింది.

2023-2025 మ‌ధ్య కాలంలో ఇండియాను హిందూ దేశంగా ప్ర‌క‌టించ‌డం క‌ష్ట‌మ‌ని ప్రొఫెస‌ర్ పురుషోత్తం అగ‌ర్వాల్ చెప్పారు. అయితే అది ఎంతో దూరంలో లేద‌ని అన్నారు.

"ప్ర‌తిపక్షాలు, లిబ‌ర‌ల్ శ‌క్తులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును చూస్తుంటే 2025 త‌రువాత ఇది జ‌రుగుతుంద‌న‌డానికి సందేహించ‌డం లేదు. స‌మ్మిళిత ఇండియా, గాంధీ-నెహ్రూ భావ‌జాల ఇండియాను విశ్వ‌సించేవారు అత్య‌వ‌స‌రంగా మేలుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని అనుకుంటున్నా. స‌నాత‌న్ సంస్థ‌లాంటి వాటిని సీరియ‌స్ గా ప‌ట్టించుకోవాలి" అని చెప్పారు.

ప్రొఫెస‌ర్ క్రిస్టోఫీ జెఫెర్‌లోట్ అభిప్రాయం ప్ర‌కారం హిందూ దేశం ఏర్పాటు చేయాల‌న్న స్స‌ష్ట‌మైన ప్రాధాన్య‌త‌ సంఘ్ ప‌రివార్‌కు ఉంది. "హిందూ రాష్ట్ర నిర్మాణానికి స‌మాజంలోని కూక‌టి వేళ్లు స్థాయి నుంచి ప‌రివ‌ర్త‌న తీసుకురావాల‌ని వారు అనుకుంటున్నారు. వందేళ్ల క్రిత‌మే దాన్ని ప్రారంభించారు. ఎంతో సాధించారు" అని చెప్పారు. హిందూ దేశం ఏర్పాటుకు సంబంధించిన టైమ్‌లైన్‌పై ఆయ‌న ఎలాంటి అంచ‌నాలు వేయ‌లేదు.

అయితే సంఘ్ ప‌రివార్ కావాల‌ని కోరుకునే డిఫ్యాక్టో హిందూ రాష్ట్రను మాత్రం వారు సాధించ‌వ‌చ్చు. సాధించారు కూడా అని ఆయ‌న తెలిపారు.

అయితే భార‌త్‌ను త‌క్షణ‌మే హిందూ దేశంగా ప్ర‌క‌టించాల‌ని కొంద‌రు హిందుత్వ నాయ‌కులు డిమాండు చేస్తున్నారు. కానీ ఇండియాను హిందూ దేశంగా మార్చుతా లాంఛ‌నంగా ప్ర‌క‌ట‌న చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఇంకొంద‌రు న‌మ్ముతున్నారు.

ఇండియా లౌకిక దేశం నుంచి హిందూ దేశంగా ప‌రివ‌ర్త‌న చెందుతోంద‌ని వారు అంటున్నారు.

భార‌త్‌ను హిందూ దేశంగా ప్ర‌క‌టించ‌డానికి ప్ర‌త్యేక‌మైన తేదీ అంటూ ఏమీ ఉండ‌ద‌ని, అలాంటిది ఎప్పుడూ రాద‌ని మ‌రికొంద‌రు భావిస్తున్నారు. ఇది స‌హ‌జంగా, అంత‌ర్గ‌తంగా జ‌రుగుతుందే త‌ప్ప లాంఛ‌న‌ప్రాయ ప్ర‌క‌ట‌న ద్వారా ఏర్పాటు కాద‌ని చెబుతున్నారు.

ఆరెస్సెస్ దృష్టిలో హిందూ రాష్ట్ర అంటే అప‌రిమిత‌మైన హిందూ సాంస్కృతిక ఆధిప‌త్యం.

కానీ ప్రొఫెస‌ర్ అగ‌ర్వాల్ అభిప్రాయం ప్ర‌కారం భార‌త చ‌రిత్ర‌, సంస్కృతికి హిందూ రాష్ట్ర అన్న‌ది ప్రామాణిక ప్ర‌తినిధి కాదు. అందువ‌ల్ల ఈ మొత్తం భావ‌జాలాన్ని ఆ కోణంలోనే చూడాల్సిన అవ‌స‌రం ఉంది.

హిందూ రాష్ట్ర మున్ముందు ప్ర‌యాణం పూర్తి హింసాత్మ‌కంగా ఉండే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. స‌మాజంలోని చాలా మంది దీనికి ఆమోదం తెల‌ప‌నుండ‌గా, మ‌రికొంద‌రు మౌనంగా ఉండిపోనున్నారు.

అధికారికంగా ఇండియా లౌకిక రాజ్యం. అధికారిక మ‌తం అంటూ ఏదీ లేదు. అన్ని మ‌తాల అనుయాయుల‌కూ స‌మాన హ‌క్కులు ఇచ్చింది.

అయితే ఇండియాలోని 130కోట్ల ప్ర‌జ‌ల జీవితాల‌పై మ‌తమే ఆధిప‌త్యాన్ని చ‌లాయిస్తోంది. 2024 జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్ల‌లో ఇదే ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశం కానుంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Is India becoming a Hindu country?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X